ముఖంపై నల్లమచ్చలు తగ్గేదెలా?

29 Jun, 2015 23:00 IST|Sakshi
ముఖంపై నల్లమచ్చలు తగ్గేదెలా?

డర్మటాలజీ కౌన్సెలింగ్
నేను ఈ మధ్య ముఖం తెల్లబడటానికి ఒక బ్రాండ్‌కు చెందిన స్కిన్ వెటైనింగ్ క్రీమ్ ఉపయోగిస్తున్నాను. ముఖంలో మార్పు వచ్చింది కానీ... ముఖంపై మొటిమలతో నల్లమచ్చలు వస్తున్నాయి. ఇలా ఈ క్రీమ్ వాడటం మంచిదేనా? తెల్లబడటానికి సైడ్ ఎఫెక్ట్స్‌లేని మంచి క్రీమ్స్ ఏవైనా ఉంటే చెప్పగలరు.
- సందీప్, ఖమ్మం


మీ ముఖం రంగు తెల్లబడటానికి మీరు వాడిన కాంబినేషన్‌లో బహుశా మాడిఫైడ్ క్లిగ్‌మెన్స్ రెజిమెన్ ఉండి ఉండవచ్చు. అందులో కార్టికోస్టెరాయిడ్ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ క్రీమ్‌ను కొన్ని వారాలపాటు వాడినప్పుడు అది మొటిమలు వచ్చేందుకు దోహదం చేసి ఉంటుంది. దీన్ని ‘స్టెరాయిడ్ ఇండ్యూస్‌డ్ ఆక్నే’ అంటారు. దీని వల్లనే ముఖంపై మొటిమలు వచ్చి మచ్చలు పడతాయి. కాబట్టి మీరు ఈ క్రీమ్‌ను వాడటం మానేయండి. దీనికి బదులు మీరు ఆర్బ్యుటిన్, లికోరైస్ లేదా కోజిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడండి. అవి నల్లమచ్చలను తొలగిస్తాయి. ఇక మీ మొటిమలు తగ్గడానికి రాత్రివేళల్లో క్లిండామెసిన్ ఫాస్ఫేట్, అడాపలీన్ కాంబినేషన్ ఉన్న క్రీమ్‌ను రాసుకోండి. దాంతో మీ సమస్య తగ్గుతుంది.
 
నా వయసు 25. నా సమస్య ఏమిటంటే... నా అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు, ఏదైనా రాసుకునే సమయంలో, ఎవరైనా చూస్తుంటే ఈ సమస్య మరీ ఎక్కువైపోయి నా చేతులు, కాళ్లు తడిసిపోతున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా సరిగా కలవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిపడుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- రాజేశ్, గుంటూరు.

 
మీ సమస్యను వైద్యపరిభాషలో పామోప్లాంటార్ హైపర్ హైడ్రోసిస్ అంటారు. ఇది నరాలకు సంబంధించిన సమస్య. యాంగ్జైటీ వల్ల మీకు ఈ సమస్య ఎక్కువవుతోంది. యాంగ్జైటీ పెరిగినప్పుడు చెమట పట్టే ప్రక్రియ పెరుగుతుంది. దీనికి చికిత్స ఇలా...
1. బోట్యులినమ్ టాక్సైడ్ అనే ఇంజెక్షన్ ద్వారా దీన్ని కొద్దిమేరకు శాశ్వతంగా (సెమీ పర్మనెంట్)గా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియను ఇటీవల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అనుసరించాక 4-6 నెలల్లో చెమటలు పట్టడం అదుపులోకి వస్తుంది.
2. దీనికి ఐయన్‌టోఫొరెసిస్ వంటి మరికొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి అంత మంచి ఫలితాలు ఇవ్వవు.
 
డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్

మరిన్ని వార్తలు