కమ్యూనిస్టుల దారెటువైపు?

16 May, 2019 01:02 IST|Sakshi

మే నెల 5న కారల్‌ మార్క్స్‌ 200వ జయంతి, మే 19న పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా భారతదేశంలో వివిధ శాఖలుగా చీలిపోయిన కమ్యూనిస్టు పార్టీలు, నేతలూ తమ సైద్ధాంతిక దృక్పథాన్ని, ఆచరణనూ, దాని ఫలితాలను ఆత్మవిమర్శా పూర్వకంగా విశ్లేషించుకోవాలి. తొలినుంచి చంద్రబాబుతో అంటకాగిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు అదే చంద్రబాబుకు లోపాయికారీగా మద్దతునిస్తున్న జనసేనతో చేతులు కలపడం భావ్యమేనా అని ఆలోచించుకోవాలి. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పర్చనున్న వైఎస్సార్‌సీపీకి ప్రజానుకూల అంశాలలో పూర్తి మద్దతునిస్తూ, తాము అంగీకరించలేని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ ప్రజాసమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలి. 

ఈ మే 5వ తేదీ అంతర్జాతీయ శ్రామిక వర్గానికి తమ విముక్తికి మాత్రమే కాకుండా, ప్రతి వ్యక్తీ స్వేచ్ఛగా, చైతన్యయుతంగా తన శక్తికొలదీ పనిచేసి తన అవసరం కొద్దీ అనుభవించే కమ్యూనిస్టు వ్యవస్థకు శాస్త్రీయంగా దిశానిర్దేశం చేసిన కారల్‌ మార్క్స్‌ మహనీయుని 200వ జయంతి. అలాగే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వరకు చూసుకుంటే, తన చిన్నతనంలోనే గాంధీజీ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమంలో ప్రజా సేవా కార్యక్రమాలతో ప్రభావితుడై, అంతటితో సంతృప్తి చెందలేక మార్క్సిజం వైపు ఆకర్షితుడై తొలితరం కమ్యూనిస్టు నేతల్లో ఒకరిగా, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతగా తన యావజ్జీవితం అణగారిన కష్టజీవుల అభ్యున్నతికై పరితపించి పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 107వ జయంతి (మే 1వ తేదీ), కాగా మే 19న ఆయన 35వ వర్థంతి కూడా. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తమను తాము కమ్యూనిస్టులుగా భావించుకునేవారు, వివిధ కమ్యూనిస్టు పార్టీలుగా చీలిన కమ్యూనిస్టులూ, వారి నేతలూ తమ కృషినీ, తమ తమ పార్టీల సైద్ధాంతిక దృక్పథాన్నీ, ఆచరణనూ తత్ఫలితాలను ఆత్మవిమర్శనా పూర్వకంగా నిశితంగా, నిజాయితీగా విశ్లేషించుకోవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరజీవుల స్ఫూర్తితో వారి ఆశయసాధన కోసం నేటితరం కమ్యూనిస్టులు పునరంకితం కావలసిన సమయమిది.

మార్క్స్‌ ‘‘మేము (ఎంగెల్స్‌తో కలిపి) అంతిమంగా సమాజ గమనం కమ్యూనిస్టు వ్యవస్థదే అని ఉద్ఘాటించాము కానీ సమాజ పరి ణామ క్రమం అన్ని దేశాల్లోనూ, నిర్దిష్టంగా అదేరీతిలో సాగిందని భావిం చరాదు. అలాగే కమ్యూనిస్టు మేనిఫెస్టోను కూడా నాడు ఇంగ్లండులో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన దశను, దృష్టిలో ఉంచుకుని తయారు చేశాము. వివిధ దేశాల్లో ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టోను యథాతథంగా కాక, ఆయా దేశాల భౌతిక వాస్తవిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్వయించుకోవాలి’’ అని హెచ్చరించారు కూడా. కనుక ముఖ్యమైనది మన దేశ భౌతిక వాస్తవిక పరిస్థితి గురించి శ్రద్ధతో, సృజనాత్మకతతో కూడిన అవగాహన. ఉదా. ఒక ప్రత్యేకతను గమనిద్దాం. మన దేశం ఎంత పురోగమించినప్పటికీ, ఇంకా మధ్య యుగాల నాటి మనుస్మృతి ఆధారిత నిచ్చెనమెట్ల కులవ్యవస్థ నేటికీ ఆధిపత్యం చలాయిస్తోంది. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ అన్నట్లు, బానిస వ్యవస్థ స్థానంలో మన దేశంలో కులవ్యవస్థ ఘనీభవించింది. పుట్టుక ఆధారంగా ఏర్పడిన ఇంతటి తీవ్రమైన వర్ణవివక్ష ఇంకా కొనసాగడం ఎంతో సిగ్గుచేటు.

వర్ణవివక్షను రూపుమాపకుండా, మన దేశంలో అణగారిన ప్రజానీకానికి విముక్తి మార్గాన పురోగమనం సాధ్యమా? ఆర్థిక అణచివేత అంతరిస్తే అన్ని అన్యాయాలూ తొలగిపోతాయన్న భ్రమలో, వర్ణవివక్ష నిర్మూలన మన సమాజ పురోగమనానికి అత్యంత అవసరం అన్న స్పృహ కమ్యూనిస్టు పార్టీలలో కొరవడింది. పైగా ఎవరైనా పార్టీలో ఈ వర్ణవివక్ష నిర్మూలన ఆవశ్యకతను ఎత్తిచూపితే అది కార్మికవర్గ ఐక్యతకు భంగం కలిగించి చీలికలకు దారితీస్తుందని నేటికీ కమ్యూనిస్టు నేతల్లో ఉన్న భావన. కానీ నేడు కమ్యూనిస్టు పార్టీ మన దేశంలో 33 పార్టీలుగా చీలింది. వర్గపోరాటం సాయుధమా? ఎన్నికలా? ఆధిపత్యవర్గమెవరు, ఇలాంటి అంశాలపైనే ఆ చీలిక ఉంది కానీ, బ్రాహ్మణ కమ్యూనిస్టు పార్టీ, కమ్మరెడ్డి కమ్యూనిస్టు పార్టీలు అంటూ చీలిపోలేదు. కనుకనే ఇప్పటికైనా ఈ అంశానికి మన దేశంలో కమ్యూనిస్టు పార్టీలు తప్పక తగిన రీతిలో ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో తెలంగాణలో ఉన్న సీపీఎం శాఖ నేడు ఈ అవగాహనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నది. అందుకు వారికి అభినందనలు. అయితే దేశవ్యాప్త సభల్లో కేంద్రకమిటీలో మెజారిటీ ఇంకా వర్ణవివక్ష ప్రమాదాన్ని గుర్తించని నేటి దశలో, తెలంగాణ సీపీఎం బహుజన సమాజ వామపక్ష ఐక్యసంఘటన యత్నాలు ఎంతవరకు నిలిచి గెలవగలవో చూడాలి. ఏది ఏమైనా, తెలం గాణ సీపీఎం శాఖ దృక్ప«థానికి దేశవ్యాప్త మద్దతు రావాలని ఆశిస్తాను.

పుచ్చలపల్లి సుందరయ్య ఒక మాట చెబుతుండేవారు. మన పార్టీ అందులో వ్యక్తిగా నేను.. ఈ సమాజ చైతన్యం ఒక్క మిల్లీమీటరైనా తన అంతిమ లక్ష్యంవైపు సాగేందుకు దోహదపడ్డానా, పోనీ కనీసం మరింత తిరోగమనం చెందకుండానైనా నిలువరించే యత్నం చేశానా అనే ప్రశ్న వేసుకుని సానుకూల సమాధానం చెప్పుకోగలగాలి అనేవారాయన. ముందుగా ఆ కోణం నుంచి కమ్యూనిస్టుల కార్యకలాపాలను సమీక్షించుకుందాం. 1983లో కాకున్నా, 1984లో తెలుగుదేశం పార్టీతో ఒప్పందం చేసుకుని, శాసనసభల్లో కమ్యూనిస్టుల స్థానాలను సాపేక్షంగా పెంచుకుని కాంగ్రెస్‌ పార్టీని ఓడించి, ఎన్టీఆర్‌ నేతృత్వాన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో భాగస్వాములైనారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత 1995లో ఎన్టీఆర్‌ ద్వితీయ కళత్రంగా ప్రవేశించిన లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఆమెను ఎన్టీఆర్‌ తన రాజకీయ వారసురాలుగా ప్రకటిస్తున్నారన్న దుష్ప్రచారం చేసిన స్వయానా ఎన్టీఆర్‌ అల్లుడు చంద్రబాబు తెలుగుదేశం నుంచి దాని సంస్థాపకుడు ఎన్టీఆర్‌నే గెంటివేసి తాను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదల్చుకున్నాడు. ఆయన కులానికి చెందిన నాటి ప్రచార సాధనాల ఆధిపత్య చక్రవర్తులు, కొందరు పార్టీయేతర నేతలు చంద్రబాబుకు అన్నివిధాలుగా సహకరించారు. చివరకు ‘ఆడపెత్తనంలో తెలుగుదేశం పార్టీ’ అని తమ మాంధాత భావజాలాన్ని ప్రచారం చేస్తూ పత్రికల్లో పతాక శీర్షికలు పెట్టించారు.

ఈ ప్రక్రియలో కమ్యూనిస్టు పార్టీల ఆచరణ ఏహ్యంగా ఉండిందని చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను. వైస్రాయ్‌ హోటల్లో చంద్రబాబు కొంతమంది ఎమ్మెల్యేలను నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆ  నిర్బంధితులపై పర్యవేక్షణ చేస్తూ వారి వద్దకు వచ్చిపోయే వారి సమాచారం తెదేపా నేతలకు అందించేందుకు వాలంటీర్లను బాబుకు స్వయంగా మార్క్సిస్టు పార్టీ అందించడం మార్క్సిజమా? అని కూడా ప్రశ్నించుకోవాలి. 1999లో ఎన్నికలు వచ్చేసరికి బాబు అవసరంలో తనను ఆదుకున్న కమ్యూనిస్టు పార్టీలను తిరస్కరించి కమ్యూనిస్టులకు సైద్ధాంతికంగా ప్ర«థమ రాజకీయ వ్యతిరేకి అయిన బీజేపీతో నాటి వాజ్‌పేయితో చేతులు కలిపారు. 2014 ఎన్నికలకు కూడా అదే పొత్తు కొనసాగిస్తూ కమ్యూనిస్టు పార్టీలను కాలం చెల్లిన పార్టీలని, తనకు పనికిరాని పార్టీలని బహిరంగంగా ఈసడించిన కమ్యూనిస్టు వ్యతిరేకి బాబు. 
2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కమ్యూనిస్టుల పాత్ర కూడా ఉంది.

ఆయన పాలన కమ్యూనిస్టు పరిభాషలో సోషలిజం కాకపోయినా, ప్రజానురంజకంగా సాగింది. ఆ దశలోనే చంద్రబాబు బీజేపీని బలపర్చి చాలా తప్పుచేశాననీ, ఇక జన్మలో ఆ పార్టీతో పొత్తుపెట్టుకోనని బహిరంగంగా ప్రజలముందు ఒట్టు వేసుకున్నాడు. కమ్యూనిస్టు పార్టీలకు మళ్లీ ఏమైందో ఏమో కానీ తమ పార్టీలను అవహేళన చేసిన బాబు టీడీపీతో భాగస్వాములైపోయాయి. 2009లో బాబు మహాకూటమి ఏర్పరిస్తే దాంట్లోనూ చేరిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు రంగులుమార్చే చంద్రబాబు టీడీపీ వంటి పార్టీలతో ప్రజలు కమ్యూనిస్టులనూ జతచేశారు. అయినా ఆ ఎన్నికల్లో గెలుపు ప్రజాభి మానం చూరగొన్న వైఎస్సార్‌నే వరించింది. చంద్రబాబు అంతకుమించి బీజేపీని ఇక అంటుకునే ప్రశ్నే లేదని 2004లో వేసుకున్న ఒట్టును గట్టుమీద పెడితే పిల్లి వచ్చి నాకిపోయిందట.

కనుక 2014లో నిర్లజ్జగా తిరిగి బీజేపీతో బాబు చేతులు కలిపాడు. 2002 గుజరాత్‌ మారణహోమం సందర్భంగా కిరాతకులు మా రాష్ట్రానికి వస్తే జైల్లోకి తోస్తానని ప్రగల్భాలు పలికిన బాబు అదే మోదీతో చేతులు కలిపాడు. వీరి సంసారం హాయిహాయిగా అంటూ సాగి చివరకు 2018 నాటికి విచ్ఛిన్నమై పోయింది. చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా, కొత్త రాజధాని అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణం కాకుండా పోలవరం ప్రాజెక్టు 2019 జూన్‌ నాటికి నీళ్లందించే బదులు చంద్రబాబు బినామీలకు వేల కోట్లు దోచిపెట్టే అక్షయపాత్ర అయింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతమే కాదు, ఆ పార్టీ నాయకుల అధికారం, అహంకారం, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణాలు, సామాన్య ప్రజానీకంపై లాఠీలు,  తమ పార్టీ కాని వారిని జైళ్లలో కుక్కడం, దళారులు, పచ్చికులతత్వం.. ఇలా ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలకు ఆలవాలమై రాక్షస పాలనగా 2019 ఎన్నికల వరకు సాగింది.

ఈ పరిస్థితిలో కమ్యూనిస్టులు, ఎంతో చొరవతో ఈ దుష్టపాలనకు వ్యతిరేకంగా తమ సర్వశక్తులూ ఒడ్డి తామొక బలమైన ప్రజాశక్తిగా ఎదిగేందుకు స్వతంత్రంగా ప్రజాపంథాన పరుగు తీయాల్సి ఉండె. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకోసం, రైతులకు, మహిళలకు న్యాయమైన రుణమాఫీ కోసం, నవరత్నాలు తదితర ప్రజానుకూల విధానాలను ప్రచారం చేస్తూ ప్రజాభిమానం చూరగొన్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డిని, వెన్నుపోటు రాజకీయాలకు మారుపేరై ప్రజావ్యతిరేకతను కూడగట్టుకున్న చంద్రబాబును ఒకే గాటన కట్టడం కమ్యూనిస్టులకు విజ్ఞత అనిపించుకుంటుందా? పైపెచ్చు చంద్రబాబు వ్యతిరేక ఓట్లు చీల్చి, పరోక్షంగా చంద్రబాబు టీడీపీకి ఉపయోగపడే దృక్పథంతో సాగుతున్న పవన్‌ కల్యాణ్‌ జనసేనతో కలిసి టీడీపీకి, వైఎస్సార్‌సీపీకి భిన్నమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని సాధిస్తామని కమ్యూనిస్టు పార్టీలు రంగంలో దిగాయి. వివేక భ్రష్ట సంపాతముల్‌ అంటే ఇదే. పైగా కమ్యూనిస్టులు పవన్‌ మాట వినాల్సిందే కానీ తాను వీరిని ఏ కోశానా పట్టించుకోడు. అంతకంటే కమ్యూనిస్టు పార్టీలే ఐక్యమై తామే ప్రత్యేకంగా పోటీ చేసి ఉంటే గౌరవంగా ఉండేది.

ఇన్ని లోపాలున్నా కమ్యూనిస్టు పార్టీల్లో నిజాయితీతోపాటు ప్రజల కోసం అహరహం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలూ కొందరున్నారు. ఈ స్థితిలోనూ కమ్యూనిస్టు పార్టీలు నిల్చి పుంజుకోవాలంటే వారికి సరైన రాజకీయ అవగాహన అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఏర్పడబోయే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీలు మద్దతు అందించాలి. తాము అంగీకరించలేని అంశాలను పాలకుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి ప్రయత్నించాలి. ఇప్పటికీ మన అమరవీరుల ఆశయస్ఫూర్తి, పోరాట పటిమ ఎక్కడికీపోలేదు. వారే ఆదర్శంగా కమ్యూనిస్టులు నిజాయితీగా పురోగమించే యత్నం చేసి తమ పున: ప్రతిష్టను పొందగలరని ఆశిస్తాను.

 వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

మరిన్ని వార్తలు