మౌనం వీడని శాంతి కపోతం

16 Nov, 2019 05:00 IST|Sakshi

ఆంగ్‌ సాన్‌ సూకీ

మయన్మార్‌లో రొహింగ్యా ముస్లిం శరణార్థులపై జరుగుతున్న అఘాయిత్యాలను, అత్యాచారాలను చూస్తూ కూర్చున్న వారి జాబితాతో కూడిన కేసొకటి విచారణ కోసం గురువారం అర్జెంటీనాలోని అంతర్జాతీయ న్యాయస్థానం ముందుకు వచ్చింది. ప్రధాన నిందితుల జాబితాలో ఆ దేశాన్ని పాలిస్తున్న ఆంగ్‌ సాన్‌ సూకీ పేరు కూడా ఉండటంతో ఈ పూర్వపు యోధురాలు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. జీవించే హక్కును కాలరాస్తున్నారన్న ఆరోపణతో సూకీ పై తొలిసారిగా నమోదైన కేసు ఇది!

సూకీ ప్రస్తుతం మయన్మార్‌ స్టేట్‌ కౌన్సెలర్‌. ఆ పదవి ప్రధాని పదవితో సమానం. నేరుగా ప్రధాని పదవే ఇవ్వడానికి అక్కడి రాజ్యాంగ నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. మయన్మార్‌ ప్రధానికి గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ విదేశీ మూలాలు ఉండేందుకు లేదు. సూకీ భర్త మైఖేల్‌ ఆరిస్‌ (1999 లో చనిపోయారు) బ్రిటిష్‌ దేశస్థుడు. ఈ దంపతుల పిల్లలు సహజంగానే బ్రిటిష్‌ సంతతి వారు అవుతారు. అందువల్ల సూకీ ‘స్టేట్‌ కౌన్సిలర్‌’ గా ఉండిపోవలసి వచ్చింది. దేశ నిర్దేశకురాలు అంతే. రాష్ట్రపతి ఉంటారు కానా, నామమాత్రం.  

నాడు యోధురాలు
1989 జూలై 20 నుంచి 2010 నవంబర్‌ 13 వరకు ఇరవయ్యొక్కేళ్ల కాలంలో మధ్య మధ్య స్వల్ప విరామాలతో దాదాపు 15 ఏళ్ల పాటు బర్మా సైనిక పాలకుల నిర్బంధంలో గడిపారు సూకీ. నిర్బంధం నుంచి బయటపడిన ఏడాదిన్నర తర్వాత – బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కేప్టెన్‌ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్‌ లోకి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి మర్యాదలు చేశాడు. ఆ హైటెక్‌ కంట్రోల్‌ ప్యానెల్‌ నుంచి భూమి మీద మినుకు మినుకుమని వెలుగుతున్న నగరాలను చూడగానే సూకీకి మయన్మార్‌ నిరుద్యోగ యువకులు, వారి కలలు, ఆశలు గుర్తొచ్చాయి.

తర్వాత.. బ్యాంకాక్‌లో జరిగిన ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం’లో ఆమె ప్రసంగిస్తూ.. ‘‘కొంతమంది బర్మా అని, కొంతమంది మయన్మార్‌ అని పిలిచే మా చిన్ని భూభాగానికి మీరంతా పెద్ద మనసుతో అసరా ఇవ్వాలి’’ అని విజ్జప్తి చేశారు. ఆ తర్వాత ఆమె అన్న మాట ఫోరమ్‌ సభ్యుల మనసు గెలుచుకుంది. ‘‘కొంచెం ఇవ్వండి చాలు. అవినీతికి అవకాశం కల్పించేంత భారీ స్థాయి పెట్టుబడులు అక్కర్లేదు’’ అన్నారు సూకీ. లేత నీలి రంగు దుస్తులలో, తలలో తెల్లటి పూలతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడొక స్వేచ్ఛా విహంగంలా కనిపించారంటూ అంతర్జాతీయ న్యూస్‌ చానళ్లు ఆహ్లాదకరమైన పోలికను తెచ్చాయి.

నేడెందుకీ తారతమ్యాలు
అంతటి స్వేచ్ఛా విహంగం ఇప్పుడెందుకిలా రొహింగ్యాల హక్కుల రెక్కలు విరిచేస్తున్నారన్న ఆరోపణలపై కనీసం ఒక్క మాటైనా మాట్లాడలేక, నిందితురాలిగా మిగిలిపోతున్నారు? ఇదే ప్రశ్నను బి.బి.సి. రిపోర్టర్‌ సూకీని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఒక్కటే. ‘‘ఏళ్ల తరబడి ఒక దేశం నియంతృత్వంలో ఉన్నప్పుడు.. ప్రజాస్వామ్యం వచ్చాక కూడా ఆ దేశంలోని ప్రజల భయం పోదు. ఆ ప్రజలు ఎవర్నీ విశ్వసించరు. అదే విధంగా మయన్మార్‌ ప్రజలు బంగ్లాదేశ్‌ నుంచి లక్షలాదిగా వలస వస్తున్న రొహింగ్యాలను అనుమానంగా చూస్తున్నారు. పర్యవసానమే ప్రస్తుత పరిస్థితి’’ అని!!
ఈ మాటతో అంతర్జాతీయ న్యాయస్థానం ఏకీభవిస్తుందా అన్నది చూడాలి.

►నిర్బంధం నుండి విముక్తురాలయ్యాక.. బ్యాంకాక్‌లో ఏర్పాటైన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనడం కోసం సూకీ చేసిన తొలి విమాన ప్రయాణంలో ఆమెను చూడగానే కేప్టెన్‌ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అంతేనా! కాక్‌పిట్‌లోకి ఆహ్వానించి, అక్కడ కొంతసేపు కూర్చోబెట్టి సూకీకి మర్యాదలు చేశాడు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా