నమస్కరించండి

7 Nov, 2018 00:18 IST|Sakshi

చెట్టు నీడ

గౌతమ బుద్ధుడు ఓరోజున బోధివృక్షానికి నమస్కరిస్తూ ఉండటం చూశాడు ఒక శిష్యుడు. అతని దృష్టిలో బుద్ధుడు భగవంతుడితో సమానం. అలాంటి బుద్ధభగవానుడు ఒక చెట్టుకు ఇంతటి గౌరవాన్ని ఇవ్వడం చూసి అతనికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఉండబట్టలేక బుద్ధుణ్ణి సమీపించి, ఆయనకు నమస్కరించి, ‘‘భగవాన్, మీరే భగవత్‌ స్వరూపులు కదా, మీరు ఒక మామూలు చెట్టుకు ఎందుకని నమస్కరిస్తున్నారో తెలుసుకోవచ్చా?’’ అని అడిగాడు. అందుకు బుద్ధుడు చిరునవ్వుతో, ‘‘మనిషిలో అహంకారం చిగురించకుండా చేసే శక్తి ప్రకృతిలో ఉంది.

అందుకే ప్రకృతిలో భాగమైన చెట్టుకు నమస్కరిస్తున్నాను. భవిష్యత్తులో మీరు ఎప్పుడూ అహంకారాన్ని తెచ్చుకోవద్దు. వినయంగా, నమ్రతగా మెలగండి. అందరితోనూ ప్రేమాభిమానాలతోనూ, గౌరవంగానూ నడుచుకోండి. అప్పుడు మిమ్మల్ని అహంకారం ఆవరించదు. మిమ్మల్ని చూసి, అందరూ కూడా అదే బాటలో నడుస్తారు’’ అని బోధించాడు. బుద్ధభగవానుడి నుంచి తనకు ఎంతో విలువైన కానుకలాంటి విషయాన్ని బోధించినందుకు శిష్యుడు ఎంతగానో సంతోషించాడు. శిష్యులకు ఏమైనా మంచి విషయాలను బోధించాలనుకునేవారు ముందుగా తాము ఆచరించాలి. అప్పుడు శిష్యులు తాము కూడా అనుసరిస్తారు.  

మరిన్ని వార్తలు