మృదువైన కేశాల కోసం...

5 Sep, 2018 01:10 IST|Sakshi

బ్యూటిప్స్‌

జుట్టు మరీ పొడిబారి, బిరుసుగా ఉన్నట్లయితే అరటిపండు గుజ్జు పట్టించాలి. బాగా పండిన అరటిపండును కేశాల నిడివిని బట్టి ఒకటి లేదా రెండు తీసుకోవాలి. గుజ్జును బాగా చిలికి అవసరమైతే మిక్సీలో బ్లెండ్‌ చేసి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టును మెత్తబరిచి పట్టుకుచ్చులా మారుస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.ఒక కప్పు పెరుగులో, ఒక టేబుల్‌ స్పూను గోరింటాకు పొడి, ఒక టీ స్పూను నిమ్మరసం, ఒక టేబుల్‌ స్పూను కాఫీ లేదా టీ డికాషన్‌ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి నలభై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇది కేశాలకు బలాన్నిస్తుంది. కనీసం నెలకొకసారైనా ఇలా చేస్తుంటే జుట్టు రాలడం, చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలేవీ రావు. కాఫీ, టీ డికాషన్‌లు కండిషనర్‌గా పనిచేసి కేశాలను మృదువుగా చేస్తాయి.

మూడు టేబుల్‌ స్పూన్ల గోరింటాకు పొడిలో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగను తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే పొడి నాని మెత్తబడుతుంది. అందులో అరటిపండును మిక్సీలో బ్లెండ్‌ చేసి కలపాలి. అవసరమైతే మజ్జిగ మోతాదును పెంచుకోవచ్చు లేదా కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది కేశాలను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది. 

మరిన్ని వార్తలు