ఒక తెలంగాణ దళితుడి ఆత్మకథ- నియతి

12 Dec, 2014 23:50 IST|Sakshi
ఒక తెలంగాణ దళితుడి ఆత్మకథ- నియతి

బేగరి కులం అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు. మాల సామాజిక వర్గంలో కాటికాపరులుగా పని చేసేవారిని తెలంగాణలో ఈ కులంవారిగా పరిగణిస్తారు. ఒకప్పుడు తెలంగాణలో శవం దహనకాండ నిర్వహించినందుకు కాటికాపరికి ఏం దక్కేదో తెలుసా? శవం మీద కప్పిన గుడ్డ. శవం తల దగ్గర పెట్టిన కుండలోని చిల్లర. అంతే. ‘ఆ గుడ్డతో మా అయ్య సొక్కా కుట్టించుకునేటోడు’ అంటారు భూతం ముత్యాలు తన ఆత్మకథలో. నల్లగొండ జిల్లాలోని నాంపల్లి ప్రాంతంలో ఒక నలభై ఏళ్ల క్రితం పుట్టిన ఈ రచయిత తన కుటుంబం, తన కులం పట్టెడు మెతుకుల కోసం ఎంత పోరాటం సాగించవలసి వచ్చిందో, కాసింత ఆత్మగౌరవం కోసం, తామూ మనుషులమే అనే ఉనికి కోసం ఎంత పెనుగులాడవలసి వచ్చిందో తన ఆత్మకథ ‘నియతి’లో వినిపిస్తారు.

దాదాపు 80 పేజీలు ఉన్న ఈ ఆత్మకథంతా ఈ రచయిత అందరిలాగే తనూ చదువుకోవడానికి చేసిన పోరాటం. ఎందుకు దీనిని పోరాటం అనవలసి వస్తోందంటే తన వాడలో తన కులంలో టెన్త్ పాసైన మొదటి పోరడు ఈ రచయితే. కాని అతడు టీచరయ్యాక సాటి టీచర్లు, పెద్ద కులం వాళ్లు ‘ఇంకా మీకు రిజర్వేషన్లు కావాల్నా’ అని అడుగుతారు, అంతా బాగుపడిపోయారు కదా అనే ధోరణిలో. ఎందుకు అవసరంలేదు? అంటాడు రచయిత. తన తర్వాత తన వాడలో మరొక కుర్రాడు టెన్త్ పాసైతే కదా. అంబేద్కర్ పుణ్యమా అని దళితుల జీవితాల్లో వచ్చిన కాసింత వెలుగునూ తట్టుకోలేక తీవ్రమైన వివక్ష చూపి, వేధింపులకు గురిచేసే అనుభవాలు ఈ పుస్తకంలో చూస్తాం. మంచి టీచర్‌గా పేరు తెచ్చుకున్నందుకు, కేవలం పాఠాలు చెప్పడంతో సరిపుచ్చక బొమ్మలు గీయడం, వాల్ పెయింటింగ్‌లాంటి పనులు చేసినందుకు ‘అన్నల’తో సంబంధం అంటగట్టి హింసించడంతో ఇంత మనిషీ ఆత్మహత్యాయత్నం చేయవలసిరావడం కంటే విషాదం ఏమైనా ఉందా? దారుణమైన పరిస్థితుల్లో హైదరాబాద్ వచ్చి రిక్షా తొక్కి ఆ వచ్చిన డబ్బుతో డిగ్రీ చదువుకుని టీచర్ అయిన భూతం ముత్యాలు కంటికి కనపడవచ్చు. ఇదంతా చేయలేక రాలిపోయిన వేలాది, లక్షలాది దళితుల మాటేమిటి? ఈ దేశంలో దళితుల జీవితం ఒకప్పుడు సులువు కాదు. ఇప్పుడూ సులువు కాదు. నిత్యపోరాటం అది. దానిని ఎన్ని విధాలుగా మరెన్ని వైనాలుగా చూపి, రాస్తేనే సమాజానికి దళితుల గురించి తెలుస్తుంది. ప్రతీదానికి వారు ఎందుకు సమానమైన హక్కుదారులో ఇంకా చెప్పాలంటే కాసింత ఎక్కువ హక్కుదారులో కూడా తెలుస్తుంది. ‘నియతి’ ఉర్దూ మాట. ‘నియ్యత్’ నుంచి వచ్చింది.

అంటే బుద్ధి అని అర్థం. ‘జైసీ నియ్యత్ వైసీ బర్కత్’ అని తెలంగాణలో సామెత. దళితుల నియతి ఏమిటి? కష్టించడం, పని చేయడం. ఒకరిని ముంచకుండా బతుకుదాం అనుకున్నా కూడా ఎప్పుడూ తమను అణచే రాజకీయాలు ఎందుకు జరుగుతుంటాయి అని ఆవేదన చెందుతారు రచయిత. తెలంగాణ శుద్ధ పలుకుబడిలో రాసిన ఈ ఆత్మకథ హాయిగా చదివిస్తుంది. ఒక కాలపు జీవితాన్ని శకల మాత్రంగానైనా పరిచయం చేస్తుంది. ముఖ్యంగా దళితుల పట్ల దళితేతరుల వైఖరిలో విశాలత్వాన్ని ప్రతిపాదిస్తుంది.
 నియతి- భూతం ముత్యాలు ఆత్మకథ
 వెల: రూ.50, ప్రతులకు: 9490437978
 

మరిన్ని వార్తలు