కాంగ్రెస్ ఓటమి ఖరారు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ఓటమి ఖరారు

Published Mon, Apr 28 2014 12:43 AM

కాంగ్రెస్ ఓటమి ఖరారు - Sakshi

* దేశవ్యాప్తంగా ఇంకా ఎన్నికలు ముగియకముందే ఆ పార్టీ దీన్ని గుర్తించింది: బీజేపీ నేత నఖ్వీ
* మూడో కూటమికి మద్దతు వ్యాఖ్యలు ఇందులో భాగమే
* ఫలితం తెలిసిపోవడంతో మోడీపై  ప్రేలాపనలు
* ఎన్డీఏ 350కి పైగా సీట్లు సాధిస్తుంది
 
సాక్షి, హైదరాబాద్: ఇంకా పోలింగ్ ముగియకున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమి ఖరారైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈ విషయం ఆ పార్టీ కూడా గుర్తించిందని, అందుకే దాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ నేతలు బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీపై అభ్యంతరకర భాషలో విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఇంకా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తికాకుండానే మూడో కూటమికి మద్దతు గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీ ఓడిపోతోందనే విషయాన్ని వారు ప్రజలకు చెప్పకనే చెబుతున్నారని నఖ్వీ అన్నారు. ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో ‘జీడీపీ’ ప్రధాన భూమికను పోషిస్తోందని చెబుతూ... జి అంటే గుడ్‌గవర్నెన్స్, డి అంటే డెవలప్‌మెంట్, పి అంటే ప్రాస్పెరిటీగా అభివర్ణించారు. యూపీఏ పదేళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగపడే పది పనులు కూడా సాగని తరుణంలో దేశం బాగా వెనుకబడిందని జనం గుర్తించారని ఆయన చెప్పారు. దీంతో మోడీ ప్రధాని అయితేనే దేశ పురోగతి సాధ్యమనే విషయాన్ని కులమతాలకతీతంగా ప్రజలు గుర్తించారని కూడా నఖ్వీ తెలిపారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్‌ను దివాళాకోరు పార్టీ అని ఆయన అభివర్ణించారు. మతిచలించి మాట్లాడుతున్న సోనియా, రాహుల్, ప్రియాంక సహా ఆ పార్టీ సీనియర్ నేతల కోసం మంచి వైద్యుల బృందాన్ని సిద్ధం చేసుకుంటే బాగుంటుందని నఖ్వీ ఎద్దేవా చేశారు. మోడీ కోసం ముందుకు వస్తున్న ప్రజలను కిరాయి మనుషులుగా పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సాధారణ ప్రజలను అవమానపరుస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే ఆ పార్టీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారని నక్వీ తెలిపారు.

నఖ్వీ ఇంకా ఏమన్నారంటే....
* ఎన్నికలు పూర్తయిన 350 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి స్పష్టమయింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్డీఏ 350పైగా సీట్లతో ఘనవిజయం సాధిస్తుంది.

* ఎన్నికలప్పుడే మైనార్టీల జపంచేసే పార్టీలకు బుద్ధి చెప్పడానికి ముస్లింలు పెద్దసంఖ్యలో మోడీకి అనుకూలంగా ఓటేస్తున్నారు.

* మోడీని ఎవరెక్కువ తిడతారో అనే ఓ ఫ్యాషన్ పరేడ్ పోటీ జరుగుతోంది. రాహుల్, ప్రియాంక, ములాయం, కేసీఆర్ తదితరులు అందులో పాల్గొంటున్నారు. వీరంతా రాజకీయంగా, నైతికంగా పతనమవుతున్నారు.

* హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం పార్టీకి రాజ్యాంగంపై నమ్మకం లేదు. నిత్యం దాన్ని అవమానిస్తోంది.
* ఇలాంటి రాజకీయ పార్టీలతోనే దేశం తీవ్రంగా నష్టపోతోంది, బీజేపీది అభివృద్ధితో కూడిన సెక్యులర్ విధానం.

* పదేళ్లుగా ఎన్నో కుంభకోణాలకు 10 జన్‌పథ్ (సోనియా నివాసం) కేంద్రబిందువుగా మారింది.
* డిప్యుటేషన్ ప్రధానిగా మన్మోహన్ ఉంటే, సూపర్ ప్రధానిగా సోనియా వ్యవహరించి దేశాన్ని నాశనం చేశారు.
* కాంగ్రెస్ హయాంలోనే దేశంలో ఎక్కువ మతకలహాలు జరిగాయి. కమ్యూనల్‌షీట్ తెరిస్తే అది కాంగ్రెస్ పేరిటే ఉండాలి.

Advertisement
Advertisement