ఇవి తింటే.. బిడ్డ తెలివి పెరుగుతుంది!

10 Jan, 2018 01:04 IST|Sakshi

గర్భిణులు తమ కోలీన్‌ ఉన్న ఆహారాన్ని తగు మోతాదులో తీసుకోవడం ద్వారా బిడ్డ మెదడు ఎదుగుదల మెరుగ్గా ఉంటుందని అంటున్నారు కార్నెల్‌ యూనివర్విటీ శాస్త్రవేత్తలు. కోలీన్‌ ఏమిటి? దానికి బుర్రకు సంబంధం ఏమిటన్నది ఆలోచిస్తూంటే కొంచెం చదివేయండి. కోడిగుడ్డు సొన మొదలుకొని చేపలు, పాలు, పెరుగు, చిక్కుడు వంటి గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు ఇప్పటికే తెలుసుగానీ.. గర్భిణులకు సంబంధించి ఇవి శిశువు మెదడు సామర్థ్యాన్ని పెంచేందుకూ పనికొస్తాయని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. చివరి మూడు నెలల్లో ప్రస్తుతం వైద్యులు సూచిస్తున్న దానికంటే రెండు రెట్లు ఎక్కువ కోలీన్‌ తినడం వల్ల ఈ ప్రయోజనం కలుగుతుందని మారీ కాడిల్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

ఎలుకల విషయంలో కోలీన్‌ జీవితాంతం ప్రభావం చూపుతుందని ఇప్పటికే రుజువైందని తెలిపారు. కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్‌ వంటి అనేక కారణాలు చూపుతూ చాలామంది కోలీన్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం తగ్గిస్తున్నారని, ఇదేమంత మంచి పరిణామం కాదని అన్నారు. తాము కొంతమంది గర్భిణులకు కోలీన్‌ మినహా మిగిలిన అన్ని రకాల పోషకాలను తగుమోతాదులో అందించి పరిశీలించినప్పుడు వారికి పుట్టిన బిడ్డల మేధోశక్తి పెరిగిందని 4, 7, 10, 13 నెలల్లో బిడ్డలను పరిశీలించి తామీ అంచనాకు వచ్చామని వివరించారు. 

మరిన్ని వార్తలు