ఆదరణ అపూర్వం

20 Mar, 2014 03:21 IST|Sakshi
ఆదరణ అపూర్వం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల ప్రచారం నిమిత్తం బుధవారం గూడూరు, నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలకు ప్రజలు నీరాజనాలు పలికారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు వద్ద మహిళలు, వృద్ధులు, యువకులు పెద్దసంఖ్యలో ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గూడూరు పట్టణంలోకి షర్మిల అడుగుపెట్టగానే జనం బాణాసంచా కాల్చుతూ, పూల వర్షం కురిపిస్తూ ఆమెను స్వాగతించారు. పట్టణంలో సుమారు మూడు గంటల పాటు ఆమె జరిపిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. షర్మిలను చూడటానికి జనం ఇళ్లలో నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు.
 
 ఆమె కోసం గంటల తరబడి రోడ్డు మీద ఎదురు చూశారు. వాహనం మీద నుంచి షర్మిల ప్రజలకు అభివాదం చేస్తూ పలుకరించుకుంటూ వెళ్లారు. యువకులు ఆమె కాన్వాయ్ వెంట పరుగులు తీస్తూ జై జగన్, జై షర్మిల అంటూ నినాదాతో హోరెత్తించారు. షర్మిల రోడ్‌షో గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ కేడర్‌కు రెట్టించిన ఉత్సాహం ఇవ్వగా, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఇక్కడ మున్సిపల్ అభ్యర్థులను, త్వరలో జరగబోయే ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాదరావును, గూ డూరు ఎమ్మెల్యేగా పోటీచేయబోయే పాశం సునీల్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ ప్రజలకు వారిని పరిచయం చేస్తూ ముం దుకు సాగారు. సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన నెల్లూరు సభ రాత్రి 7 గంటలకు వీఆర్ కాలేజ్ సెంటర్‌లో ప్రారంభమైంది. సాయంత్రం 5 నుంచే వేలాది మంది జనం రాజన్న బిడ్డ కోసం ఎదురు చూశారు.

ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు అబద్ధాల రాజకీయం గురించి షర్మిల చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. చంద్రబాబును ఎవరు ప్రధాని చేస్తామని పిలిచారు? ఆయనకు అంత సీన్ లేదు అంటూ ఆమె వదిలిన పంచ్ డైలాగులు జనాన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా జనం గురించి పట్టించుకోకుండా పదవిలో నుంచి దిగిపోయాక పార్టీ పెట్టి జనాన్ని ఉద్ధరిస్తానంటే ఎవరు నమ్ముతారంటూ ఆమె ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. ఇక్కడ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి అజీజ్‌ను, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ప్రజలకు పరిచయం చేస్తూ, వీరందరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని షర్మిల అభ్యర్థించారు.
 

మరిన్ని వార్తలు