కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

16 May, 2014 01:57 IST|Sakshi

డిచ్‌పల్లి, న్యూస్‌లైన్ : డిచ్‌పల్లి సీఎంసీ కళాశాల భవనంలో శుక్రవారం నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు వె య్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తరుణ్‌జోషి తెలిపారు. గురువారం సీఎంసీ ఆవరణలో పోలీసు సిబ్బందితో ఆయ న మాట్లాడారు.  కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా నాలుగంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాల కౌంటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.దీంతో ఎన్నికల సిబ్బంది, సుమారు వెయ్యి మంది కౌంటింగ్ సిబ్బందితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చే అవకాశాలున్నాయన్నారు.

 కౌంటింగ్ ఉద యం 8 గంటలకు ప్రారంభమ వుతుందని, అయితే బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బం ది ఉదయం 4.30 గంటలకే చేరుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రానికి బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు, ఆర్మూర్, బాల్కొండ నియోజవకర్గాలకు సంబంధించిన వాహనాలు వస్తాయన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది, మీడియా వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించామని, బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నడిపల్లి నుంచి సీఎంసీ కళాశాలకు వచ్చే రోడ్డుపై ట్రాఫిక్ జాం కాకుండా చూడాల న్నారు. ఎవరికి కేటాయించిన స్థలంలో వారే వాహనా లు నిలుపేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూ పాలన్నారు.

 ఒక్కో అధికారికి పదిమంది సహాయంగా ఉంటారన్నారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు సీఎంసీ కళాశాల భవనం వెనుక వైపు ఏర్పాటు చేసిన బారికేడ్ల ద్వారా లోనికి వెళ్లాలని  సూచించారు. పాసులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రంలోని అనుమతించ రాదన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి పంపించాలన్నారు.   గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తుల్లో కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఒక్కో అంతస్తులో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాల్‌తో పాటు వరండా, భవనం చుట్టూ, చెకింగ్ పాయింట్ వద్ద బందోబస్తు ఉంటుందన్నారు.

పార్టీల నాయకులు, కార్యకర్తలు రద్దీగా ఒకచోట చేరకుండా చూడాలన్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 23 మంది సీఐలు, 64మంది ఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, నాలుగు స్పెషల్‌పార్టీలు, 240 మంది సీఆర్‌పీఎఫ్ పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తారని ఎస్పీ తెలిపారు. బందోబస్తు విధులను సక్రమంగా నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో  ఓఎస్‌డీ ప్రమోద్‌రెడ్డి, డీఎస్పీ అనిల్‌కుమార్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు