కరోనా గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందంటే...

19 Mar, 2020 10:34 IST|Sakshi

కరోనా వైరస్‌ అని నిర్దిష్టంగా ఓ వైరస్‌ గురించి ఆయుర్వేదం చెప్పకపోయినా... ఒకేసారి అకస్మాత్తుగా పాకిపోయే సూక్ష్మజీవుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి ఆయుర్వేదం వర్ణించింది. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి అవుట్స్‌బ్రేక్‌ గురించి ఆయుర్వేదం ఏం చెబుతోందో చూద్దాం. ఆయుర్వేదం చెప్పిన విషయాలను ఇతర వైద్యవిధానాలతో సరిపోల్చుకుని, తమ విజ్ఞతను బట్టి మరీ ఎవరికి వారే ఈ వైద్యవిధానాన్ని అనుసరించవచ్చో లేదో నిర్ణయించుకోవచ్చు.

వ్యాధులను వర్గీకరిస్తోంది ఇలా...
తల్లిదండ్రుల బీజదోషాల వల్ల, ఆహారవిహారాల తేడాల వల్ల వచ్చేవాటిని ఆయుర్వేదం ‘నిజ’రోగాలుగా చెబుతుంది. ఇక వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ప్రమాదాల వల్ల వచ్చే వ్యాధులను ‘ఆగంతుజ’రోగాలుగా అభివర్ణించింది. ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అంటువ్యాధుల్ని ‘సాంక్రామిక’ రోగాలుగా ఉటంకించింది. ఇవి సంక్రమించే మార్గాలేమిటో సుశ్రుతాచార్యులు ఇలా చెప్పారు.

ప్రసంగాత్, గాత్రసంస్పర్శాత్, నిశ్వాసాత్, సహభోజనాత్, సహ శయ్యా ఆసనాత్‌
చాపి వస్త్రమాల్యానులేపాత్‌... ... .... ఔపసర్గిక రోగాశ్చ సంక్రామంతి నరాన్నరాన్‌.
మరీ దగ్గర దగ్గరగా కూర్చుని మాట్లాడటం, శరీరాలు తాకేటంత సన్నిహితంగా ఉండటం, ఒకరు వదిలిన ఊపిరిని మరొకరు పీల్చడం, రోగగ్రస్తమైన వారితో కూర్చుని భోజనం చేయడం, ఒకే మంచంపై కలిసి పడుకోవడం, ఒకరి వస్తువులు మరొకరు వాడటం వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.

శుచి, శుద్ధి (పరిశుభ్రత) లేనిచోట, లేనివారికి గ్రహరోగాలు సోకుతాయని కశ్యపుడు, చరకాచార్యుడు స్పష్టీకరించారు. అయితే ఇక్కడ గ్రహాలంటే  ‘పటì æ్టపీడించేవి’ అనే అర్థంలో వాడిన శబ్ద విశేషం. పట్టి పీడిస్తాయి కాబట్టి  ఆ పదాలకు ‘వైరస్, బ్యాక్టీరియా’ అనే సూక్ష్మాంగ క్రిములని అర్థం. (సవిషక్రిమి పిశాచాదయః ; గృహ్ణతిగ్రసతీతి గ్రహః).

మళ్లీ ఈ క్రిములను ఉపకారులు, అపకారులు అని రెండుగా విభజించారు. అంటే... ఇంగ్లిష్‌ వైద్యవిధానం (అల్లోపతి)లోని బ్యాక్టీరియాలో మేలు చేసేవి. కీడు చేసేవిగా చెప్పిన విధంగానే ఇక్కడా వర్ణించారు. ఉదాహరణకు మనిషి పేగుల్లో అభివృద్ధి చెంది దేహపోషణకు పనిచేకొచ్చేవి ఉపకారులు. వ్యాధిని కలిగించేవి అపకారులు. గ్రహాలు (సూక్ష్మజీవులు) మామూలుగా కంటికి (నేకెడ్‌ ఐకి) కనిపించవని చెప్పారు.

ఇవే మనం చెప్పుకునే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్షా్మంగ కృములు / క్రిములు.
ఈ క్రిముల వల్ల ప్రాణవహ స్రోతస్సుకు (ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు) సంబంధించిన లక్షణాలు : తుమ్ములు, ముక్కుకారడం, గొంతునొప్పి, దగ్గు, ఆయాసం, జ్వరం మొదలైనవి).
నివారణ / చికిత్స: వైరస్‌ (ఇక్కడ ఆయుర్వేదంలో చెప్పినట్టు గ్రహం అనే మాట కూడా వాడుకోవచ్చు) పేరేదైనా వ్యాధి లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ తరహా వైరస్‌ సమస్యలకు తాత్కాలిక ఉపశమనం (శమన చికిత్స), పూర్తిగా పోగొట్టడం (శోధన చికిత్స/పంచకర్మలు) వంటి పద్ధతులలో వైద్య నడుస్తుంది.

నిదాన పరివర్జనం (అంటే కారణాన్ని దూరం చేయడం లేదా కారణానికి మనం దూరంగా ఉండటం) అన్నది ఒక ప్రధాన చికిత్సాసూత్రం.
వ్యాధి క్షమత్వకశక్తి (ఓజస్సు)... (మామూలుగా ఇప్పుడు వాడే భాషలో చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి) పటిష్టపరచడం మరో ముఖ్యసూత్రం. ఇది రసాయన, వాజీకరణ ప్రక్రియల ద్వారా సాధ్యపడుతుంది.
పంచమహాభూతాలు (భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం) కాలుష్యానికి గురై వందల, వేల సంఖ్యలో ఒక్కసారిగా మనుషులు మృత్యువు పాలయ్యే పరిస్థితిని ‘‘జనపదో ధ్వంశాలు’’ అని చరకాచర్యుడు వివరించాడు. వీటినే ఇంగ్లిష్‌లో ఎపిడెమిక్‌/ప్యాండమిక్‌ వ్యాధులుగా చెబుతారు.
ప్రకృత్యాభిః భావైః మనుష్యాణాం యే అన్యే భావా సామాన్యాః తత్‌ వైగుణ్యాత్‌ సమాన కాలాః ...  ...  జనపదముధ్వంసయంతి ... ... జనపదేషు భవంతి ... ... వాయుః, ఉదకం. దేశః కాల ఇతి).
శోకం, భయం, చింత మొదలైన ఉద్వేగాల వల్ల వ్యాధినిరోధకశక్తి /క్షమత్వం తగ్గిపోతుందని శాస్త్రకారులు స్పష్టీకరించారు.

పాటించాల్సిన నివారణ చర్యలేమిటి:
శుచి, శుభ్రతకు సంబంధించి వ్యక్తిగతంగా శ్రద ్ధవహించాలి. ఇంటికి, పరిసరాలకు సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. వేపకొమ్మలు, మామిడి తోరణాలు ద్వారాలకు కడితే ఆ ఆకులు సూక్ష్మక్రిముల్ని పీల్చేసుకుంటాయి.
అల్లం, వెల్లుల్లి కషాయంతో రెండు చిటికెలు పసుపు, ఆరు చిటికెలు దాల్చిన చెక్క చూర్ణం కలిపి 30 మి.లీ. (ఆరు చెంచాలు) రోజూ తాగితే నివారణకు ఉపకరిస్తుంది. (ఇది కరోనా వైరస్‌కు మాత్రమే గాక... ఎలాంటి సాంక్రమిక రోగాలైనా నివారించేందుకు ఉపకరించే సాధారణ మిశ్రమం). చిన్నపిల్లలకైతే రోజూ ఒకటి నుంచి రెండు చెంచాలు తేనెతో ఇవ్వవచ్చు.
ఉసిరికాయ (ఆమలకీ దేశీయ) అత్యుత్తమమైన ఔషధం. కాయను నమిలి తిన్నా, రసం (ఒక చెంచా) తేనెతో లేదా ఎండించిన చూర్ణం (మూడు గ్రాములు) తేనెతో సేవించిన నివారణకూ / చికిత్సకూ పనికి వస్తుంది.
(ఉసిరిలోని విటమిన్‌–సి వ్యాధి నిరోధకతకు దోహదపడుతుందన్నది ఇంగ్లిష్‌ / అల్లోపతిక్‌ వైద్య విధానం చెప్పే మాటే కదా).
గొంతు గరగర తగ్గడానికి వ్యోషాదివటి మాత్రలు చప్పరించాలి.

ప్రధాన చికిత్స కోసం...
త్రిభువనకీర్తి రస మాత్ర:   ఉదయం 1  
మహాలక్ష్మీవిలాసరస మాత్ర: రాత్రి 1
ఇవి అత్యుత్తమ రసాయన ఔషధాలు.
తులసి ఆకుల రసం: ఒక చెంచా తేనెతో రెండుపూటలా సేవించాలి.  చికిత్స తప్పనిసరిగా వైద్యుని పర్యవేక్షణలో జరగాలని గుర్తుంచుకోండి.
గమనిక: బయటి ఆహారం / తినుబండారాల జోలికి పోవద్దు. ఇంట్లో వండుకున్న తేలికైన ఆహారాన్ని వేడిగా ఉండగానే తినాలి.– డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు