34,400ను దాటిన సెన్సెక్స్‌ | Sakshi
Sakshi News home page

34,400ను దాటిన సెన్సెక్స్‌

Published Wed, Jan 10 2018 1:05 AM

Sensex crosses 34,400 - Sakshi

స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్‌లు మంగళవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడే, ముగింపుల్లో  రికార్డ్‌లను తిరగరాశాయి. వరుసగా మూడో రోజు స్టాక్‌ సూచీలు లాభపడ్డాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో స్టాక్‌ మార్కెట్‌ కళకళలాడింది.కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐటీసీ షేర్లు లాభాలు సాధించడం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 90 పాయింట్ల లాభంతో 34,443 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 10,637 పాయింట్ల వద్ద ముగిశాయి.

ముడి చమురు ధరలు బాగా పెరుగుతుండటంతో స్టాక్‌ మార్కెట్లో అప్రమత్త వాతావారణం నెలకొంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34,488 పాయింట్లు, నిఫ్టీ 10,659  పాయింట్ల గరిష్ట స్థాయిలను తాకాయి. ఇవి ఈ రెండూ ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. అయితే ఐటీ, ఆర్థిక రంగ షేర్లు నష్టపోవడం, ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్, టెలికం షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో లాభాలు పరిమితమయ్యాయి.

ఈ ఏడాది నిఫ్టీ రాబడులు ‘నిల్‌’: యూబీఎస్‌
ఈ ఏడాది నిఫ్టీ ఎలాంటి రాబడులు ఇవ్వదని, ఈ ఏడాది డిసెంబర్‌ కల్లా ఈ సూచీ 10,500 పాయింట్లకు పరిమితమవుతుందని స్విట్జర్లాండ్‌ బ్రోకరేజ్‌ సంస్థ, యూబీఎస్‌ అంచనా వేసింది. వచ్చే ఏడాది మాత్రం నిఫ్టీ మంచి వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది.

ఎన్‌ఎమ్‌డీసీ వాటాకు 1.7 రెట్ల ‘సంస్థాగత’ స్పందన
ఎన్‌ఎమ్‌డీసీ వాటా విక్రయానికి సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్‌ఎమ్‌డీసీలో 1.5 శాతం వాటా విక్రయం మంగళవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. స్పందన బాగా ఉంటే 3 శాతం వరకూ వాటాను విక్రయించాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ వాటా విక్రయానికి ఫ్లోర్‌ ధరగా రూ.153.50ను నిర్ణయించారు. వాటా విక్రయంలో భాగంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లకు 3.79 కోట్ల షేర్లను రిజర్వ్‌ చేశారు. ఈ షేర్లకు గాను 1.7 రెట్ల సంఖ్యలో 6.36 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి.  నేడు రిటైల్‌ ఇన్వెస్టర్లకు వాటా విక్రయం జరుగుతుంది.


 స్టాక్‌ మార్కెట్‌ డేటా
                            టర్నోవర్‌ (రూ. కోట్లలో)
బీఎస్‌ఈ                          5,458
ఎన్‌ఎస్‌ఈ (ఈక్విటీ)          37,081
ఎన్‌ఎస్‌ఈ (డెరివేటివ్స్‌)   4,67,899
ఎఫ్‌ఐఐ                          – 304
డీఐఐ                               523

Advertisement

తప్పక చదవండి

Advertisement