బోర్‌ రీచార్జ్‌తో నీటి భద్రత

4 Jun, 2019 07:12 IST|Sakshi

 నీటిచుక్క కరువైన కష్టకాలంలో జీవనాధారమైన పంటలు, తోటలు, పశువులు, చిన్న జీవాలు విలవిల్లాడుతుంటే రైతు మనసు ఎంతగా తల్లడిల్లు తుందో చెప్పలేం. అటువంటప్పుడు బోర్లు కూడా ఎండిపోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, బోర్లు ఎండిపోకుండా చూసుకునే ఒక ఉపాయం ఉంది. బోరు బావి చుట్టూ ఇంకుడుగుంత నిర్మించుకుని.. వాన నీటిని ముందుచూపుతో భూమి లోపలకు ఇంకింపజేసుకుంటే.. ఎండాకాలంలోనూ నీటికి కొదవ ఉండదు. అలా పచ్చగా అలరారుతున్న రైతన్నల విజయ గాథలు ఈ వారం ప్రత్యేకం.. 


బోరు చుట్టూ ఇంకుడు గుంత నిర్మించేదెలా?

బోరు బావి చుట్టూ వాన నీటి ఇంకుడు గుంత నిర్మించుకోవడానికి సంబంధించి ఈ రంగంలో అనుభవజ్ఞులైన భూగర్భ జల నిపుణులు, వాటర్‌ అండ్‌ లైవ్‌లీహుడ్స్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌. వి. రామమోహన్‌ అందించిన సాంకేతిక సమాచారం ఇది. 

  •      బోరు బావి చుట్టూ 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు, 10 అడుగుల లోతున (10“10“10 అడుగులు) గుంత తవ్వాలి. 
  •      ప్లాస్టిక్‌ కేసింగ్‌ పైపు నాణ్యతను సరిచూసుకోవాలి. అది పాడైతే కొత్త పీవీసీ పైపు వేసుకోవాలి. దాని అడుగు భాగాన ఐరన్‌ క్లాంప్‌ను అమర్చి కేసింగ్‌ పట్టు సడలిపోకుండా జాగ్రత్తపడాలి. 
  •      కేసింగ్‌ పైపునకు 1.2 మీటర్ల ఎత్తున అన్ని వైపులా.. నిలువుగా 3–4 అంగుళాల పొడవున.. ఎగుడుదిగుడుగా గాట్లు (స్లాట్స్‌)గా కత్తిరించాలి. 
  •      గుంతను నాలుగు దొంతర్లలో వివిధ సైజుల రాళ్లతో నింపి, పైపొరగా ఇసుక వేయాలి. అడుగు ఎత్తు నుంచి ఆరు అడుగుల ఎత్తు వరకు 30–40 సెంటీ మీటర్ల వ్యాసార్థం కలిగిన రాళ్లను వేయాలి. వాటి పైన ఒక అడుగు మందాన 15–20 సెంటీ మీటర్ల సైజు రాళ్లను పేర్చాలి.
  •      ఆపైన ఒకటిన్నర అడుగు మందాన 7,5 సెంటీ మీటర్ల సైజు చిన్న రాళ్లను పేర్చాలి. 
  •      ఆ పైన హెచ్‌.డి.పి.ఇ. 1 ఎం.ఎం. బెజ్జాలున్న నెట్‌ను పరిచి, దానిపై 1 అడుగు మందాన ముతక ఇసుకను పోయాలి. 
  •      చెత్తా చెదారాన్ని భూమి పైనే వడకట్టి స్వచ్ఛమైన వర్షపు నీటి వరదను బోరులోకి అతి తక్కువ సమయంలో ఇంకింపజేయడానికి ఇది ఉపయోగపడుతుంది. 
  •      బోరు చుట్టూ ఇటుకలు, సిమెంట్‌తో అడుగు భూమి లోపలకు, అడుగు పైకి ఉండాలా పిట్ట గోడను నిర్మించాలి. 
  •      ప్రతి ఏడాదీ పైన 2 నుంచి 3 అంగుళాల మేరకు ఉన్న ఇసుకను తొలగించి, కొత్త ఇసుక నింపాలి. వర్షపు నీరు త్వరగా ఇంకడానికి కొత్త ఇసుక దోహద పడుతుంది. 
  • ∙ఈ గుంత వైపు ఎగువ నుంచి వర్షపు నీరు వచ్చేలా చిన్న మట్టి కాలువను ఏర్పాడు చేసుకోవడం ముఖ్యం. దీని నిర్మాణానికి రూ. 25 వేల నుంచి 35 వేలు ఖర్చవుతుంది. 
  •      ఎండిపోయిన వ్యవసాయ బావుల్లోకి నీటిని మళ్లించడానికికైతే రూ. 5 వేలు ఖర్చు చేస్తే చాలు. పాడుపడిన నేల బావుల్లోకి నీటిని ఇంకింపజేస్తే అక్కడి నుంచి 200 మీటర్ల పరిధిలో భూగర్భ జలాలు బాగా పెరుగుతాయి. 

బోర్లన్నీ వాన నీటి రీచార్జ్‌కు పనికొస్తాయా?
రైతుల పొలాల్లో ఉండే.. ప్రస్తుతం తక్కువ నీరు పోస్తున్న బోర్లు లేదా గతంలో నీరుండి ఇప్పుడు ఎండిపోయిన బోర్లు లేదా బోరు వేసినప్పుడే ఫెయిలై నీరు రాని బోర్లను సయితం వాన నీటిని ఇంకింపజేయడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే, రీచార్జ్‌ పిట్‌ను నిర్మించబోయే ముందు ఒక  పరీక్ష ద్వారా ఆ బోరు ఉపయోగపడుతుందా లేదా అన్నది తెలుసుకోవచ్చు అని వాటర్‌ అండ్‌ లైవ్‌లీహుడ్స్‌ ఫౌండేషన్‌ నిపుణుడు ఆర్‌. వి. రామమోహన్‌ అంటున్నారు. 5 వేల లీటర్ల నీటిని ట్యాంకర్‌తో తెచ్చి ఏ బోరును పరీక్షించదలిచామో ఆ బోరు లోపలికి పోయాలి. నీరు సజావుగా లోపలికి వెళ్తే సరే. నీరు లోపలికి వెళ్లకుండా బయటకు వచ్చేశాయంటే ఆ బోరు చుట్టూ వాన నీటి రీచార్జ్‌ పిట్‌ను నిర్మించినా ప్రయోజనం ఉండదని గ్రహించాలి. 30% బోర్‌వెల్స్‌ ఈ పరీక్షలో ఫెయిలవుతూ ఉంటాయి. ఈ పరీక్షలో నెగ్గిన బోరు చుట్టూ 10 అడుగుల లోతు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవున రాళ్లు, కంకర, ఇసుకతో వాన నీటి ఇంకుడు గుంతను నిర్మించుకుంటే రైతుకు సాగు నీటి భద్రత కలుగుతుంది.

వాడుకలో లేని బోర్లకు రీచార్జ్‌ గుంతలు మేలు!
ఎంతో కొంత నీరు వస్తున్న బోర్ల చుట్టూ తవ్వి వాన నీటి ఇంకుడు గుంత నిర్మించడం కన్నా.. నీరు పడని  లేదా నీరు ఎండిపోయి నిరుపయోగంగా ఉన్న బోర్ల చుట్టూ వాన నీటి ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ఉత్తమం. వాడుకలో లేనివి ఎన్ని బోర్లున్నా వాటి చుట్టూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవచ్చు. సాధారణంగా వాడుకలో లేని బోర్లకే మూత లేకపోవడం సమస్య ఉంటుంది. వాటిల్లోనే ప్రమాదవశాత్తూ పిల్లలు పడే ప్రమాదం ఉంటుంది. ఇంకుడు గుంతలు నిర్మించి, మూత పెట్టేస్తే ఆ బాధ కూడా ఉండదు.

5 ఎకరాల్లో మామిడి తోటకు,14 పాడి ఆవులకు నీటి కొరత లేదు!

నాకు 11 ఎకరాల భూమి ఉంది. నాలుగు బోర్లున్నాయి. అయినా ఎండాకాలంలో ఏప్రిల్, మే నెలల్లో పశువులకు కాదుగదా కనీసం తాగడానికి కూడా నీళ్లు ఉండేవి కాదు. అటువంటి పరిస్థితుల్లో 2016 మేలో అప్పట్లో సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ సంస్థకు చెందిన రామోహన్‌ సాంకేతిక తోడ్పాటుతో ఒక బోరు చుట్టూ వాన నీటిని ఇంకించే గుంతను నిర్మించుకున్నాను. ఈ బోరు 480 అడుగుల లోతు ఉంటుంది. అప్పటి నుంచీ మిగతా 3 బోర్లు ఎండిపోయినా ఇది ఎండిపోవడం లేదు. కరువు పరిస్థితులున్నా ఇప్పుడు కూడా 14 దేశీ ఆవులకు, ఎకరంలో పశువుల మేతకు, 5 ఎకరాల్లో మామిడి తోటకు నీటి కొరత లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 1.25 ఇంచుల  నీరు పోస్తోంది. రోజుకు 50 లీటర్ల సేంద్రియ దేశీ ఆవు పాలు హైదరాబాద్‌ నగరంలో డోర్‌ డెలివరీ చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నాను. దీనంతటికీ బోరు రీచార్జ్‌ ద్వారా లభించిన నీటి భద్రతే మూల కారణం. ఇది తెలుసుకున్న తోటి రైతులు ముగ్గురు తమ బోర్లకు దగ్గర్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు తవ్వించుకున్నారు. బోర్‌ రీచార్జ్‌ గుంతల నిర్మాణంలో రైతులకు తోడ్పాటునందిస్తా.  – చల్లా పవన్‌రెడ్డి(98484 70909), చెల్లంపల్లె, కడ్తాల్‌ మండలం, రంగారెడ్డి జిల్లా

‘బోర్‌ రీచార్జ్‌ చెయ్యకపోతే ఆవులు అమ్ముకోవాల్సి వచ్చేది’

నాకు 8 ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లు, రెండు బావులు ఉన్నాయి. 4 ఎకరాల్లో మామిడి తోట ఉంది. మిగతా పొలంలో వరి, మొక్కజొన్న సాగు చేస్తుంటా. 5 పాడి ఆవులున్నాయి. ఎండాకాలం బోర్లు, బావులు ఎండిపోయి పశువులకు కూడా నీళ్లు చాలని పరిస్థితుల్లో 2017 మేలో ఒక బోరు చుట్టూ వాన నీటిని భూమిలోపలికి ఇంకింపజేసే గుంత కట్టుకున్నాం. సహాయ స్వచ్ఛంద సంస్థ ద్వారా నాబార్డు నిధులతో ఏజీఎం రవిబాబు శ్రద్ధ తీసుకొని గొల్లకుంట, కట్కూరు పంచాయతీల్లో 25 మంది రైతులకు బోర్ల రీచార్జ్‌ పిట్‌లు నిర్మించారు. అప్పటి నుంచీ ఎండాకాలంలో కూడా మాకు నీటి కొరత లేదు. ఇప్పుడు మా బోరు గంట సేపు 2 ఇంచ్‌లు, తర్వాత ఆగి ఆగి పోస్తున్నది. 15 కుంటల్లో పచ్చి మేత సాగు చేస్తున్నాను. రోజుకు 20–25 లీటర్ల ఆవు పాలు అమ్ముతున్నా. రీచార్జ్‌ గుంత కట్టడానికి ముందు 4 వేల లీటర్ల ట్యాంకరు తెచ్చి మా బోరులోకి పోసి చూశారు. పది నిమిషాల్లోనే నీరు కిందికి దిగిపోయింది. సక్సెస్‌ అవుతుందని నిర్థారించుకున్న తర్వాత గుంత తీసి రాళ్లు, కంకర, ఇసుక వేసి పళ్లెం కట్టాం. ఒర్రె పారేటప్పుడు మా బోరు రీచార్జ్‌ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలోనూ నీటికి ఇబ్బంది లేదు. ఇప్పుడు చాలా బోర్లు ఎండిపోయాయి. మేం రీచార్జ్‌ చేసుకొని ఉండకపోతే నీళ్లు లేక అవులను అమ్ముకోవాల్సి వచ్చేది. బోర్‌ రీచార్జ్‌ చేసుకుంటే రైతులకు చాలా ఉపయోగం. – కాసబోయిన శ్రీనివాస్‌ (98493 11331), గొల్లకుంట, అక్కన్నపేట మండలం, సిద్ధిపేట జిల్లా 

ఏడాదికోసారి మట్టిని తొలగించాలి!

బోరు రీచార్జ్‌ ఇంకుడు గుంతపైన మెష్‌ను (బొమ్మలో చూపిన విధంగా), దానిపై ఇసుకను తప్పనిసరిగా పరచాలి. లేదంటే రాళ్ల మధ్య ఖాళీల్లో ఇసుక చేరిపోయి, నీరు భూమిలోకి ఇంకడం మందగిస్తుంది. ఏడాదికి ఒకసారి మెష్‌పైన పేరుకున్న మట్టిని తొలగించుకుంటూ, మెష్‌ చిరిగిపోతే మార్చుకుంటే.. చాలా ఏళ్లపాటు బోరు రీచార్జ్‌ గుంత ద్వారా వాన నీటిని సమర్థవంతంగా భూగర్భంలోకి ఇంకింపజేసుకొని నీటి కొరతను అధిగమించవచ్చు. నాలుగు లేదా ఐదేళ్లకొకసారి ఇసుకను, మెష్‌ను తొలగించి.. శుభ్రం చేసిన మెష్‌ను పరచి.. దానిపై కొత్త ఇసుకను అడుగు మందాన నింపాలి.

50% వాన నీటిని ఇంకింపజేసుకోవచ్చు

కరువు పరిస్థితుల్లో కూడా రైతులకు సాగు నీటి భద్రత కావాలంటే బోరు బావులను వర్షపు నీటితో రీచార్జ్‌ చేసుకోవడం అవసరమని అందరూ గ్రహించాలి. బోరు చుట్టూ రీచార్జ్‌ గుంతలు తవ్వించుకుంటే భూగర్భ జలమట్టం పెరుగుతుంది, బోరు త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. వరదగా పారే వర్షపు నీటిలో 40–50% వరకు వర్షం పడిన ఒకటి, రెండు గంటల్లోనే బోరున్న చోటే బోరు రీచార్జ్‌ గుంతల ద్వారా భూమి లోపలికి ఇంకింప జేసుకోవచ్చు. వాటర్‌షెడ్‌ పథకాల ద్వారా వర్షపు నీటిలో మహా అయితే 15% నీరు మాత్రమే భూమిలోకి ఇంకించగలుగుతాం. బోరు రీచార్జ్‌ గుంతను రైతులే సొంత ఖర్చుతో నిర్మించుకుంటే రూ. 25 వేల నుంచి 35 వేల వరకు ఖర్చవుతుంది.

బోరు రీచార్జ్‌ గుంత నిర్మాణానికి అవసరమయ్యే కూలీలను ఉపాధి హామీ పథకం ద్వారా సమకూర్చే అవకాశాన్ని ఏళ్ల క్రితమే ప్రభుత్వం కల్పించింది. రాళ్లు, ఇసుక, మెష్‌ వంటి ఖర్చులు రైతులు భరిస్తే సగం ధరకే బోరు రీచార్జ్‌ గుంతను ఉపాధి పథకంలో నిర్మించుకోవచ్చు. ఉపాధి హామీ పథకంలో క్షేత్రస్థాయి సిబ్బందికి ఈ పథకంపై అవగాహన కల్పించడానికి కృషి జరిగితే రైతులకు మేలు జరుగుతుంది. 
– ఆర్‌. వి. రామమోహన్‌ (ఠీ జౌunఛ్చ్టీజీౌnఃౌu్ట ౌౌజు.ఛిౌఝ)  భూగర్భ జల నిపుణులు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, వాటర్‌ అండ్‌ లైవ్‌లీహుడ్స్‌ ఫౌండేషన్, సికింద్రాబాద్‌  

వేసవిలో కూడా పుష్కలంగా నీరు

వేసవి కాలంలో బోర్లన్నీ ఎండిపోతే రైతు పొలంలో బోరు మాత్రం ఆగకుండా 24 గంటలు నీరు అందిస్తున్నది. వాన నీటిని బోరుకు రీచార్జ్‌ చేయడమే దీనికి కారణం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన కట్ల రమేష్‌ అనే రైతు రెండేళ్ల క్రితం తన పొలంలో బోరు వేశాడు. వర్షం నీరు పొలం దాటి పోకుండా బోర్వెల్‌ దగ్గరే భూమిలోకి ఇంకేలా గుంతను నిర్మించుకున్నాడు. అప్పటి ఎంపీడీఓ పవన్‌కుమార్‌ ప్రోత్సాహంతో రమేష్‌ చేసిన ఈ పని వల్ల ఎంతో వేసవిలోనూ సాగు నీటికి ఇబ్బంది లేదు. గత రెండు సంవత్సరాలుగా నీటికి ఇబ్బంది లేకపోవడంతో రెండు పంటలు పండిస్తున్నట్లు కట్ల రమేష్‌ (99590 06181) తెలిపారు. – లక్ష్మణ్, సాక్షి, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా 

బోర్‌ వెల్‌ రీచార్జ్‌ సులభమైన పద్ధతి

రామలింగారెడ్డి(94900 29375)అనే రైతు కోటంక గ్రామంలో 9 ఎకరాల్లో పండ్ల తోటలు, కాయగూర పంటలు సాగు చేస్తున్నారు. 1990లో తమ పొలంలో తొలి బోరు వేశారు. బోరులో నీరు పడడడంతో ఆశతో పండ్ల తోటలు సాగు చేశారు. రెండేళ్ల తరువాత ఆ బోరు ఎండిపోయింది. మళ్లీ ఒక బోరు వేశారు. వర్షాభావం వల్ల ఆ బోరు కూడా నీరు తగ్గిపోయింది. గత్యంతరం లేక పంటను కాపాడు కోవడానికి రూ. లక్షలు అప్పులు చేసి మరో రెండు బోర్లు వేశారు. వాటిలో అర కొరగా నీరు పడడంతో ఆ నీటితోనే తమకు ఉన్న 3 ఎకరాల్లో 500 చీనీ చెట్లు, ఇతర పొలంలో వేరుశనగ, కూరగాయల పంట సాగు చేస్తున్నారు. గ్రామంలో పంటలు పండిస్తూ సత్పాలితాలు సాధిస్తున్న సమయంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భజలాలు అడుగంటి పోయి బోర్లలో నీరు ఉన్న పళంగా తగ్గిపోయాయి.

ఈ సమయంలో గ్రామంలో రిడ్స్‌ స్వచ్చంద సంస్థ ఎండిపోయిన బోర్లు, బావులకు రీఛార్జ్‌ చేస్తామని రైతులతో చెప్పారు. 2014–15లో ఎండిపోయిన రెండు బోర్లకు రీచార్జ్‌ గుంతను కట్టించారు. వర్షాలకు బోర్లలో నీటి మట్టం పెరిగింది. సంతోషంతో మళ్లీ పండ్ల తోటలతో పాటు వేరుశనగ, కాయగూరలు, ఆముదం, టమోటా, జొన్నæపంటలు సాగు చేశారు. వేరుశనగ 4 ఎకరాల్లో సాగు చేయగా 80 బస్తాలయ్యాయి. కరువు సమయంలో కూడా ఆముదం పంటకు రూ. లక్ష ఆదాయం వచ్చింది. టమోటా దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయారు. పంటలతోపాటు పశువుల మేత కూడా పండించుకొని పాడి పశువులను పోషించుకుంటూ ఆదాయం గడిస్తున్నారు. ఈ వేసవిలో ఎండల తీవ్రత అధికమవడం వల్ల బోర్లలో  కొంత వరకు నీరు తగ్గడంతో చీనీ తోట మాత్రమే సాగులో ఉంది. పంట ఆశాజనకంగా ఉంది. కరువులోనూ నీటికి బాధ లేకుండా చూసుకోవడానికి  బోరు రీచార్జ్‌ పద్ధతి చాలా సులువైన మార్గం అని రామలింగారెడ్డి అనుభవంతో సంతోషంగా చెబుతున్నారు.  – ఆంజనేయులు, సాక్షి, గార్లదిన్నె, అనంతపురం జిల్లా

వేసవిలోనూ బోరు ఎండదు

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో ఎక్కలూరి తాతిరెడ్డి చాలా ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 13 ఎకరాల్లో 1500 చీనీ(బత్తాయి) చెట్లు నాటారు. సాగు నీటి కోసం వేసిన తొలి బోరులో ఒక ఇంచు (అంగుళం) నీరు పడ్డాయి. కొన్నాళ్లకు బోరు ఎండిపోతే మరో బోరు వేశారు. అందులో కొద్ది నీరు వచ్చింది. కొన్నాళ్లలోనే అది కూడా వట్టిపోయింది. ఇలా.. రూ. లక్షలు ఖర్చుపెట్టి 1995 నుంచి తన పొలంలో దాదాపు 10 బోర్లు వేశారు. అయినా ఫలితం లేదు. బోరులో అర కొరగా వచ్చే నీటితోనే చీనీ తోట తడి ఇచ్చేవారు. ఆ తరుణంలో రిడ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక, సాంకేతిక సాయంతో ఎండిపోయిన బోరు వద్ద 2016లో వాన నీటి రీచార్జ్‌ గుంతను నిర్మించారు. చీనీ తోటలో నుంచి పారే వర్షపు నీరు ఈ బోరు దగ్గర భూమిలోకి ఇంకుతుండేది. ఆ తర్వాత ఆ బోరు పక్కనే జేసీబీతో ఫారమ్‌ పాండ్‌ (గుంత) తవ్వారు. అప్పుడు వర్షాలు పడటంతో నెలన్నర రోజుల్లోనే వాన నీరు భూమిలోకి పుష్కలంగా ఇంకి.. బోరులో నీటి మట్టం పెరిగింది. దీంతో కరువు పరిస్థితులున్నప్పటికీ, వేసవిలోనూ గత మూడేళ్లుగా బోర్లలో నీరు ఎండిపోలేదు. ఏనాడూ తోట నీరు లేక ఎండిపోలేదు. చీనీ కాయల దిగుబడి తగ్గలేదు. బోరుకు రీచార్జ్‌ గుంతతోపాటు ఫారమ్‌ పాండ్‌ తవ్విన తర్వాత ప్రతి యేటా ముఖ్యంగా కరువులో కూడా తాతిరెడ్డి నిశ్చింతగా చీనీ పంటను సాగు చేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిన ఈ వేసవిలోనూ 13 ఎకరాల్లో చీనీ పంట నీటి కొరత లేకుండా పచ్చగా అలరారుతూ ఉండడం విశేషం.

కరువు వల్ల మా వూళ్లో చీనీ తోటలు ఎండిపోతున్నాయి. ట్యాంకర్లతో నీరు తెచ్చి కొందరు రైతులు తోటలు నిలబెట్టుకుంటున్నారు. ఆరు నెలల క్రితం వర్షం పడింది. నేను వాననీటితో బోరు రీచార్జ్‌ చేసుకున్నందు వల్ల భూమిలోకి నీరు ఇంకింది. ఇప్పుడు కూడా 2 బోర్లలో రెండించుల నీరుంది. రోజుకు 400–500 చీనీ చెట్లకు నీరు పెట్టుకుంటున్నాను. పదునయ్యే వాన పడినా సరే బోరు రీచార్జ్‌ అవుతుంది. పొలంలో అన్ని బోర్లకూ రీచార్జ్‌ చేయలేం. డౌన్‌లో ఉండే బోర్లకే వీలవుతుంది. ముందు ట్యాంకరుతో నీరు తెచ్చి బోరులో పోసి, నీరంతా లోపలికి పోతున్నదీ లేనిదీ చూసుకోవాలి. తర్వాత మిషన్‌తో నీటిమట్టం ఎంత పెరిగిందో చూడాలి. అంతా బాగున్నదనుకున్న తర్వాతే ఆ బోరు దగ్గర రీచార్జ్‌ గుంత నిర్మించుకోవాలి. నా పొలంలో వాలులో ఉన్న ఒక బోరులో మోటారు ఇరుక్కుపోయి నిరుపయోగంగా ఉంది. దానికి రీచార్జ్‌ గుంత కట్టించాను. దగ్గర్లోని 2 బోర్లలో నీటి మట్టం బాగా పెరిగింది. ఆ నీళ్లే ఇప్పుడు ఆదుకుంటున్నాయి. దూరంగా ఉన్న పొలానికి కూడా పైపులైన్‌ ద్వారా నీళ్లు ఇస్తున్నాను. – ఎక్కలూరి తాతిరెడ్డి(94405 14215), కోటంకి, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా

 

బోర్‌ రీచార్జ్‌ పిట్‌ నిర్మాణానికి రూ. 35 వేల వరకు ఖర్చు

బోర్‌ రీచార్జ్‌ పిట్‌ నిర్మించుకోవడం వల్ల బోర్లు ఎండాకాలంలోనూ ఎండిపోకుండా ఉంటాయి. కరువు పరిస్థితుల్లో కూడా పశువులకు సరిపడా నీటినైనా బోర్లు పోస్తూనే ఉంటాయి. ఇప్పటి వరకు 200 బోర్లకు రీచార్జ్‌ పిట్లు కట్టించిన అనుభవం నాకుంది. బోరు రీచార్జ్‌ పిట్‌ నిర్మించడానికి 5 ట్రాక్టర్‌ ట్రిప్పుల రాళ్లు, 2 ట్రిప్పుల కంకర, 2 ట్రిప్పుల ఇసుక అవసరమవుతుంది. సగటున రూ. 25 వేల నుంచి 35 వేల వరకు ఖర్చు వస్తుంది. కొన్ని భూముల్లో గుంత తవ్వేటప్పుడే అవసరమైన రాళ్లలో సగం దొరుకుతాయి. కొందరు రైతులు కూలీలను పెట్టకుండా తామే పని చేసుకుంటారు. అలాంటప్పుడు ఖర్చు తగ్గుతుంది. – కామిడి సురేందర్‌రెడ్డి (99517 93862), వనపర్తి, లింగాల ఘనపూర్‌ మండలం, జనగామ జిల్లా 

‘వాన లేకపోయినా బోరు ఎండలేదు’

మాకు 4.27 ఎకరాల భూమి ఉంది. రెండు బోర్లున్నాయి. ఎండాకాలంలో బోర్లు ఎండిపోయి చాలా ఇబ్బంది అవుతుండేది. నీటి సమస్యను అధిగమించడానికి ఏమి మార్గాలున్నాయా అని యూట్యూబ్‌లో వెదుకుతూ ఉంటే సెంటర్‌ ఫర్‌ వరల్డ్‌ సాలిడారిటీ వారి బోర్‌ రీచార్జ్‌ వీడియో కనిపించింది. వాళ్లు సూచించిన రీతిలో ఒక బోర్‌కు 2016 ఏప్రిల్‌లో రీచార్జ్‌ పిట్‌ నిర్మించుకున్నాను. రూ. 35 వేల ఖర్చు అయ్యింది. అప్పటి నుంచి మా బోరు ఎండిపోలేదు. ఎకరంలో థాయ్‌ జామ, ఎకరంలో కో4 పచ్చి గడ్డి సాగు చేస్తున్నాను. 6 పాడి ఆవులున్నాయి. రోజుకు 45–50 లీటర్ల పాలు అమ్ముతున్నాను. గత ఏడాది మా దగ్గర ఒక్క పెద్ద వర్షమూ పడ లేదు. తాగడానికి కూడా నీళ్లు లేక పశువులను అమ్ముకున్న రైతులు మా వూళ్లో ఉన్నారు. ఇప్పుడు మా బోరు ఒకటింపావు అంగుళం నీరు పోస్తున్నది. పశువులకు, మా పంటలకూ నీటి కొరత లేదు. నీటి భద్రతకు బోరు రీచార్జ్‌ చాలా ఉపయోగపడింది. – నరేందర్‌ గోవిందు (99639 34541), అప్పారెడ్డిపల్లి, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా


 

మరిన్ని వార్తలు