మూడు వాహనాల్లో మురిపించిన ముగ్ద మనోహరుడు!!

21 Oct, 2023 14:56 IST|Sakshi
హనుమంతుని వాహనంపై వేంకటేశ్వరుడు, గజ వాహనంపై గోవిందుడు

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సంబరంగా సాగుతున్నాయి. సప్తగిరులు భక్తసిరులతో నిండిపోతున్నాయి. తిరుమాడ వీధులు గోవిందనామస్మరణతో మార్మోగుతున్నాయి. సాంస్కృతిక సరాగాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుద్దీప కాంతులు మంత్రముగ్దులను చేస్తున్నాయి. విరబూసిన అందాలు భక్తులను రా..రమ్మని ఆహ్వానిస్తున్నాయి. దేవదేవుని దివ్య స్పర్శతో పునీతమవుతున్నాయి.
 


                                                       పుష్పక విమానం

తిరుమల: తిరుమలలో శుక్రవారం బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడింది. మలయప్ప మూడు వాహనాలపై ఊరేగుతూ భక్తులను మురిపించారు. ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం పుష్పక విమానం, రాత్రి గజవాహనంపై ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. దేవదేవుని దివ్యమంగళరూపాన్ని దర్శించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.


                   హనుమంత వాహన సేవలో టీడీపీ చైర్మన్‌ భూమన, ఈఓ ధర్మారెడ్డి

నేటి వాహన సేవలు 
►ఉదయం సూర్యప్రభ వాహనం: బ్రహ్మోత్సవాల్లో ఏడోరోజు శనివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగుతూ కనువిందు చేయనున్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు. 

►రాత్రి చంద్రప్రభ వాహనం:రాత్రి తెల్లటి వ్రస్తాలు, పుష్ప మాలలు ధరించి చల్లని వాతావరణంలో తిరువీధుల్లో స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తిరువీధుల్లో స్వామివారు ఊరేగనున్నారు.

(చదవండి: తిరుమల బ్రహ్మోత్సవం అంకురార్పణతో మెదలై.. ఎన్ని వాహనాలో తెలుసా?)

మరిన్ని వార్తలు