పోడు వ్యవసాయాన్ని పట్టించుకున్న పెద్ద మనసు వై.ఎస్‌ది

8 Jul, 2017 01:54 IST|Sakshi
వైఎస్సార్‌ చేతులమీదుగా తొలిపట్టా అందుకుంటున్న గంగరాజు (ఫైల్‌)

అడవి బిడ్డలంటే అందరికీ అలుసే. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల బాధలు ఎవరికీ పట్టేవి కాదు. ఆ ప్రాంతంలోని రైతు సమస్యలు కూడా పట్టేవి కాదు. మాకు దుమ్ముగూడెం ఏజెన్సీ ప్రాంతంలోని  అడవి రామవరం సమీపంలో సాగు ఉంది.  2003 నుంచి అక్కడ పోడు నరికి వ్యవసాయం చేస్తున్నాం. అది ప్రకృతి సహితమైన వ్యవసాయం. అయినా సరే అటవీశాఖ అధికారులు మా పై కేసులు పెట్టేవారు. ఇబ్బందులు పెట్టేవారు. ఇది వై.ఎస్‌గారి దృష్టికి వచ్చింది. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయినంక మాకు భూ హక్కు పట్టాలు ఇవ్వాలని నిశ్చయించారు.

భద్రాచలానికి ప్రత్యేక కార్యక్రమంగా వచ్చి బహిరంగసభ ఏర్పాటు చేసి మాకు పట్టాలు ఇచ్చారు. మొదట మా పేరే పిలవడంతో నేను నా భార్య లక్ష్మితో కలిసి పట్టా అందుకున్నా. ఆ క్షణం ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన దయవల్ల పట్టా ఉన్న 3 ఎకరాల 47 సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. పెద్ద కుమార్తె సుభద్రను కొత్తగూడెం ఉమెన్స్‌ డిగ్రీ కళాశాలలో, రెండో బిడ్డ వెంకటదుర్గను లక్ష్మీనగరం ఆశ్రమ బాలికల పాఠశాలలో చదివించుకుంటున్నాం. ఆ మహానేత దయ వల్లే ఇవాల మేం సంతోషంగా ఉన్నాం. వైఎస్సార్‌ మాతోనే ఉన్నాడని ఆయనిచిచ్చిన భూ పట్టా ధైర్యంతోనే బతుకుతున్నాం.
– గంగరాజు, లక్ష్మి, దుమ్ముగూడెం, ఖమ్మం.

మరిన్ని వార్తలు