నెరిసినా మెరుస్తున్నారు

24 Jun, 2019 08:09 IST|Sakshi

స్టార్‌డమ్‌ అంతా నల్లటి జుట్టు చుట్టూ ముడిపడి ఉంటుంది. జుట్టు నెరిసిందా డమ్‌ అంతా ఢామ్‌ అంటుంది. అయినా సరే స్టార్లుగా కొనసాగే యోగం, భోగం కొద్దిమందికే దక్కుతుంది. వయసును గమనించుకుని అందుకు తగ్గ పాత్రలు చేస్తూ గ్లామర్‌ను నిలబెట్టుకునే హీరోలు ఉన్నారు. క్యారెక్టర్‌లో బలం ఉంటే వయసు మళ్లిన పాత్రైనా చేస్తామంటున్నారు. నెరిసిన జుట్టుతో దమ్ము చూపుతూ బాలీవుడ్‌ కలెక్షన్లను సాధిస్తున్న హీరోల కథనం ఇది.

రెండు రోజుల క్రితం మీడియాలో వచ్చిన అమితాబ్‌ ఫొటో ఒకటి అందరినీ కుతూహల పరిచింది. దాదాపు గుర్తుపట్టలేనంత ముసలితనంతో ముఖంతో ఒక ముస్లిం క్యారెక్టర్‌ పోషిస్తున్న అమితాబ్‌ స్టిల్‌ అది. సినిమా పేరు ‘గులాబో సితాబో’. గతంలో అమితాబ్‌తో ‘పికూ’ వంటి సూపర్‌ హిట్‌ ఇచ్చిన సూర్జిత్‌ సర్కార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ‘అంధా ధున్‌’ వంటి పెద్ద హిట్‌ ఇచ్చిన ఆయుష్మాన్‌ ఖురానా ఇందులో మరో హీరో. ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన ఈ కథలో బహుశా ముస్లిం కుటుంబంలోని ఘర్షణ కథాంశం కావచ్చు. నిజానికి ‘వృద్ధుణ్ణి’ ఒక కమర్షియల్‌ హీరో చేయవచ్చు అనడానికి కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు’ ఒక దారి వేసింది. దానికి ముందు కమల్‌ హాసనే ‘ఖైదీ వేట’ సినిమాలో వృద్ధుడుగా ఉంటూ విలన్‌లను వేటాడే సినిమా చేసి హిట్‌ కొట్టినా ‘భారతీయుడు’ దేశమంతా తెలిసిందని చెప్పవచ్చు. అయితే ఆ ట్రెండ్‌ హిందీలో పూర్తిగా అందుకోవడానికి కొంత కాలం పట్టింది.

ఆశ్చర్యపరుస్తున్న అమితాబ్‌
అమితాబ్‌ దేశ సినీ రంగానికి ఒక కొత్త వొరవడిని ఇవ్వడమే కాదు ఇమేజ్‌ ఉన్న నటుడు బాసటగా నిలిస్తే కొత్త కొత్త కథలు పుడతాయని కూడా నిరూపిస్తున్నాడు. నిజానికి ఒకప్పుడు అమితాబ్‌ తీవ్ర కష్టాల్లో ఉన్నాడు. కొత్త హీరోలు షారూక్, సల్మాన్, ఆమిర్‌ వంటి వారు విజృంభించాక తాను ఎలాంటి పాత్రలు చేయాలో తెలియక, మరొకవైపు సొంత నిర్మాణ సంస్థ ‘ఏ.బి.సి.ఎల్‌’ నష్టాల్లో కూరుకుపోయి పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఆ సమయంలో సంధి పాత్రలు పోషించిన సినిమాలు ‘మృత్యుదాత’, ‘మేజర్‌ సాబ్‌’, ‘లాల్‌ బాద్‌షా’, ‘సూర్యవంశం’ ఘోరంగా బోల్తా కొట్టాయి. వేషాలు రాని ఆ రోజుల్లో యశ్‌చోప్రాను శరణుజొచ్చితే అమితాబ్‌ తన వయసును ‘యాక్సెప్ట్‌’ చేసేలా ఆయన ఇచ్చిన పాత్ర ‘మొహబ్బతే’లో కాలేజీ ప్రిన్సిపాల్‌ పాత్ర. ఆ పాత్రతో అమితాబ్‌ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కరణ్‌ జొహర్‌ ‘కభీ ఖుషీ కభీ గమ్‌’ సినిమాలో కూడా తండ్రి పాత్ర ఇచ్చి ఇమేజ్‌ను నిలబెట్టాడు. దాంతో ప్రేక్షకులు అమితాబ్‌ను పెద్ద తరహా పాత్రల ఇమేజ్‌ను నిలబెట్టే నటుడుగా స్వీకరించారు. లేదా పెద్ద తరహా పాత్రలతో ఇమేజ్‌ నిలబెట్టుకుంటున్న నటుడుగా కూడా చూడటం మొదలుపెట్టారు. అందుకే అమితాబ్, హేమమాలిని తల్లిదండ్రులుగా నటించిన ‘బాగ్‌బన్‌’ హిట్‌ అయ్యింది. సంజయ్‌ లీలా బన్సాలీ అమితాబ్‌ను ఏకంగా ఒక అలై్జమర్స్‌ పేషంట్‌గా మార్చి తీసిన ‘బ్లాక్‌’ బ్రహ్మాండమైన హిట్‌ అయ్యింది. అమితాబ్‌ అనుభవం, ఇమేజ్‌ ఇప్పుడు దర్శకులకు కొత్త దారి చూపించింది.

వృద్ధులలో వయసు మళ్లిన వాళ్లలో కూడా హీరోలుంటారు. వాళ్లవీ విజయ గాథలుంటాయి. కథలుంటాయి. వాటిని తెర మీద చూపించాలి అనుకున్నారు. అలా అమితాబ్‌తో తయారైన కథలు అద్భుతంగా రాణిస్తున్నాయి. ‘సర్కార్‌ రాజ్‌’, ‘పా’, ‘షమితాబ్‌’, ‘పికు’, ‘పింక్‌’, ‘102 నాట్‌ అవుట్‌’ అవన్నీ అమితాబ్‌ ఇలాంటి పాత్రలు చేస్తారని అనుకుని రాసుకున్న కథలు. జనం మెచ్చిన కథలు. అమితాబ్‌ తన కెరీర్‌ పీక్‌లో ఉండగా రెండు మూడు దశాబ్దాల పాటు తన స్టార్‌డమ్‌ చట్రంలో ఇరుక్కుపోయాడు. కొత్తది ట్రై చేయలేకపోయాడు. తనలోని ఆర్టిస్ట్‌ను బయట పడేయలేకపోయాడు. ఇప్పుడు అమితాబ్‌కు ఆ అవకాశం దొరికింది. ఇప్పుడు అమితాబ్‌ ఒక సమున్నతమైన నటుడు.

రిషి కపూర్‌ ప్రయోగం
ఒకప్పుడు ఆడపిల్లల కలల రాకుమారుడిగా ఉన్న రిషి కపూర్‌ వృద్ధపాత్రలు తీసుకోవడమే కాదు తన నటనా సామర్థ్యంతో వాటిని నిలబెడుతున్నాడు. ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’లో తొంభై ఏళ్ల వృద్ధుడిగా రిషి కపూర్‌ నటించి మెప్పించడం సామాన్యం కాదు. వృద్ధుడైన కొడుక్కి ఇంకా వృద్ధుడైన తండ్రి ఉంటే ఎలా ఉంటుందో చూపే ‘102 నాట్‌ అవుట్‌’లో అతి వృద్ధ అమితాబచ్చన్‌కు బట్టనెత్తి ఉన్న వృద్ధ కొడుకుగా రిషి కపూర్‌ నటించాడు. ఈ వయసులో ఒక సినిమాను హిట్‌ చేసే సత్తా ఉందని వృద్ధ ముస్లిం తండ్రిగా నటించిన ‘ముల్క్‌’ సినిమాను హిట్‌ చేసి నిరూపించాడు. ఇక అనిల్‌ కపూర్‌ ‘దిల్‌ ధడక్‌నే దో’, ‘ఫానీ ఖాన్‌’, ‘ఏక్‌ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాలలో వృద్ధ పాత్రలు పోషించి మెప్పించాడు. సైఫ్‌ అలీ ఖాన్‌ ‘బాజార్‌’లో శ్రీమంతుడైన ఒక బిజినెస్‌ టైకూన్‌గా వృద్ధపాత్ర పోషించి సత్తా చాటుకున్నాడు.

ఒకప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టులు
ఒక సినిమాలో హీరో ఎప్పుడూ కుర్రవయసులో ఉంటాడు. వయసు మళ్లిన పాత్రను సినిమా డిమాండ్‌ చేస్తే క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఆ పాత్రలు చేసి సినిమాలు నిలబెట్టేవారు. ‘షోలే’ సినిమాలో సంజీవ్‌ కపూర్‌ వేసిన పాత్ర ఆ సినిమాను నిలబెట్టింది. దిలీప్‌ కుమార్‌ హీరో కాకపోయినా చాలా సినిమాలకు హీరో స్థాయిలో తన క్యారెక్టర్లను పోషించాడు. ‘క్రాంతి’, ‘కర్మ’, ‘శక్తి’, ‘సౌదాగర్‌’ ఇవన్నీ దిలీప్‌ నెరిసిన జుట్టు నిలబెట్టిన సినిమాలు. అనుపమ్‌ ఖేర్‌ ‘సారాంశ్‌’లో పోషించిన వృద్ధుడి పాత్ర ఎవరు మర్చిపోగలరు? ఇటీవలి క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఎంతో కన్విక్షన్‌తో వృద్ధ పాత్రలు పోషిస్తున్నారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ ‘లంచ్‌బాక్స్‌’లో, మనోజ్‌ బాజ్‌పాయ్‌ ‘అలిఘర్‌’లో, నవాజుద్దీన్‌ సిద్దిఖీ ‘బద్‌లాపూర్‌’ వంటి సినిమాలలో తెల్లబడిన జుట్టుతో నటించి పాత్రలను నిలబెట్టారు.

కొత్త కథల కొనసాగింపు
ఈ ట్రెండ్‌ కొనసాగి హీరోయిన్‌లు కూడా వయసు మళ్లిన పాత్రలు చేసే పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు ఐశ్వర్యారాయే  ‘సర్‌బ్‌జిత్‌’లో వృద్ధపాత్ర పోషించింది. ప్రియాంకా చోప్రా ‘సాత్‌ ఖూన్‌ మాఫ్‌’లో వృద్ధస్త్రీ పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా రూపొందుతున్న ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో భూమ్‌ ఫడ్నవిస్, తాప్సీ పన్నులు ఏకంగా డెబ్బై ఎనభై ఏళ్లు ఉన్న స్త్రీలుగా నటిస్తున్నారు.
వయసు మనసుకేగానీ శరీరానికి కాదు. గుండె పటుత్వంతో ఉంటే దమ్ము బలంగా తీసుకునే చేవ ఉంటే ఆ చేవ క్యారెక్టర్‌లో తద్వారా స్క్రీన్‌ మీద మెరుస్టుంది. అపజయానికి తెల్లజుట్టు కేవలం ఒక మిష మాత్రమే అని నిరూపిస్తున్న వీరందరూ కొత్తకథలకు సారథులు... కొత్తమార్గాలకు వారథులు.

ఖాన్‌ల తెల్లమీసం
ఆమిర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చేయడం దేశంలో ఉన్న తండ్రులకు, తాతలకు, జుట్టు తెల్లబడ్డ వారికి తమక్కూడా ఒక కథ ఉంటుంది హీరోయిజం ఉంటుంది అని చెప్పుకునే అవకాశం రావడం. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వయసు మళ్లినవాడిగా నటించినా కూడా కథలోని బలం వల్ల ‘దంగల్‌’ గొప్ప విజయం సాధించింది. హీరోలు అనేవారు అప్పుడప్పుడు నటులుగా మారి పాత్రకు అవసరమైనట్టుగా మారాలని ఆమిర్‌ ఈ సినిమాతో సందేశం ఇచ్చాడు. ఈ ధైర్యంతో ఇటీవల సల్మాన్‌ ఖాన్‌ చేసిన సినిమా ‘భారత్‌’. ఒక డెబ్బై ఏళ్ల ముసలివాడిగా భారత్‌లో సల్మాన్‌ ఖాన్‌ నటించినా జనం ఆ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌ ఇచ్చారు. అయితే దీనికి చాలారోజుల ముందే షారుక్‌ ఖాన్‌ ‘వీర్‌ జారా’లో వయసు మళ్లిన పాత్ర వేసినా జనం పూర్తిగా యాక్సెప్ట్‌ చేయలేదని చెప్పాలి. కాని షారుక్‌ తన వయసు తగ్గట్టుగా కొద్దిగా నెరసిన గెడ్డంతో నటించిన ‘చక్‌ దే ఇండియా’, ‘లవ్‌ యు జిందగీ’ జనానికి నచ్చాయి. అయితే జనాన్ని ప్రిపేర్‌ చేయకుండా సడన్‌గా తెల్లమీసంలో కనబడితే రిజెక్ట్‌ చేస్తారనడానికి అనిల్‌ కపూర్‌ ‘లమ్‌హే’ ఒక ఉదాహరణ.

మరిన్ని వార్తలు