బరిలో వీరులు

19 Mar, 2014 00:07 IST|Sakshi
బరిలో వీరులు

నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ :   జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మునిసిపాలిటీల్లో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది.  మున్సిపల్ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. రెండు పురపాలక సంఘాల్లో మొత్తం143 మంది పోటీలో నిలిచారు. వారంతా ప్రచారానికి సమాయత్తమవుతున్నారు.
 
 నామినేషన్ల దశలోనే  కాంగ్రెస్ చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఎలమంచిలిలో ఒక్కనామినేషన్ దాఖలు కాలేదు. నర్సీపట్నంలో ఏడుగురు ఆ పార్టీ తరపున నామినేషన్లు వేసినప్పటికీ ఐదుగురు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరే పోటీలో నిలిచారు. ఇక్కడ అన్ని స్థానాలకు వైఎస్సార్‌సీపీ పోటీలో ఉంది. ప్రధాన పత్యర్థి తెలుగుదేశం 25 స్థానాల్లో పోటీ పడుతోంది. ఒక వార్డుల్లో ఈ పార్టీకి చెందిన ఇద్దరు రంగంలో ఉండటం తో వారిని స్వతంత్రులుగా పరిగణించారు.
 
 మరో వార్డు సీపీఐకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థులు నాలుగు స్థానాల్లో పోటీకి నిలవగా, సీపీఎం మూడు, స్వతంత్రులు 23 మంది పోటీలో ఉన్నారు. యలమంచిలి మున్సిపాలిటీలో 23వార్డుల్లో 58 మంది పోటీలో ఉన్నారు. రెండో వార్డు నుంచి టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిళ్లా రమాకుమారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ నుంచి 23 మంది, టీడీపీ నుంచి 23 మంది, బీజేపీ నుంచి నలుగురు, సీపీఎం నుంచి ఇద్దరు, ఆరుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ మున్సిపాలిటీ లో మొత్తం 135 నామినేషన్లు దాఖలు కాగా మంగళవారం ఒక్క రోజునే  66మంది ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల కేంద్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు  సందడిగా కనిపించాయి. రెండు పట్టణాల్లోనూ వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్యే ప్రధానపోటీ నెలకొంది.
 

మరిన్ని వార్తలు