ఒకే ఒక్కడు: సీతారాం

19 May, 2014 03:00 IST|Sakshi
ఒకే ఒక్కడు: సీతారాం

 వరంగల్, న్యూస్‌లైన్: జిల్లాలో తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్ సీతారాం నాయక్ మినహా...  తొలి ఎన్నికల అనుభవం పలువురికి చేదుజ్ఞాపకాలనే మిగిల్చింది. సార్వత్రిక ఎన్నికల్లో సంచలనాత్మక తీర్పునిచ్చిన జిల్లా ఓటర్లు... కొత్త నేతలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. తొలిసారి ఎన్నికల్లో పోటీచేసిన నేతలకు అవకాశం కల్పించలేదు. జిల్లాలో 12 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలున్నారుు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఒక ఎంపీ, 12 మంది ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 13 మంది ప్రజాప్రతినిధులు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారే.
 
గత ఎన్నికల్లో పోటీచేసిన అనుభవంతోనే తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం వారికి సులువైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో గులాబీ గాలి వీయడంతో జిల్లాలో మెజార్టీ స్థానాలు ఆ పార్టీకి దక్కారుు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రజలు గట్టి షాకిచ్చి మార్పును కోరుకున్నారు. తొలిసారి పోటీచేసిన వారికి అవకాశం కల్పించకుండా అనుభవానికి, పాతనేతలకే పట్టం కట్టారు.
 
 తొలి పోటీ చేదు జ్ఞాపకం

 ఈ ఎన్నికల్లో  ప్రధాన పార్టీల నుంచి తొలిసారి ఎన్నికల బరిలో దిగిన నేతలందరికీ చేదు అనుభవమే మిగిలింది. ఒకే ఒక్కరికి మాత్రం పదవీయోగం దక్కింది.  మహబూబాబాద్ ఎంపీగా టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్‌ను విజయం వరించింది. ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు. ఇక జిల్లాలో పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగాల వెంకట్రాంరెడ్డి, టీఆర్‌ఎస్ తరఫున ముద్దసాని సహోదర్‌రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగి ఓటమిపాలయ్యారు.గతంలో ఎమ్మెల్సీగా పోటీచేసి విజయం సాధించినప్పటికీ వరంగల్ పశ్చిమ నుంచి ఆర్‌ఎల్‌డీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి పర్యాయం పోటీచేసిన కపిలవాయి దిలీప్‌కుమార్ ఓటమి చవిచూశారు.
 
భూపాలపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన గండ్ర సత్యనారాయణరావును జనం ఆదరించలేదు. నర్సంపేటలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్‌రెడ్డి, కత్తి వెంకటస్వామిలకు ఓటమి తప్పలేదు. మహబూబాబాద్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన బానోతు మోహన్‌లాల్, మహబూబూబాద్, డోర్నకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తొలిసారి పోటీచేసిన బాలుచౌహాన్, రామచంద్రునాయక్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేసిన రావు పద్మకు ఇదే పరిస్థితి ఏర్పడింది.
 
 ఓటమి నుంచి తొలి గెలుపు
 తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ గతంలో పోటీచేసి ఓడిపోయినవారే. జనగామ నుంచి గెలిచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గతంలో వర్ధన్నపేట నుంచి పోటీచేసి ఓడిపోయారు. పరకాల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి గతంలో పరకాల నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. నర్సంపేట నుంచి విజయం సాధించిన దొంతి మాధవరెడ్డి గతంలో ఇక్కడే ఓడిపోయారు. మహబూబాబాద్ నుంచి గెలిచిన బానోత్ శంకర్‌నాయక్ గతంలో ఇక్కడే పోటీచేసి ఓటమి చవిచూశారు. వర్ధన్నపేట నుంచి గెలిచిన ఆరూరి రమేష్ గత ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌లో పోటీచేసి ఓడారు.
 
 పాతవారికే పట్టం
 జిల్లా ప్రజలు ఈ సారి సిట్టింగ్‌లకు కోలుకోలేని షాకిచ్చారు. ఇద్దరు టీఆర్‌ఎస్, ఒక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్ప, కాంగ్రెస్‌కు చెం దిన సిట్టింగ్‌లందరూ ఓటమిబాటపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో డాక్టర్ రాజయ్య, వినయ్, ఎర్రబెల్లి మాత్రమే విజయం సాధించా రు. అరుుతే జిల్లా ఓటర్లు సిట్టింగ్‌ల మార్పు కోరుకున్నప్పటికీ... పా తవారికే పట్టం కట్టారు. భూపాలపల్లి, ములుగు, డోర్నకల్, వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మధుసూదనాచారి, చందూలాల్, రెడ్యానాయక్, కొండా సురేఖకు అవకాశం కల్పించా రు. వరంగల్ ఎంపీగా మాజీ మంత్రి శ్రీహరిని గెలిపించారు.

మరిన్ని వార్తలు