మోడీకి ఓటేసే వారు సముద్రంలో మునగాలి

28 Apr, 2014 08:50 IST|Sakshi
మోడీకి ఓటేసే వారు సముద్రంలో మునగాలి

మోడీకి ఓటేసేవాళ్లంతా సముద్రంలో మునగాలని కేంద్ర మంత్రి,  నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. మోడీకి ఓటేయని వారంతా పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలన్న బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయనిలా వ్యాఖ్యానించారు. మతతత్వం కాశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. భారత్ మతతత్వ రాజ్యంగా మారితే కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండబోదని హెచ్చరించారు. మతతత్వ శక్తుల నుంచి కాపాడాలని దేవుడిని ప్రార్థించాలని సూచించారు. ‘భారత్ మతతత్వ దేశం కాలేదు. ఒకవేళ మతతత్వాన్ని పాటిస్తే కాశ్మీర్ దేశంలో అంతర్భాగంగా ఉండదు. మతవాదం కాశ్మీర్ ప్రజలకు ఆమోదయోగ్యం కాదు’ అని ఆదివారం శ్రీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఫరూఖ్ పేర్కొన్నారు.
 
రెండు చోట్ల బాంబు పేలుళ్లు

ఆదివారం ఫరూక్ ఎన్నికల సభల్లో రెండు చోట్ల బాంబులు పేలాయి. తొలుత శ్రీనగర్‌లో ఫరూక్ ప్రసంగించే వేదిక సమీపంలో గ్రెనేడ్లు పేలటంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. మరో సంఘటనలో సెంట్రల్ బడ్గాం జిల్లా మగమ్‌లో ఫరూక్ ప్రసంగించాల్సిన వేదిక వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 14 మంది గాయపడ్డారు.

>
మరిన్ని వార్తలు