తెలియక ప్రేమ తెలిసి ద్వేషము

9 Sep, 2019 00:09 IST|Sakshi

ఏమీ! నీవూ ఆ దేవాలయ ప్రవేశ సందర్భములోనే నెత్తి పగిలిన మహావీరుడవా నాయనా? స్వర్గంలో ఇంద్రవైభవము పొందగలవు. నీ తల పగులకొట్టిన ఆ పాపాత్ముడెవడు? వానికి నరకం తప్పునా?

‘‘ఎంత బాగుందోయి పాట. కొంతసేపాగి విని, మరిపోదామా?’’
‘‘నాకూ విందామనే వుంది కాని సమయానికక్కడ చేరకపోతే దయాదాక్షిణ్యం లేక దండన విధిస్తాడు ఆ యమధర్మరాజు తెలుసా?’’
‘‘ఆ భయం మనకు లేనిదెపుడు. వైతరణి దాటితే యమపురి ఎంతదూరం. తొందరగా నడిస్తే వేళ కందలేమా ఏమి?’’
‘‘కాని పాశాల్లో జీవాలున్నావే, వెంట తీసుకొని ఎలా వెళ్లడం గంధర్వుల గానం వినేటందుకు?’’
‘‘వైతరిణీ తీరాన వదిలేద్దాం. తిరుగుతాయి పాపం కొంచెం స్వేచ్ఛగా. ఎటైనా పారిపోతాయన్న భయమూ లేదు.’’
‘‘సరే, నడువు అట్లాగయితే.’’
‘‘ఇదేమిటి? ఇప్పటికి నేనొక్కడనే అనుకుంటున్నాను ఈ ప్రదేశంలో. కాని మీరెవరో వున్నారే నాతోపాటు? మనమెక్కడ వున్నది మీకేమైనా తెలుసా?’’
‘‘నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఏమీ బోధపడడం లేదు.’’
‘‘సరే కాని, ఎక్కడివాడవు నాయనా నీవు?’’
‘‘అయ్యా, నేను భారతీయుడను.’’
‘‘మహాభాగ్యం, ఏ ప్రాంతం నాయనా?’’
‘‘అయ్యా నేను నిజాం రాష్ట్రంలోని తెలంగాణా మనిషిని.’’
‘‘ఏమంటివి! స్వదేశీయుడవే కాకుండా స్వప్రాంతీయుడవు కూడానా? అందుకే, నిన్ను చూడడంతోనే ఒక విధమైన సోదరప్రేమ కలిగింది. ఇక్కడికెలా రావడమైంది బాబూ?’’
‘‘అదే బోధపడడం లేదు నాకూను. ఉదయం మా వూళ్లో జరిగిన కొట్లాటలో నా తలపైన దుడ్డుకర్ర పడ్డాక స్పృహ తప్పింది. తర్వాత ఏమి జరిగిందో చూస్తే ఇక్కడున్నాను.’’
‘‘ఎంత చిత్రం, మీ ఊళ్లో కూడా ఉదయం గోల జరిగిందా? నా తలపైన గొడ్డలి పడడం వరకు జ్ఞాపకం ఉంది. తర్వాత ఏమి జరిగినదీ నాకు తెలియదు.’’

‘‘బాగానే వుంది. అయితే మీ ఊళ్లో జరిగిన సంగతేమిటో చెప్పండి. నేను మా సంగతి చెపుతాను తరవాత. అన్యాయంగా వుందండి కథ. ప్రపంచంలో దయ అనేది లేకపోవడం సత్యమని బోధపడుతుంది మీకే తర్వాత.’’

‘‘నా కథ అలాగే వుంది అబ్బాయి. ప్రపంచంలో ధర్మమనేది నాశనమయిపోతున్నది దినదనం. ఆచార వ్యవహారాలు మంట గలుస్తున్నాయి లోకంలో. మా ఊళ్లో జరిగిన కథ చెప్పితే నమ్మవేమో అని అనుమానిస్తున్నాను. అందుకే నీవే నీ కథ మొదలు చెప్పితే బాగుంటుందని నా అభిప్రాయం.’’

‘‘నిజమేనండి. ప్రపంచంలో మనుష్యత్వమే లేకుండా పోయింది. ఏమి చెప్పేది మా ఊళ్లో అవస్థ. మా ఊళ్లో ఒక దేవాలయం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద తీర్థం సాగుతుంది. ఈ ఏడు జాతర అప్పుడు దేవాలయ ప్రవేశ విషయంలో వచ్చింది తగాదా అస్పృశ్యులకు, సవర్ణ హిందువులకు. సవర్ణులలో కొందరు దేవాలయ ప్రవేశానికి సాయపడతాం అన్నారు. దాంట్లో ఒకరిద్దరు బ్రాహ్మణులు కూడా వుండటం తటస్థించింది. జాతరకంటె వారం ముందే హరిజనులందరు దేవాలయ ప్రవేశ విషయమై సత్యాగ్రహం మొదలుపెట్టారు. బ్రాహ్మణులూ, యితర హిందువులూ లాఠీలతో గుడి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఈరోజు ఉదయం హరిజనులు కూడా సత్యాగ్రహానికి స్వస్తి చెప్పి దేవాలయ ప్రవేశం చేద్దామని లాఠీలతో తయారైనారు. జరిగింది సవర్ణ అవర్ణ హిందువులకు లాఠీలతో సంగ్రామం.’’

‘‘ఏమీ! నీవూ ఆ దేవాలయ ప్రవేశ సందర్భములోనే నెత్తి పగిలిన మహావీరుడవా నాయనా? స్వర్గంలో ఇంద్రవైభవము పొందగలవు. నీ తల పగులకొట్టిన ఆ పాపాత్ముడెవడు? వానికి నరకం తప్పునా? నేనూ ఆ ధర్మయుద్ధంలో పాల్గొన్న వీరుడనే తండ్రీ. ఇంతకూ, మనమిరువురమూ ఒక్క ఊరివారమే నాయనా, నిన్ను కొట్టిన ఆ దుర్మార్గుడెవడో జ్ఞాపకమున్నదా?’’

‘‘బాగా బలిసిన ఒక లావాటి బాపనయ్య నా తలపై దుడ్డుకర్ర వేసాడు. అతనికీ తగిన శాస్తి అయిందనే నా అభిప్రాయం. మా వెంకడు అప్పుడే గొడ్డలితో అతని బుర్రపై కొట్టినట్లు నాకు జ్ఞాపకం.’’
‘‘ఓరి ఇక్కడా దాపురించావు? దేవాలయ ప్రవేశం కంటే మొదలు యమపురి ప్రవేశం చేయిస్తామని అనుకుంటే తప్పించుకుపోయావు. కాని ఇప్పుడెటు పోతావురా? గొంతు పిసికి పారేస్తాను చూడు.’’
‘‘బొర్రపై కొట్టానంటే భక్ష్యాలన్నీ బయటపడాలే జాగ్రత్త.’’
‘‘అబ్బా ఎంత తన్ను తన్నితివిరా?’’
‘‘అయ్యో చస్తి చేతకాక కొడుతావటయ్యా ఉండు నీ పని పట్టిస్తా.’’
‘‘అరే చాలురా పాట వినడం. నదీ తీరాన ఏవో కేకలు వినవస్తున్నాయి. ప్రాణాలను పాశాల్లోంచి వదిలి వచ్చాం. అలవాటు చొప్పన ఇక్కడా కొట్లాడుకుంటున్నాయో ఏమో.’’
‘‘అవునురా ఈ కేకలక్కడివే.’’
‘‘..........’’
‘‘..........’’
‘‘వీరి కావరం మండా. పోనీ పాపమని కొంత స్వేచ్ఛ యిస్తే మళ్లీ తన్నుకుంటున్నారేమిరా?’’
‘‘చచ్చి ఇంకా పది గంటలు కాకపోయే. ద్వేషం అప్పుడే పోతుందా?’’
‘‘చచ్చినా ఈ మతపిచ్చి ఈ వర్ణభేద శతృత్వం పోలేదేం? యమపురిలో తీర్పు చెప్పిన తరువాత తెలుస్తుందిలే సంగతి.’’
‘‘ఇంకా ఆలోచిస్తున్నావే నేను పాశంలో వేసుకొని నడవటానికి సిద్ధంగా వుంటే?’’
‘‘ఏమి, దేవాలయ ప్రవేశం చేస్తామంటే అడ్డుపడడమే కాకుండా ఒకరిని కర్రతో బాది చంపినాడా?’’
‘‘అవును మహాప్రభో!’’
‘‘ఏమోయి, మావాడు నీ విషయమై చెప్పేది నిజమేనా?’’
‘‘అయ్యా నిజమే కాని ధర్మ సంరక్షణ...’’
‘‘నోరుమూయి ధర్మాధర్మములు ధర్మరాజునైన నాకా చెప్పేది? ఒరే ఇతనిని పదిరోజులూ అగ్నిగుండంలో పడవేసి తరువాత కొచ్చిన్‌లోని ఒక పరయా కుటుంబంలో పడెయ్యి. ధర్మం తెలుస్తుంది.’’
‘‘అయ్యో అగ్నిగుండమా? మాదిగ జన్మమా? అన్యాయం, ఘోరం’’
‘‘...........’’
‘‘వీడెవడురా?’’
‘‘దేవాలయ ప్రవేశానికి లాఠీతో పోయి చంపబడ్డ...’’
‘‘అట్లాగా. నీవు మహాత్ముడు చెప్పిన అహింసా విధానం మాని లాఠీ సహాయమెందుకు అపేక్షించావు దేవాలయ ప్రవేశానికి?’’
‘‘ఎన్నిరోజులు ప్రయత్నించినా దయరాలేదు. విసిగి జబర్దస్తీకి దిగాం మహారాజా.’’
‘‘అది తప్పే. ఒరే వీడిని రెండు రోజులు ఆ మంచులో పడవెయ్యి కోపం అంతా పోయి శాంతం అలవడుతుంది. మూడోరోజు తిరువాన్కూరులో హరిజన కుటుంబంలోకి పంపించు.’’
‘‘తెలుగు దేశంలో కాక మలయాళ దేశంలో ఎందుకు తండ్రీ జన్మం?’’
‘‘మళ్లీ దేవాలయ ప్రవేశపు చిక్కు లేకుండా. లేకపోతే తలపగులకొట్టించుకొని చేరుకుంటావు నా వద్దకు.’’


కాళోజీ నారాయణరావు 
కాళోజీ నారాయణరావు (9 సెప్టెంబర్‌ 1914 – 13 నవంబర్‌ 2002) కథ ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’కు సంక్షిప్త రూపం. కాళోజీ తండ్రి మరాఠీ, తల్లి కన్నడిగ, జన్మ తెలంగాణ. చిన్న చిన్న ఉద్వేగాలకు కూడా స్పందించి కళ్లనీళ్లు పెట్టుకునే కాళోజీ పెద్ద పెద్ద ఉద్యమాలకు పెద్దదిక్కుగా ఉన్నందువల్లే కాళన్న అయినాడు, పద్మవిభూషణ్‌ అయినాడు, ప్రజాకవి అయినాడు. నా గొడవ ఆయన కవితా సంపుటి. ఇదీ నా గొడవ ఆత్మకథ. ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. నేడు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ 105వ జయంతి ఉత్సవం రవీంద్రభారతిలో జరగనుంది.

మరిన్ని వార్తలు