భళా.. బదనవాళు ట్రీ కాటన్‌!

17 Apr, 2018 00:43 IST|Sakshi
డా. ఖాదర్‌ వలి ఇంటి ఆవరణలో 15 అడుగుల బదనవాళు పత్తి చెట్టు (బదనవాళు దూది, విత్తనాలు)

బదనవాళు అనేది కర్ణాటకలోని ఓ కుగ్రామం. మైసూరుకు 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుదైన ఒక రకం పత్తి చెట్ల జాతికి ఆ ఊరే పుట్టిల్లు.  490 ఏళ్ల క్రితం నాటి పురాతన చెట్టు రకం పత్తి ఇది. అప్పట్లో ఆ ఊళ్లో అంతటా ఈ పత్తి చెట్లే ఉండేవట. అందుకే, ఆ పత్తి చెట్లకు ‘బదనవాళు పత్తి’ అని పేరు వచ్చింది. అయితే, కాలక్రమేణా వీటిపై శ్రద్ధ తగ్గింది. ఇప్పుడు బదనవాళు పత్తి చెట్ల ఆచూకీయే దొరకనంతగా కనుమరుగైపోయాయి.

పత్తి పంట అనగానే.. విత్తనం వేసి.. కొద్ది రోజుల్లో పత్తి తీసేసుకొని.. మొక్కను పీకేయటం.. మళ్లీ వర్షాలు పడినాక మళ్లీ విత్తనం వేసుకోవడమే మనకు తెలుసు. అయితే, బదనవాళు అలాకాదు. ఒకసారి విత్తనం వేస్తే పెద్ద చెట్టుగా పెరిగి 40–50 సంవత్సరాల పాటు పత్తి దిగుబడినిస్తుంది. 2–3 ఏళ్లకు కాపుకొస్తుంది. 4 ఏళ్లకు 15 అడుగుల ఎత్తు పెరుగుతుంది. విత్తనాలను 3 రోజులు నీటిలో నానబెట్టి నాటుకోవాలని మైసూరుకు చెందిన ‘అటవీ కృషి’ నిపుణుడు, ప్రఖ్యాత స్వతంత్ర ఆహార శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.

దాదాపు కనుమరుగైపోయిన బదనవాళు పత్తి గింజలు కొన్నిటిని సేకరించిన ఆయన తన ఇంటి వద్ద, అటవీ కృషి వ్యవసాయ క్షేత్రంలోను నాటారు. తాను ప్రత్యేకంగా తయారు చేసుకున్న ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువుతో ఈ చెట్లను పెంచుతున్నారు. అభయారణ్యం నుంచి తెచ్చిన గుప్పెడు మట్టితోపాటు సిరిధాన్యాలు, పప్పుధాన్యాల పిండి, తాటిబెల్లం కలిపి ‘అటవీ చైతన్యం’ ద్రవరూప ఎరువును ఆయన తయారు చేస్తున్నారు(దీనిపై మరిన్ని వివరాలకు 2017–09–19 నాటి ‘సాక్షి సాగుబడి’ పేజీ చూడండి). నాలుగేళ్ల క్రితం నాటిన చెట్లు 15 అడుగుల వరకు పెరిగాయి. కాయలు కాస్తున్నాయి. దేశీ రకమైనందున బదనవాళు పత్తి చెట్లను రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయకుండానే పెంచవచ్చు.

వాణిజ్య స్థాయిలో పంట పొలాల్లో సైతం రైతులు ఈ పత్తి చెట్ల తోటలను సాగు చేసుకోవచ్చని, ప్రతి ఏటా ప్రూనింగ్‌ చేస్తూ ఉంటే మంచి పత్తి దిగుబడి వస్తుందని డాక్టర్‌ ఖాదర్‌ చెబుతున్నారుబదనవాళు పత్తి గింజల నూనె మంచి వంట నూనెగా కూడా పనికొస్తుందని, గతంలో మిల్లుల్లో గ్రీజుకు బదులుగా ఈ నూనెను వాడేవారన్నారు. అంతేకాదు.. ఆడ, మగవారిలో జననాంగ సంబంధమైన ఆరోగ్య సమస్యల నివారణకు ఈ పత్తి చెట్టు ఆకుల కషాయం మంచి ఔషధంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. బహుళ ప్రయోజనాలు కలిగిన బదనవాళు పత్తి చెట్ల గురించి ఇతర సమాచారం కోసం.. ‘అటవీ కృషి’ నిపుణుడు బాలన్‌ కృష్ణ (097405 31358)ను తెలుగు, కన్నడ, తమిళం, ఆంగ్లంలో సంప్రదించవచ్చు.

                                  బదనవాళు పత్తి మొక్క

మరిన్ని వార్తలు