అకస్మాత్తుగా కాలూ– చేయి బలహీనం...కారణమేమిటి?

16 Sep, 2019 01:08 IST|Sakshi

నా వయసు 30 ఏళ్లు. ఒకరోజు నాకు ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టంగా అనిపించింది. అనుమానం వచ్చి డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్‌ ఏర్పడినట్లు తెలిసింది. దాంతో నేను, మా కుటుంబసభ్యులం చాలా ఆందోళనకు గురవుతున్నాం. నాకు ఎందుకిలా జరిగింది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కారం ఏమిటి?

పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ సమస్యకు కారణం దొరకడం మీ అదృష్టం. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల ఈ విధంగా జరుగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరియో వీనస్‌ మాల్‌ఫార్మేషన్‌) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా కష్టంగా తోచిందని మీరు చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్‌ ఏర్పడి ఉండవచ్చు.ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్‌) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్‌) కారణాల వల్ల మెదడులో క్లాట్స్‌ ఏర్పడతాయి.

కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్‌ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్‌ యాక్సిడెంట్‌ అంటాం. మెదడులో క్లాట్‌ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలు నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్‌ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్‌ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్‌ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు.

అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్స్‌ ఏర్పడి ఉంటాయి. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్‌కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్‌ ఉన్నట్లు అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. ఒకవేళ మందులతో క్లాట్‌ కరగకపోతే బ్రెయిన్‌ సర్జరీ ద్వారా క్లాట్‌ను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం ఏర్పరచవచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి.
డాక్టర్‌ జి. వేణుగోపాల్, సీనియర్‌ న్యూరోసర్జన్,
యశోద హాస్పిటల్స్, మలక్‌పేట హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా