ఆశావహులెందరో.. టికెట్ దక్కేదెవరికో?

24 Mar, 2014 00:00 IST|Sakshi

చేవెళ్ల, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో పలు రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యాయి. చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారోనని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎస్ రత్నంకు దాదాపు టికెట్ ఖరారు కాగా, బీజేపీ నుంచి గతంలో పోటీచేసి ఓడిపోయిన కంజర్ల ప్రకాశ్‌కు టికెట్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక టీడీపీ ఎవరికి టికెట్ ఇస్తుందోనని కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు.

కాంగ్రెస్‌లో మాత్రం ఈ స్థానంపై గురి పెట్టిన పలువురు నాయకులు టికెట్ తమకే వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 28 లేదా 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ప్రకటించడం ఆశావహుల్లో మరింత ఉత్కంఠకు తెరతీసింది. కొన్ని నెలలుగా ఫలానా నాయకుడికే చేవెళ్ల అసెంబ్లీ టికెట్ వస్తుందన్న అంచనాలకు మరో వారం రోజుల్లో తెరపడనుంది.

 టికెట్ ఎవరికి దక్కేనో?
 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేం దుకు ఇద్దరు సీనియర్ నాయకులతో పాటు ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ముగ్గురిలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందోనని పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెల కొంది. నియోజకవర్గ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, షాబాద్, నవాబుపేట మండలాలున్నాయి.

 ఎవరికి వారు ప్రయత్నాలు..
 2009లో పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్‌‌వ చేయడంతో అప్పటివరకు చేవెళ్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి పి.సబి తారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి మారారు. దీంతో కాంగ్రెస్ టికెట్‌ను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు కాలె యాదయ్యకు కేటాయించారు. తెలుగుదేశం పార్టీనుంచి పోటీచేసిన రత్నం కేవలం 2258 ఓట్ల తేడాతో యాదయ్యపై విజయం సాధిం చారు. ప్రస్తుతం మళ్లీ యాదయ్య సైతం పోటీలో ఉన్నానంటూ టికెట్ కోసం పైరవీలు సాగిస్తున్నారు. మరోవైపు మాజీ హోంమంత్రి సబితారెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు,  కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పడాల వెంకటస్వామి కూడా తీవ్రస్థాయిలోనే ప్రయత్నాలు చేస్తున్నారు. 2009లో ఎమ్మెల్యే టికెట్ చివరిక్షణంలో చేజారిందని, ఈ సారి కచ్చితంగా ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. టికెట్ తనకే వస్తుం దనే నమ్మకంతో వెంకటస్వామి  క్షేత్రస్థాయిలో ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు.

 తేలేందుకు మరో వారం..
 ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్ కూడా చేవెళ్ల వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈయనకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఎక్కడో ఓ చోట టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. వికారాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ ఉండటంతో అక్కడ అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పొచ్చు. దీంతో పక్క నియోజకవర్గమైన చేవెళ్ల నుంచి పోటీ చేయాలనే ఆలోచనను అధిష్టానం వద్ద చంద్రశేఖర్ వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానికేతరుడైన చంద్రశేఖర్‌కు టికెట్ ఇస్తే స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏ మేరకు సహకరిస్తారనేది అనుమానమే. ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ నుంచి చేవెళ్ల అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అదృష్టవంతుడెవరో మరో వారం రోజుల్లో అధిష్టానం తేల్చనుంది.

మరిన్ని వార్తలు