ముగిసిన ప్రాదేశికం

12 Apr, 2014 01:30 IST|Sakshi
ముగిసిన ప్రాదేశికం

 రెండోవిడతలో పోలింగ్ 87.23%
 మొత్తం పోలైన ఓట్లు 7.72 లక్షలు
 అత్యధికం.. బొమ్మలరామారం,
 అత్యల్పం.. నకిరేకల్ మండలం
 రెండు విడతల్లో కలిపి 86.41శాతం

 
 నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల నగారా ముగి సింది. పలుచోట్ల చెదరుమదురు సంఘట నలు మినహా ఎన్నికలు ప్రశాతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో 59జెడ్పీటీసీ, 817ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. తొమ్మిదేళ్ల తర్వాత జరిగిన ఈ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అహర్నిశలు శ్రమించారు.

అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడ్డాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, బీజేపీలు జట్టుగా ఏర్పడి తమ అభ్యర్థులను బరిలో దింపాయి. అవగాహన మేరకు కుదుర్చకున్న పొత్తులకు అనుగుణంగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను పంచుకున్నాయి. కాంగ్రెస్‌కు ధీటుగా టీఆర్‌ఎస్ 53 స్థానాల్లో పోటీ చేయగా, ప్రాదేశిక ఎన్నికల్లో తొలి సారిగా అడుగుపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చింది.

 చిలుకూరు స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిచింది. మిగిలిన 58 చోట్ల పోటీ చేసింది. కాగా ఎన్నికల ఘట్టం ముగియడంతో ఫలితాల కోసం అభ్యర్థులు మరికొంత కాలం వేచిచూడక తప్పదు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప మే 7 తర్వాత ఫలితాలు వెల్లడించే పరిస్థితి ఉంది.

 రెండోవిడత ప్రశాంతం
 రెండో విడత ఎన్నికలు భువనగిరి, నల్లగొండ డివిజన్‌లోని 26 మండలాల్లో శుక్రవారం నిర్వహించారు. 26జెడ్పీటీసీ, 353ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు 179 మంది, ఎంపీటీసీ 1473 మంది పోటీ చేశారు.  భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లో సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లో 8,85,975ఓటర్లకు గాను 7,72,876మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ 87.23 శాతంగా నమోదైంది. అత్యధికంగా బొమ్మల రామారం మండలంలో 92.78 శాతం, అత్యల్పంగా నకిరేకల్ మండలంలో 81.60 శాతం పోలింగ్ నమోదైంది.

 నల్లగొండ డివిజన్‌లో..
 నల్లగొండ డివిజన్‌లో 12జెడ్పీటీసీ, 160 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ డివిజన్‌లో మొత్తం  ఓటర్లు 4,09,534కు గాను, 3,52,399 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

 భువనగిరి డివిజన్‌లో
 ఈ డివిజన్‌లో 14జెడ్పీటీసీ, 193ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ డివిజన్‌లో 4,76,441మంది ఓటర్లకు గాను 4,20,477 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.

>
మరిన్ని వార్తలు