బుర్ర తిరిగితే బాడీ బ్లాక్ అవుద్ది!

16 Dec, 2015 23:27 IST|Sakshi
బుర్ర తిరిగితే బాడీ బ్లాక్ అవుద్ది!

మానసిక కారణాలతోనూ శారీరక నొప్పులు: వెన్ను సున్నమవుతోందా? మాటిమాటికీ ఒళ్లు వెనక్కు విరుచుకోవాలనిపిస్తోందా? మెడలో నొప్పి విడువకుండా ఉందా? కొన్నాళ్ల పాటు నొప్పి నివారణ మందులు వాడుతున్నా తగ్గకపోతే అది మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. అంతేకాదు, ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం వంటి సమస్యలూ మానసిక ఒత్తిడికి సంకేతాలే.
 
జీర్ణ సమస్యలు: కడుపులో ఉబ్బరం కనిపిస్తోందా? మాటిమాటికీ తేన్పులా? మానసిక సమస్య గుండెల మీది కుంపటిలా రగులుతుంటే ఛాతీలో మంట రాజుకుంటోందేమో గమనించుకోండి. ఇక మలబద్ధకం, తిన్నవెంటనే బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) లక్షణాలూ శారీరక సమస్యలుగా వెల్లడికావచ్చు. కానీ వాటి మూలాలు మెదడులో ఉండవచ్చు.
 
న్యూరాలజీ లక్షణాలు: సమస్యను అధిగమించలేక కాళ్లు, చేతుల కొనలు మొద్దుబారితే అది ఆలోచనలతో మొద్దుబారిపోయిన మెదడు వల్ల కావచ్చు. ఇక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మెదడు ఏమీ చేయలేక చేతులెత్తేస్తే... చేతుల చివర్లలోనే సూదులు గుచ్చుకుంటున్న ఫీలింగ్ ఉండవచ్చు. సరసరా పాకే నొప్పి జరజరా పాములా  పాకుతున్న మానసిక  ఆందోళనకూ, యాంగ్జైటీకీ గుర్తు.
 

తల తిరగడం: యాంగ్జైటీ తాడు తల లోపలి మెదడును బొంగరంలా తిప్పవచ్చు. దాంతో తలకాయంతా రంగుల రాట్నంలా తిరుగుతున్న ఫీలింగ్ రావచ్చు. మాటిమాటికీ తలనొప్పిగా అనిపించవచ్చు. ఈ లక్షణాలతో పాటు నోరంతా ఎండిపోయినట్లు ఉంవచ్చు. ఎన్ని మందులు వాడుతున్నా తలతిరుగుడుకు విరుగుడు కనిపించకపోతే దీనికి కారణాలు మానసికమైనవేమోనని చూడాలి.

దడదడలాడే గుండెలు: ఛాతీలో నొప్పి, గుండెపోటును భ్రమింపజేసే లక్షణాలు, ఆయాసం వంటి లక్షణాలు కొన్నిసార్లు కనిపిస్తాయి. కానీ తీరా గుండెకు సంబంధించిన ఈసీజీ, టూడీ ఎకో, ట్రెడ్‌మిల్ చివరకు యాంజియో లాంటి పరీక్షలు చేయించినా ఏమీ ఉండదు. అప్పుడు కనిపించని బరువేదో మెదడులో ఉందనీ, అది గుండెల మీద భారంలా అనిపిస్తోందనీ అనుమానించాలి.

మూత్ర సంబంధిత లక్షణాలు: అనుక్షణం మూత్రం వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. బరువు దించుకోడానికి వేగంగా పరుగెత్తుతారు. కానీ బ్లాడర్‌లో ఏమీ ఉండదు. ఇక దీనికి రివర్స్ కేసుల్లో మూత్రవిసర్జన కోసం త్వరగా పరుగెత్తాల్సి రావచ్చు. బ్లాడర్‌పై కంట్రోల్ ఉండకపోవచ్చు. మూత్రధార వెంబడే కొనసాగే మంట వంటి లక్షణాలూ ఉండవచ్చు. ఇలాంటి లక్షణాలన్నీ మానసిక ఒత్తిడికి సంకేతాలే.
 
బాల నెరుపులు :  వయసుపైబడ్డ లక్షణాలు త్వరగా కనిపిస్తాయి.  చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడతాయి. ఈ ప్రీ-మెచ్యుర్ ఏజింగ్ కారణంగా తలపై ఉండే జుట్టు విషయంలో కూడా  ప్రభావం ప్రస్ఫుటంగా కనపడుతుంది. వెంట్రుకలు వయసుకు ముందే నెరుస్తుంటాయి. వెంట్రుకలు త్వరగా రాలిపోతుంటాయి. వెంట్రుకల్లో బలం తగ్గి, విరిగిపోతుంటాయి.

మహిళలకు ప్రత్యేకం ఇది: రుతుస్రావం మరీ ఎక్కువగా రావచ్చు. రుతుశూల మరీ ఎక్కువగా ఉండవచ్చు. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి. ఆ నొప్పి వల్ల ప్రదర్శించే చికాకు. దగ్గరివాళ్లపై విరుచుకుపడాలనిపించే చిరాకు. మాటల్లో వివరించలేని బాధ... ఇవన్నీ మానసిక ఒత్తిడికి మెదడు పంపే సంకేతాలు కావచ్చు. ఇవి మనసులో ఉన్న బాధనూ, వ్యథనూ ప్రతిఫలించే మార్గాలు కావచ్చు.
 
ఎముకల్లో నొప్పి: అస్థి బాధలు విస్తృతంగా ఉండవచ్చు. మోకాళ్లు. మణికట్టు, ముంజేయి... ఇతర కీళ్లలోనూ నొప్పి రావచ్చు. పరీక్షిస్తే అంతా సవ్యంగానే ఉన్నట్లు రిపోర్టు రావచ్చు. కానీ ఎంతకీ నొప్పులు తగ్గకపోవచ్చు. కీళ్లనొప్పులను అదుపు చేయడానికి పెయిన్ కిల్లర్స్ వాడినా బాధానివారణ కలగకపోవచ్చు. ఇలాంటి నొప్పులకూ మానసిక అలజడే కారణం కావచ్చు.

ఊపిరితిత్తులకు సమస్యలు: మానసిక సమస్యలు ఆస్తమాను ప్రేరేపించవచ్చు. ఉబ్బసంతో ఊపిరాడకపోవచ్చు. దమ్ము సరిపోక  విపరీతమైన ఆయాసమూ రావచ్చు.  దీర్ఘకాలికంగా ఎడతెరిపి లేకుండా ‘సైకోజెనిక్ కాఫ్’ అని పేర్కొనే దగ్గు రావచ్చు. ఎన్ని పరీక్షలు చేసినా దగ్గుకు  కారణం కనిపించకపోవచ్చు. ఎన్ని యాంటీబయోటిక్స్ వాడినా అది తగ్గకపోవచ్చు.

చర్మసమస్యలు: శరీరంపై దద్దుర్లు పుట్టవచ్చు. దురదలు పెరగవచ్చు. ఎంత గీరుకున్నా దురద తగ్గకపోవచ్చు. దీన్నే సైకోజెనిక్ ఇచ్ అంటారు. సైకోజెనిక్ డర్మటైటిస్ అనే చర్మ సమస్య రావచ్చు. మేనిపై పగుళ్లూ, మానసిక ఒత్తిడి పెరగగానే సోరియాసిస్ వంటి సమస్యలూ కనిపించవచ్చు. ఒంటిపైన కొరడాతో కొట్టినట్లుగా నొప్పులు లేని కదుములు తేలవచ్చు. మరింత చెలరేగవచ్చు.
 
చెప్పనలవి కాని బాధలు: ఇదీ బాధ అని ఇదమిత్థంగా చెప్పలేని ఇతర సమస్యలూ ఉండవచ్చు. లైంగిక సమస్యల రూపంలోనూ వ్యక్తం కావచ్చు. విముక్తి పొందడంలో అశక్తత కనిపించవచ్చు. ఇతర చిట్కాలూ, సలహాలతోనూ ప్రయోజనం కనిపించకపోవచ్చు. కారణం... సమస్య మేనిలో లేదు. మెదడులో ఉంటుంది. కాబట్టి ఇవేవీ సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు.
 
ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు, ఎంతోకాలం మందులు వాడి చూసినా గుణం కనిపించనప్పుడు చేయాల్సిందల్లా శాంతంగా బతకడం. మనసును ప్రశాంతపరచే మార్గాలను వెతకాలి. మన వంతు ప్రయత్నాలు మనం చేసినా, మనసుపై అదుపు సాధించలేనప్పుడే నిపుణులను సంప్రదించాలి.
 - ఇన్‌పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, హైదరాబాద్
 

మరిన్ని వార్తలు