మూడు వారాల్లో వైఎస్ సంక్షేమ రాజ్యం

28 Apr, 2014 00:38 IST|Sakshi
ఆదివారం విశాఖ జిల్లా పాడేరులో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రసంగిస్తున్న వైఎస్ విజయమ్మ

పాడేరు, అరకు, కొత్తవలస బహిరంగ సభల్లో వైఎస్ విజయమ్మ

సాక్షి, విశాఖపట్నం/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ‘‘మరో మూడు వారాలు ఆగండి. కష్టాలు పడుతున్న మీ అందరికి మీ మనవడు పింఛన్లు అందిస్తారు. వృద్ధులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 చొప్పున ఇస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని తీసుకువస్తారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. జగన్ కూడా రాజన్న రాజ్యాన్ని తీసుకువస్తారు. జగన్ వైఎస్‌లా మంచి నాయకుడు. మనసున్న నేత. జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో అయిదు సంతకాలు చేస్తారు. అవి రాష్ట్ర చరిత్రనే తిరగరాస్తాయి. కష్టాల్లో ఉన్న మా కుటుంబానికి మీరంతా వెన్నుదన్నుగా నిలబడ్డారు.

మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. చంద్రబాబు మీ అందరినీ నమ్మించడానికి కల్లబొల్లి హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మకండి. విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన చంద్రబాబే. ఆయన ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు ఇవ్వబట్టే ఈరోజు రాష్ట్రం ముక్కలైంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చెప్పారు. ఆదివారం విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఎన్నికల ప్రచారంలో విజయమ్మ పాల్గొన్నారు. పాడేరు, అరకు, కొత్త వలస బహిరంగ సభల్లో ప్రసంగించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన రోడ్‌షోలలోనూ ప్రసంగించారు.


 భారీ వర్షంలోనూ విజయమ్మకు గిరిజనం బ్రహ్మరథం
 వైఎస్ విజయమ్మ తొలిసారిగా విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతానికి రావడం తో ప్రజలు సంతోషంలో మునిగిపోయారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎన్నో సంక్షేమ పథకాలను అందుకున్న తమకు ఆయన భార్యను తొలిసారిగా చూసే భాగ్యం దక్కడంతో గిరిజనం పండుగ చేసుకున్నారు. పాడేరు, అరకు బహిరంగ సభలకు వేలాదిగా తరలివచ్చారు.

విజయమ్మ ప్రసంగాలకు జై కొట్టారు. విజయమ్మ పాడేరుకు చేరుకోగానే సభా వేదికకు కిలో మీటరున్నర ముందు నుంచే వేలాది జనం ర్యాలీగా ఆమె కాన్వాయ్ వెంట నడిచారు. అరకులోనూ విజయమ్మకు విశేష ఆదరణ లభించింది. జోరున వర్షం కురుస్తున్నా, ఆమెను చూసేందుకు ప్రజలు గంటల తరబడి అక్కడి నుంచి కదల్లేదు. వర్షంలోనే తడుస్తూ విజయమ్మ ప్రసంగాన్ని ఆసాంతం విన్నారు.

 ప్రచార రథానికి తప్పిన ప్రమాదం
 విశాఖ ఏజెన్సీలో విజయమ్మ కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ప్రచార రథానికి ప్రమాదం తప్పింది. ఆ సమయంలో వాహనంలో విజయమ్మ లేరు. ఆదివారం సాయంత్రం ఆమె అరకులో ప్రచారరథంపై నుంచి ప్రసంగించి అనంతరం తన వాహనంలో ఘాట్‌రోడ్డులో తిరుగు ప్రయాణమయ్యారు.

ఆ సమయంలో కాన్వాయ్‌లో ముందుగా వెళ్తున్న ప్రచారరథానికి అనంతగిరి మండలం డముకు సమీపంలో 5వ నంబరు మలుపు వద్ద  బ్రేకులు ఫెయిలయ్యాయి. గమనించిన డ్రైవరు సమయస్ఫూర్తితో రోడ్డు పక్కన కొండ అంచును ఢీకొట్టించి ఆగేలా చేశారు. నెమ్మదిగా వస్తుండటం వల్ల ప్రమాదం జరగలేదు.  ఆ తర్వాత కాన్వాయ్‌లోని వాహనాలు ముందుకు సాగిపోయాయి. మరమ్మతులు చేసిన అనంతరం ప్రచార రథాన్ని విశాఖకు తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు