నా నాటకాల మూలసూత్రాలు

10 Feb, 2020 04:13 IST|Sakshi

ప్రయాణం

‘కావ్యేషు నాటకం రమ్యమ్‌’ అనే వాక్యం నాకు బాల్యంలోనే జీర్ణమైపోయింది. నేను హైస్కూలు దాటకుండానే రంగు పూసుకున్నాను. బాలరాముడి పాత్రతో 1960లో నాటకరంగానికి శ్రీకారం చుట్టేను. దాదాపు 200 కథలు రాశాను. 20 నవలలు రాశాను. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్‌ రాశాను. దాదాపు 80 సినిమాలకు కథ, మాటలు రాశాను. దినపత్రికలో కాలమ్స్‌ రాశాను. ఎన్ని రాసినా, నాటక రచన పట్ల నా ఆసక్తి పెరుగుతూనే వచ్చింది– సాంఘిక నాటికలు, పిల్లల నాటికలు, పద్య నాటకాలు, రేడియో నాటకాలు ఇలా అన్ని విభాగాల్లో రచన చేశాను. 1997లో నేను రాసిన మొట్టమొదటి నాటకం ‘కాకి ఎంగిలి’ హైదరాబాదు రసరంజని హాలులో రోజువారీ ప్రదర్శనలు ఇచ్చారు. ఇది రాయటానికి ముందు నాటకం ఎలా రాయాలి? అనే విషయం చాలాకాలం ఆలోచించేను. నాటకంలో వస్తువైవిధ్యం, సన్నివేశాల కూర్పు, పాత్ర చిత్రణ, పాత్ర స్థాయి, స్వభావాన్ని అనుసరించి సంభాషణలు ఉంటే ఆ నాటకం ప్రేక్షకులని ఆకర్షిస్తుందని గ్రహించేను. పద్యనాటకాలు రాసినా ఇవే మూలసూత్రాలు పాటించేను. ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్‌’ లాంటి చారిత్రక నాటకాలు రాసినా ఇదే మార్గాన్ని అనుసరించేను.

‘క్రాస్‌ రోడ్స్‌’ లాంటి స్త్రీవాద ఇతివృత్తం తో ఇంకో నాటకం రాయండి అని అడిగే మహిళామణులున్నారు. ‘ఓం’ లాంటి ధర్మప్రభోదాన్ని చేసే నాటకం రాయండి అని అడిగే ఆర్ష విద్యా సంపన్నులున్నారు. ‘మీ ఇల్లెక్కడ?’ లాంటి తాత్విక చింతనతో నాటకాలు రాయాలి అని ఆశించే తత్త్వవేత్తలున్నారు. ‘కలనేత’ లాంటి నాటకాలు చూసి తెలంగాణ మాండలికంలో రచనలు చేయమని కోరేవాళ్లున్నారు. 
1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది నాటక పోటీలు మొదలుపెట్టింది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ దాదాపు ప్రతీ సంవత్సరం నేను రచించిన ఏదో ఒక నాటిక పోటీలో పాల్గొంటూ వచ్చాయి. 13 సార్లు ఉత్తమ రచనకు నంది బహుమతులు అందుకున్నాను. నా నాటకాలకు బహుమతులు రావటానికి, నాకు ఇంత పేరు రావటానికి, ఆయా నాటకాల్లో ఆ పాత్రలు ధరించిన నటీనటులు, టెక్నీషియన్స్‌– ముఖ్యంగా దుగ్గిరాల సోమేశ్వరరావు, బి.ఎం.రెడ్డి, కె.వెంకటేశ్వరరావు, గంగోత్రి సాయి లాంటి దర్శకులే కారణం.

ఆకెళ్లగా ప్రసిద్ధులైన ఆకెళ్ల వెంకట సూర్యనారాయణ నాటకాలు రెండు సంపుటాలుగా వచ్చాయి. ప్రచురణ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 
సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి. 
రచయిత ఫోన్‌: 9440054477
 

మరిన్ని వార్తలు