అంకురంలోనే అంకుశం!

13 Aug, 2014 23:10 IST|Sakshi
అంకురంలోనే అంకుశం!

కొత్త కళలకు రెక్కలు తొడిగే వయసు టీనేజీది. ఈ వయసులో పరిసరాలపై గమనింపు ఎంతగా ఉంటుందో... తమ శరీరాన్ని అందంగా అలంకరించుకోవడంలో అంతే శ్రద్ధ ఉంటుంది. అయితే కొన్ని తెలిసి, కొన్ని తెలియక ఈ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి చర్మ సౌందర్య సమస్యలు.
 
చర్మం అంతర్గత అవయవాల ఆరోగ్యానికి అద్దంలాంటిది. చర్మం ఎంత నిగారింపుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సాధారణంగా 13 నుంచి 19 ఏళ్ల వయసులో పిల్లల్లో చర్మం నునుపుగా, బిగువుగా ఉంటుంది. కానీ, ఇటీవల ఈ వయసులోనూ చర్మసమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా కనిపించే సమస్య మొటిమలు, యాక్నె (చర్మం పై పొరలలో గడ్డలుగా కనిపించడం). ఇవి ముఖం, మెడ, భుజాలు, వీపుపై భాగాలలో కనిపిస్తుంటాయి. అలాగే వదిలేస్తే మచ్చలు ఏర్పడతాయి. ఇవి యుక్తవయసులోనే కాదు ఒక్కోసారి జీవితాంతం వేధించవచ్చు.

 ఇవి గమనించండి...

హార్మోన్లు... పిల్లలు యుక్తవయసుకు వచ్చేటప్పుడు వారి శరీరంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్, అమ్మాయిల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లు కీలకమైనవి. ఈ స్రావాల అసమతౌల్యతల వల్ల  సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ ప్రభావం మేనిపై పడుతుంది. నూనె గ్రంథుల నుంచి స్రావాలు అధికంగా వెలువడి, మొటిమలకు కారణమవుతుంటాయి.
 
శుభ్రత లోపం... ఇంటా బయట రకరకాల కాలుష్య ప్రభావాలు చర్మం మీద పడుతుంటాయి. ఇలాంటప్పుడు సరైన శుభ్రత పాటించకపోయినా చర్మం నిగారింపు కోల్పోతుంది.

చుండ్రు... ఈ వయసులో తలలో చుండ్రు అధికంగా గమనిస్తుంటాం. చుండ్రు భుజాలు, ముఖం, వీపు మీద పడటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది మొటిమలకు కారణం అవుతుంది.

మానసిక ఒత్తిడి.... ర్యాంకులు, మార్కులు, చదువు స్ట్రెస్‌తో పాటు నిద్రవేళలు సరిగా పాటించకపోవడం వల్ల ఈ వయసువారి హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. చర్మం పొడిబారడం, మలబద్ధకం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవీ మొటిమలు, యాక్నెకు కారణాలు అవుతాయి.

జీవనశైలిలో తేడాలు... నేటి యాంత్రిక కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం పెరిగి, శరీరానికి తగినంత శ్రమ ఉండటం లేదు. దీని వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. సమతుల ఆహారం తీసుకోకపోవడం, బేకరీ, నిల్వ పదార్థాలు తినడం ఈ వయసు పిల్లల్లో అధికం. ఆహార సమయాలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఆరోగ్యంపై తద్వారా చర్మంపై ప్రభావం చూపిస్తున్నాయి.
 ఇవి పాటించండి...పిల్లలు వయసురీత్యా తమ విషయాలలో అశ్రద్ధ వహిస్తుంటారు. తల్లిదండ్రులే ఎదిగే వయసులో ఉన్న పిల్లల ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టాలి.

 ఫేస్‌వాష్ మేలు...

అబ్బాయిలు, అమ్మాయిలు ... సబ్బులకు బదులుగా గ్లైకాలిక్ యాసిడ్, ఫాలిక్యులార్ యాసిడ్ వంటి ఔషధగుణాలు గల ఫేస్‌వాష్‌లను వాడాలి.  

మసాజ్‌లకు దూరం...

యాక్నె, మొటిమల సమస్యలు ఉండటంతో చాలామంది మసాజ్‌లు చేయిస్తే ఫలితం ఉంటుందని భావిస్తారు. కానీ మసాజ్ వల్ల మొటిమలలోని పస్ ఇతర భాగాలకు చేరి, బ్యాక్టీరియా వృద్ధి చెంది, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని మసాజ్‌లు, ఫేస్‌ప్యాక్‌లకు వీరు దూరంగా ఉండటం మేలు.

క్రీములు వద్దే వద్దు...

చర్మం రంగుతేలాలని చాలా మంది టీనేజ్ నుంచే ‘వెటైనింగ్ క్రీముల’ను వాడుతుంటారు. వీటి వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రకాల క్రీములు మొటిమలలోనికి చొచ్చుకుపోయి, దురద, దద్దుర్లకు కారణం అవుతాయి.

రోజూ తలస్నానం...

నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ షాంపూతో రోజూ తలస్నానం చేయాలి. హెయిర్ స్టైల్స్‌కు వాడే జెల్స్, సీరమ్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పైపై క్రీములతో మెరుగులు దిద్దడం కన్నా అంతర్గత ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.
 
సమస్య ఉన్నవారు ఒకసారి నిపుణులను సంప్రదించి వదిలేయకుండా కనీసం 3-4 ఏళ్లపాటు వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండాలి. ఇప్పటికే యాక్నె వల్ల మచ్చలు ఏర్పడిన వారికి విటమిన్ క్రీమ్స్, గ్లైకాలిక్ పీల్, డెర్మారోలర్.. వంటి వాటితో మచ్చలు, స్కార్స్ తగ్గించవచ్చు.

 - డా.షాను,
 చర్మ వైద్య నిపుణులు, కాయా స్కిన్ క్లినిక్
 

మరిన్ని వార్తలు