పరిషత్ ప్రచారానికి తెర

10 Apr, 2014 01:23 IST|Sakshi
పరిషత్ ప్రచారానికి తెర

 సాక్షి, గుంటూరు: మలి విడత ‘స్థానిక’ ఎన్నికలకు ప్రచారం చివరిరోజు కావడంతో బుధవారం అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కావడంతో ఆయా పార్టీల తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు ఓటుకు నోటు, ప్రలోభాల పర్వంలో బిజీగా మారారు. పల్లెల్లో మద్యం, కాపు సారా ఏరులై పారిస్తున్నారు. ఓటర్లను మద్యం మత్తులో తేలుస్తున్నారు. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఇంకా 24 గంటలే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు.



 ఈ ఎన్నికల్లో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ నడుమే పోటీ ఉంది. ఓటుకు నోటునే నమ్ముకున్న టీడీపీ నేతలు గ్రామాల్లో ఓటర్లకు రూ.వెయ్యి వంతున పంపిణీ చేస్తున్నారు. మరో రూ.500 పోలింగ్ రోజున అందిస్తామని చెబుతున్నారు. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో టీడీపీ అభ్యర్థులు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని పంపిణీని అడ్డుకున్నారు.

ఆటోలను సీజ్ చేశారు. ఇప్పటికే ఓటమి సంకేతాలు అందుతున్న నేపథ్యంలో టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. చివరి నిమిషం వరకు ప్రలోభాల పర్వం కొనసాగించేందుకు శతవిధాలా యత్నిస్తోంది.  మహిళా ఓటు బ్యాంకు వైఎస్సార్ సీపీ వైపు ఉందని అంచనా వేస్తున్న టీడీపీ నేతలు చీరెలు, ముక్కు పుడకలు, కుంకుమ భరిణలు వంటివి అందిస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

 ఇంటింటికీ ప్రచారం పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ

 ప్రజాదరణనే నమ్ముకున్న వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేసింది. గత 20 రోజులుగా పల్లెల్లో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. మలి దశలో మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తుళ్ళూరు మండలంలో గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త బాలశౌరి మండు టెండలో ప్రచారాన్ని హోరెత్తించారు. వైఎస్ పథకాల్ని గుర్తు చేస్తూ మళ్లీ వైఎస్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమని వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా చేశారు.

 ప్రత్తిపాడులో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్తంధాలపై వేసుకుని పల్లెల్లో సుడిగాలి పర్యటన చేశారు. పొన్నూరు నియోజకవర్గంలో గెలుపును పార్టీ సమన్వయకర్త రావి వెంకటరమణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు.

పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో నరసరావుపేట పార్లమెంటు అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సమన్వయకర్తలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు, జంగా కృష్ణమూర్తి విస్తృత ప్రచారం నిర్వహించారు. టీడీపీ తరఫున గుంటూరు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థులు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు మొక్కుబడి ప్రచారాన్ని నిర్వహించారు. జయదేవ్ పెదకాకానిలో రోడ్ షో నిర్వహించగా, రాయపాటి సత్తెనపల్లి నియోజకవర్గంలో కొండమోడులో పర్యటించారు.

మరిన్ని వార్తలు