అలర్జీ కాస్తా ఆస్తమాకు దారి తీయవచ్చు...

23 Nov, 2015 10:55 IST|Sakshi
అలర్జీ కాస్తా ఆస్తమాకు దారి తీయవచ్చు...

హోమియో కౌన్సెలింగ్
 
మా అమ్మగారికి 65 సంవత్సరాలు. ఆమె గత కొన్నేళ్లుగా సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్నారు. దయచేసి ఆమెకు తగిన హోమియో మందులు సూచించగలరు.  - పి. పద్మజ, మచిలీపట్నం

సుమారు 90 శాతం జనాభాలో ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాలు వచ్చేసరికి కొద్దిపాటి స్పాండిలోసిస్ సమస్య వస్తుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇలా ప్రధానంగా వయసుతో వచ్చే ఈ సమస్య ఇటీవలి కాలంలో యుక్త వయస్కుల్లోనే కనిపిస్తుంది. దీనికి గల కారణాలు అనేకం. సర్వైకల్ స్పాండిలోసిస్ లేదా మెడనొప్పి వ్యాయామం లేకపోవడం, అధిక బరువులు ఎత్తడం, పెరుగుతున్న పని ఒత్తిడికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
 
సర్వైకల్ స్పాండిలోసిస్ అనగానేమి?
మానవ శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. వెన్నుపూస పలు విభాగాల సమ్మేళనం. వెన్నెముకకు తోడుగా కండరాలు, డిస్కులు, లిగమెంట్లు ఉంటాయి. ఇవి సులభంగా వంగడానికి, శరీరంలోని కదలికలకు తోడ్పడతాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసల మధ్య మృదువైన పదార్థం ఉంటుంది. దీనినే డిస్క్ అని అంటారు. వెన్నుపాము (స్పైనల్ కార్డ్) నుండి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడ భాగం నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వెన్నెముక మెడ, నడుం భాగాల్లోని డిస్కులే ఎక్కువగా దెబ్బతింటాయి. కాని ముఖ్యంగా మెడ దగ్గర రావడం వల్ల దీనిని సర్వైకల్ స్పాండిలోసిస్ అని పిలుస్తారు.

కారణాలు: వెన్నెముకకు దెబ్బ తగలడం, అధిక బరువులు ఎత్తడం, గంటల తరబడి కూర్చొని పని చేయడం, సరైన డ్రైవింగ్ పద్ధతులు పాటించకుండా ఎక్కువగా డ్రైవింగ్ చేయడం, వయసు పెరిగే కొద్ది వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్ అరుగుదలకు గురికావడం మరియు కొన్ని రకాల ‘ఆటోఇమ్యూన్ డిసీజెస్’ వల్ల కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చే అవకాశం ఉంది.

ఎటువంటి లక్షణాలు చూడవచ్చు: మెడనొప్పి, మెడ బిగుసుకుపోవడం, నొప్పి మెడ ప్రాంతంలో ప్రారంభమై భుజాల్లోకి, చేతుల వరకు వ్యాపించడం, తిమ్మిర్లు, చేతి కండరాలు బలహీనపడటం, భుజాలు, చేతివేళ్లలో స్పర్శ తగ్గిపోవడం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నిర్ధారణ: ఎక్స్‌రే సర్వైకల్ స్ప్రెయిన్, ఎమ్.ఆర్.ఐ., సి.బి.పి., ఇ.ఎస్.ఆర్ వంటి పరీక్షల ద్వారా నిర్థారించడం జరుగుతుంది.
 హోమియో ఇంటర్నేషనల్ చికిత్స: హోమియో ఇంటర్నేషనల్ జెనెటిక్ కాన్స్‌టిట్యూషనల్ వైద్య పద్ధతి ద్వారా మెడనొప్పి తగ్గించవచ్చు. అంతేకాదు, వెన్నుపూసలను దృఢంగా చేయడం ద్వారా మెడనొప్పి సమస్యలు తిరగబెట్టకుండా స్పాండిలోసిస్ సమస్యను సంపూర్ణంగా నయం చేయవచ్చు.
 
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్

నా వయసు 44 ఏళ్లు. రెండు నెలల క్రితం కుడికాలి బొటనవేలు వాచి, తీవ్రమైన నొప్పి వచ్చింది. దానికి గాయం అయినట్లుగా నాకేమీ అనిపించలేదు. ఆ నొప్పి సాయంత్రానికి పెరిగి, కాస్త జ్వరం కూడా వచ్చింది. అప్పుడు నేను మాకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే, పెయిన్‌కిల్లర్ కూడా ఇచ్చారు. ఐదారు రోజుల్లో సమస్య దానంతట అదే సద్దుమణిగింది. ఒక వారం క్రితం వరకూ అంతా బాగానే ఉంది. కానీ మళ్లీ కుడి బొటనవేలిలో మునుపటిలాగే నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.  - కరుణాకర్, కర్నూలు

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది ‘గౌట్’ అనే వ్యాధిలా అనిపిస్తోంది. గౌట్ ఉన్నవారిలో రక్తంలో యూరిక్ యాసిడ్ పాళ్లు పెరుగుతాయి. ఈ యూరిక్ యాసిడ్ పేరుకుపోయి కీళ్ల వద్ద రాళ్లలా (క్రిస్టల్స్‌లా) మారుతుంది. ప్రధానంగా కాలి బొటనవేలు, పాదాలలోని ఎముకలు, చీలమండ ఎముకల మధ్య ఇది చేరుతుంది.  దాంతో కీళ్ల కదలికల సమయంలో ఎముకలు ఈ రాళ్లతో రాపిడి చెందడం వల్ల  అక్కడి కీలు వాచి, నొప్పి కూడా వస్తుంది. సాధారణంగా కొన్నాళ్లలో దానంతట అదే తగ్గిపోతుంటుంది. కానీ రక్తంలో మళ్లీ యూరిక్ యాసిడ్ పాళ్లు పెరిగినప్పుడు నొప్పి, వాపు మళ్లీ తిరగబెడతాయి. వేటమాంసం, నిమ్మజాతికి సంబంధించిన పండ్లు (నిమ్మ, నారింజ వంటివి) తిన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకునేవారిలో కీళ్లలో యూరిక్ యాసిడ్ రాళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువ.

 

అప్పుడు సమస్య మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఇలాంటివారు ఆహారంలో వేటమాంసం (రెడ్‌మీట్), నిమ్మజాతిపండ్లను తినకూడదు.  ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయాలి. ఈ వాపు, నొప్పి తగ్గిన తర్వాత తగినంత వ్యాయామం చేయాలి. బరువు తగ్గాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలన్నీ యూరిక్ యాసిడ్ రాళ్ల నివారణకు తోడ్పడతాయి. దాంతో గౌట్ కూడా నివారితమవుతుంది. అవసరాన్ని బట్టి  మీకు రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లను తగ్గించడానికి కొన్ని మందులు కూడా వాడాల్సి రావచ్చు. కాబట్టి ఒకసారి మీ యూరిక్ యాసిడ్ పరీక్ష చేయించి, మీరు ఒకసారి మీకు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి.
 
పల్మనాలజీ కౌన్సెలింగ్


మా పాప వయసు ఐదేళ్లు. తరచూ జలుబు చేస్తుంటుంది. మందులు వాడితే తగ్గుతుంది. కానీ ఇంచుమించు నెలకొకటి రెండుసార్లు జలుబు బారిన పడి, చాలా బాధపడుతోంది. మాకు భయంగా ఉంటోంది. భవిష్యత్తులో ఆస్తమా వస్తుందా? లంగ్స్ పని తీరు మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? దయచేసి తెలియజేయండి.  - వసుధ, నల్గొండ

చిన్నపిల్లల్లో జలుబు సాధారణమే. కానీ, అలర్జీ వల్ల వచ్చే జలుబు సాధారణం కాదు. దీనిని నిర్లక్ష్యం చేస్తే అది ఆస్తమాకు దారితీయవచ్చు. అందుకే ప్రాథమిక దశలోనే లక్షణాలకు కాకుండా, వ్యాధికి చికిత్స అందిస్తే అలర్జీ... ఆస్తమాకి మారే అవకాశం ఉండదు. సాధారణంగా జలుబు 3-4 రోజుల్లో తగ్గిపోతుంది. కానీ అలర్జీ వల్ల వచ్చే జలుబు పదిరోజులైనా తగ్గదు. ఇది గుర్తుంచుకోండి. ముక్కు నుంచి పసుపు లేదా ఆకుపచ్చ స్రావం కారుతుంటే ఇన్ఫెక్షన్ వల్ల అది వచ్చినట్లు భావించాలి. అలాకాకుండా తెల్లగా వస్తుంటే అది అలర్జీ వల్ల వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అలర్జీ వల్ల తుమ్ములు, పొడిదగ్గు, గొంతునొప్పి సైతం ఉంటాయి. మీరు చెప్పిన అంశాలను  బట్టి మీ పాపవి అలర్జీ లక్షణాలే అనిపిస్తున్నాయి. దీనితో పాటు కళ్ల నుంచి నీరు, ముక్కు మూసుకుపోయినట్లుంటే అది అలర్జిక్ రైనైటిస్ తాలూకు లక్షణంగా పరిగణించాలి.

మీలాగే చాలామంది జలుబు చేయగానే పిల్లలను డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు ఇప్పిస్తారు. దాని వల్ల జలుబు తాత్కాలికంగా తగ్గిపోతుంది. కానీ తరచూ జలుబు చేస్తుంటే అది ‘అలర్జిక్ రైనైటిస్’ అని అర్థం చేసుకోవాలి. లక్షణాలకు మాత్రమే చికిత్స తీసుకుంటూ పోతే లోపల వ్యాధి పెరిగిపోతుంది. అలా కాకుండా వ్యాధికి చికిత్స తీసుకుంటే అది పూర్తిగా తగ్గిపోతుంది.


 మీరు ఆలస్యం చేయవద్దు. అలా చేస్తే అది ఆస్తమాకు దారితీస్తుంది. ఇలాంటి సమయల్లో డాక్టర్ పర్యవేక్షణ లేకుండానే చాలామంది విచ్చలవిడిగా  యాంటీబయాటిక్స్ వాడటం, నిబ్యులైజర్ పెట్టించడం చేస్తున్నారు. మీరు మీ పాపను వెంటనే మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించండి.

మరిన్ని వార్తలు