జనం గొర్రెల్లా కనిపిస్తున్నారా?

21 Mar, 2014 00:56 IST|Sakshi
జనం గొర్రెల్లా కనిపిస్తున్నారా?

టీడీపీ అధినేత చంద్రబాబు హామీలపై షర్మిల నిప్పులు
 
 నెల్లూరు, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల ముందు హామీలివ్వడం, తర్వాత వాటిని మర్చిపోవడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అలవాటేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి సోదరి షర్మిల విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా చీమకుర్తి, కనిగిరిలలో జరిగిన బహిరంగ సభల్లో షర్మిల మాట్లాడారు. 1994 ఎన్నికల్లో కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం నినాదంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత చంద్రబాబు వాటిని తుంగలో తొక్కారని ఆమె గుర్తుచేశారు.

 

1999 ఎన్నికల్లో మహిళలకు బంగారు మంగళసూత్రాలు, ఆడ పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య, కోటి ఉద్యోగాలు, ఆడపిల్ల పుడితే 5 వేల రూపాయలు, విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇస్తామని స్వయంగా వాగ్దానాలు చేసిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వాటిగురించి మర్చిపోయారని మండిపడ్డారు. సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని, వ్యవసాయం దండగన్నారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారం కోసం రుణమాఫీ, ఉచిత విద్యుత్, ఆల్‌ఫ్రీ అంటున్నారు. ఇవన్నీనమ్మడానికి ప్రజలేమన్నా గొర్రెలనుకుంటున్నారా చంద్రబాబూ? అని ఆమె నిలదీశారు. సీల్డ్ కవర్ ద్వారా సీఎంగా ఊడిపడిన కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉండగా జనానికి ఏమీ చేయకుండా ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఉద్ధరిస్తానంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆమె ప్రశ్నించారు.
 

 

>
మరిన్ని వార్తలు