తమ్ముడూ సెలైంటై పో..!

26 Apr, 2014 03:00 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఓట్లతో తలపడేకంటే... నోట్లతో ప్రత్యర్థి నోరు మూయిస్తే... అంతకు మించిన ఎన్నికల రణతంత్రం ఏముంటుంది? అలుపు సొలుపు లేకుండా.. అవలీలగా గెలుపును తమ సొంతం చేసుకునేందుకు జిల్లాలోని కొందరు అభ్యర్థులు ఈ ఎత్తుగడను అమలు చేస్తున్నారు. నేరుగా ఎన్నికల బరిలో తమకు సవాలు విసురుతున్న అభ్యర్థులతోనే బేరసారాలు ఆడుతున్నారు.
 
 నయానో భయానో వారిని ఒప్పించి మెప్పించే అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అవసరమైతే మధ్యవర్తుల సాయంతో.. అడిగినన్ని ముట్టజెప్పి.. కోరిన వరాలన్నీ నెరవేర్చేందుకు వెనుకాడటం లేదు. ఏదో ఓ రకంగా.. ప్రత్యర్థిని బుజ్జగించి ప్రచార పర్వం నుంచి సెలైంట్‌గా పక్కకు తప్పిస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో గతంలోనూ ఇదే ఎన్నికల వ్యూహం అమలైంది. 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన గోమాస శ్రీనివాస్ ప్రచారపర్వం నుంచే పత్తా లేకుండా పోయారు. ఎన్నికలంటే పట్టింపు లేనంతగా దూరదూరంగా ఉన్నారు.
 
 ఈసారి కూడా ఇక్కడ ప్రధాన పార్టీకి చెందిన ఓ ఎంపీ అభ్యర్థి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. మరో అభ్యర్థి అనారోగ్యం పేరుతో ప్రచారానికి డుమ్మా కొట్టడం... తనకు తోచినన్ని సెలవులు పెట్టడం చేస్తున్నారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులు అసలు పోటీలో ఉన్నారా..? లేదా..? అన్నట్లుగా ఓటర్లు అనుమానించే పరిస్థితి నెలకొంది. విజయధీమాతో ఉన్న ఓ అభ్యర్థి వ్యూహాత్మకంగానే ప్రత్యర్థుల నోరు మూయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అడిగినంత ముట్టజెప్పి.. అవసరమైతే అంతకు రెండు మూడింతలు.. అంటగట్టి ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేసినట్లుగా చర్చ జరుగుతోంది. దీంతో ఇక్కడి పోటీ ఏకపక్షంగా సాగుతుందనే ప్రచారం బలపడింది.
 
 ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఓట్ల పోటీ కంటే.. నోట్ల పోటీ జోరుగా సాగుతుందనే ప్రచారం బలపడింది. వరుసగా ఇక్కడ విజయాలు నమోదు చేసుకున్న కుటుంబంతో ఆర్థికంగా పోటీ పడే స్తోమత లేకపోవటంతో... ఇతర పార్టీల అభ్యర్థులు సునాయాసంగా అమ్ముడు పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సెగ్మెంట్‌లోని పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఈసారి అదే ఎన్నికల వ్యూహం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే విజయరమణారావు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, టీఆర్‌ఎస్ నుంచి మనోహర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో ఇద్దరి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. దీంతో బలం.. బలగం సన్నగిల్లిన మూడో అభ్యర్థిని సెలైంట్ చేసేందుకు విన్నింగ్ రేసులో ఉన్న ప్రధాన అభ్యర్థి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ‘ఎలాగూ ఓడిపోతావ్ తమ్ముడూ.. మూడో స్థానంలో ఉండే కంటే.. నీ ఓట్లు నాకు బదిలీ చేస్తే.. నేను సునాయాసంగా గెలిచిపోతా...’ అంటూ ఒకరిని పోటీ నుంచి తప్పించేందుకు మధ్యవర్తులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడ పోటీ త్రిముఖం నుంచి ద్విముఖ పోరుగా మారిపోతుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో త్రిముఖ పోటీ ఉన్న మరో రెండు రిజర్వుడ్ స్థానాల్లోనూ ఎవరో ఒకరిని సెలైంట్ చేసేందుకు... బడా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. టిక్కెట్ల రేసులో భంగపడ్డ అభ్యర్థులను బుజ్జగించేందుకు ఒక ప్రధాన పార్టీ పక్కాగా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. అసంతృప్తిని చల్లార్చేందుకు తలా కొంత నగదు ప్యాకేజీ ముట్టజెప్పి సెలైంట్ చేసింది.
 
 కొన్ని సెగ్మెంట్లలో తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగి... తమ కంట్లో నలుసుగా మారిన వారిపై చివరి క్షణం వరకు ఇదే ఎత్తుగడను అమలు చేయాలని ఒకరికి మించి ఒకరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు మించి ఇండిపెండెంట్ల హవా కొనసాగుతున్న రామగుండం నియోజకవర్గంలో ఇదే వ్యూహం చాపకింద నీరుగా పని చేస్తోంది. ఈ నగదు బదిలీ పర్వం అక్కడ ఎవరి పంట పండిస్తుందో.. ఎవరిని పోటీ నుంచి తప్పిస్తుందో.. అనేది ఆసక్తి రేపుతోంది.
 

మరిన్ని వార్తలు