సిసలైన సామాజికత

29 Oct, 2017 23:40 IST|Sakshi

అన్నమయ్య... ఈ పేరు వినగానే భక్త కవి అనో, గొప్ప వాగ్గేయకారుడనో, మహా భక్తుడనో, సంకీర్తనాచార్యుడనో మాత్రమే చెబుతారు తప్ప ఆయనలోని సామాజికతను తలచుకునేవారు చాలా తక్కువ. ఆయన పదాలను విశ్లేషించి చూస్తే అన్నమయ్య అసలైన సామాజిక కవి, విప్లవ కారుడు అనే విషయం తేటతెల్లమవుతుంది. ఎందుకంటే, ఆ కాలంలో మిగిలినవాళ్లు భక్తి మార్గంలో అత్యంత కఠినమైన, నిగూఢమైన, సామాన్యులకు అర్థం కానట్లు చెప్పే విషయాలను ఆయన అత్యంత సులభంగా అపారమైన విషయాన్ని చిన్న సూత్రంలో చెప్పినట్లుగా చెప్పాడు.

అన్నమయ్య సామాజిక బాధ్యత ఉన్న కవి కాబట్టే భక్తి మార్గంలోనే సామాజిక సమస్యలను ఎత్తిచూపుతూ, సామాజిక రుగ్మతలను రూపుమాపడం, సామాజిక అంతరాలను తొలగించడం అన్నవే భగవంతుని ఆరాధనా మార్గాలని తన సంకీర్తనల్లో కీర్తించాడు. ‘కందువగు హీనాధికము లిందులేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ’ ఇందులో జంతు కులమంతా నొకటే అందరికి శ్రీహరే అంతరాత్మ అని సృష్టిలో ఎలాంటి అంతరాలు లేవు, అంతరాలన్నీ మనుషులు సృష్టించుకొన్నవే అంటాడు.

‘‘చేరి యశోదకు శిశువితడు... ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు’’     అన్న సంకీర్తనలో – భగవంతుడు గొప్పవాళ్లకు గొప్పగా, తక్కువవాళ్లకు తక్కువగా ఉండడు. అందుకు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. అందుకని ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అన్నది నిర్ణయించే హక్కు మనుషులకు లేదని చాటాడు అన్నమయ్య. యశోద సామాన్యమైన స్త్రీ. ఆమెకు భగవంతుడు కొడుకు. తల్లి కన్నా కొడుకు మించినవాడు కాడు.

అంటే భగవంతుడు సామాన్య స్త్రీ కన్నా మించినవాడు కాడు. దానర్థం... అవసరమైతే సామాన్యులైన భక్తుల కన్నా కూడా తగ్గి ఉండగలడు. యశోద కొడుతుంది, తిడుతుంది అన్నీ భరించి ఆమెకు అణిగి మణిగి కొడుకుగా ఉంటాడు. అదే భగవంతుడు సృష్టికర్త అయిన బ్రహ్మనే శాసించగల తండ్రి స్థానంలో ఉన్నాడు. అంటే భక్తుణ్ని బట్టి అతి తక్కువ స్థాయిలోను, అతి ఎక్కువ స్థాయిలోను ఉంటాడన్నమాట.

అంతేకాదు, సృష్టిలో ఒక సామాన్య స్త్రీ కన్నా తక్కువగా ఉండటం, అదే సమయంలో సృష్టికర్తనే అధిగమించి ఉండటం అన్న రెండు భిన్న కోణాలు భగవంతుడి సర్వాంతర్యామిత్వాన్ని, బ్రహ్మాండ స్వరూపాన్ని తెలియజేస్తాయి. ఇంత అద్భుతంగా భగవంతుడి అనంతమైన తత్వాన్ని ఆవిష్కరించిన అన్నమయ్య భక్తితత్వాన్ని ఆకళింపు చేసుకొని, ఆచరణలో పెట్టగలిగినవాళ్లే నిజమైన భక్తులు. మిగిలినవాళ్లు భక్తి పేరుతో భుక్తి సాగించుకొనే సమాజ భోక్తలు.

మరిన్ని వార్తలు