హైటెక్ ప్రచారం

23 Mar, 2014 00:32 IST|Sakshi


 ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :
సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులతో సమాచార మార్పిడిలోనూ అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కటంతో కూర్చున్నచోటు నుంచే ప్రపంచాన్ని చుట్టివచ్చే అవకాశం వచ్చేసింది. తమ అభిప్రాయాన్ని సెల్‌ఫోన్‌లో టైప్‌చేసి వేలి మొన సెల్‌ఫోన్‌ను తాకేలోపే క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోయే పరిస్థితులు వచ్చేశాయి. ఈ పరిజ్ఞానంతో ప్రజల్లోనూ అన్ని రంగాలపై అవగాహన విపరీతంగా పెరిగింది. రాజకీయంగానూ చైతన్యవంతులయ్యారు.
 
తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తపరిచే స్వేచ్ఛ రావటంతో సెల్‌ఫోన్ ఉన్న ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఎఫ్‌బీ, యూట్యూబ్, ట్విట్టర్, వాట్స్‌అప్, నింబాస్, మెసెంజర్, మైస్పేస్.. ఇలా రకరకాల నెట్‌బ్రౌజర్‌లను వాడుతున్నారు.
 
ప్రధాన ప్రచారాస్త్రం
సెల్‌ఫోన్ వినియోగదారులు భారీసంఖ్యలో పెరిగిపోవటంతో కంపెనీలు సైతం ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. దీంతో సెల్ వినియోగదారులంతా నెటిజన్లుగా మారిపోయారు.
ఇక రాజకీయ పార్టీలు సైతం ‘సోషల్ మీడియా’ను ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఆయా పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
 
ముఖ్యంగా ఫేస్‌బుక్ (ఎఫ్‌బీ)లో పార్టీల కార్యక్రమాల నుంచి తమ అభిమాన పార్టీలకు మద్దతు తెలుపుతూ నెటిజన్లు హల్‌చల్ చేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు అధికంగా ట్విట్టర్‌లో తమ మనోభావాలను పంచుకుంటున్నారు. యూట్యూబ్, వాట్సప్‌లోనూ వీడియోలు పెడుతున్నారు.
 
పార్టీల హల్‌చల్
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు జోరు పెరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, అభిమానులు పార్టీ కార్యక్రమాలను ఇంటర్‌నెట్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ఇద్దరు కలిసినా ఎఫ్‌బీ, యూట్యూబ్, ట్విట్టర్‌లో కొత్త లోగో అప్‌డేట్ అయిన కామెంట్లు, అంశాలపై విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి.
 
ఈ కోవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నట్టు తెలుస్తోంది. సామాజిక పరిస్థితులకు పూర్తిస్థాయిలో అద్దంపట్టేలా సోషల్ మీడియా విస్తరించింది. ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం పెరగటంతో సోషల్ మీడియా ఒక ఆయుధంగా మారింది.
 
చదువుకున్న విద్యార్థులు, యువతే కాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకూ సోషల్ మీడియా అవగాహన ఉందంటే ప్రజల్లోకి ఎంతలా చేరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని మునిసిపల్ ఎన్నికల అభ్యర్థులూ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు