నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా...

23 Mar, 2020 11:37 IST|Sakshi

ఎక్కడ ఉన్నా ఏమైనా
మనం ఎవరికి వారం వేరైనా
నీ సుఖమే నే కోరుకున్నా...

గతంలో ఈ పాట వేదనకు గుర్తు. ఇప్పుడు ఆరోగ్యానికి చిహ్నం. ‘కరోనా’ కాలంలో, మనిషికి మనిషి ఎడం పాటించాలని చెబుతున్న కాలంలో, ‘సామాజిక ఎడం’ అవలంబించాలని ప్రచారం చేస్తున్న సమయంలో అది సూచించే తెలుగు సినీ పాటలు సరదాగా తలుచుకోవడం తప్పు కాదు. రోజులు అలా వచ్చి పడ్డాయి. ఎవరైనా సరే దూరంగా ఉండి ఒకరి బాగు ఒకరు కోరుకోవడం ఇప్పుడు తప్పనిసరి. కరోనా మీద అదే అసలైన గురి. ‘విరహమో దాహమో విడలేని మోహమో... వినిపించు నా చెలికి మేఘసందేశం... మేఘసందేశం’ అని శానిటైజర్‌తో శుభ్రపరుచుకున్న చేతుల్లో ముఖాన్ని కప్పుకుని మేఘంతో బాధ చెప్పుకోవాలే తప్ప ప్రేయసి ప్రియులు దగ్గరగా వెళ్లడం, దగ్గరగా కూడటం తప్పు అని ఈ సన్నివేశంలో అర్థం చేసుకోవాలి. ఏ పార్కులోనో కలిసినా ‘వస్తా.. వెళ్లొస్తా... రేపు సందేళకొస్తా’ అని జారుకోవాలి.

అలిగితివా సఖీ..
అలక మానవా..

శుభ్రత పాటించనప్పుడు ప్రేయసీ ప్రేమికుల్లో, భార్యభర్తల్లో ఒకరిని మరొకరు దూరం ఉండమంటే కొందరు వినకపోవచ్చు. హటం చేయవచ్చు. వారి కోసం దొంగ కోపం చూపించాలి. కిలాడీ అలక ప్రదర్శించాలి. వారు అలకకు జడిసి దూరం నిలబడి పాట పాడుతుంటే వినాలి.  ‘నేలతో నీడ అన్నది నను తాక రాదని పగటితో రేయి అన్నది నను తాక రాదని’ అని భర్తలు పాడుకోవచ్చు గాక. కాని వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అదొక చక్కటి నివారణోపాయం అనుకోవాలి. నీట్‌నెస్‌ ఫస్ట్‌ అని వారికి చెప్పగలగాలి. భర్తలు కూడా ఈ సమయంలో తగ్గకూడదు. ఇంటి శుభ్రతకు, ఒంటి శుభ్రతకు బద్దకించే భార్యలపై కావాలనే చిరాకు చూపించి కంగు తినిపించాలి. ‘నేడు శ్రీవారికి నేనంటే పరాకా... తగని భలే చిరాకా’ అని వారు బిత్తర పోతుంటే ఇదంతా నీ మంచికే అని మనసులో కన్నీళ్లు తుడుచుకోవాలి.

ఎవ్వరి కోసం ఎవరుంటారు
పొండిరా పోండి
నా కాలం ఖర్మం కలిసొస్తేనే
రండిరా రండి..

పిల్లల మీద తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ. కాని ఇటువంటి కాలంలో వారిని దూరంగా పెట్టే ప్రేమ చూపాలి. సురక్షితం కాని ప్రదేశాలలో వారు తిరిగి ఉంటే ‘సెల్ఫ్‌ క్వారంటైన్‌’ అయిపోమ్మని చెప్పాలి. మనం తిరిగి ఉంటే గదిలోకి వెళ్లి తలుపేసుకోవాలి. ఆ కరోనా బురోనా బై చెప్పాక కలవక తప్పదని ఒకరికి మరొకరు చెప్పుకోవాలి.

టాటా... వీడుకోలు.. గుడ్‌ బై...
ఇంక సెలవు
తొలినాటి స్నేహితులారా...
చెలరేగే కోరికలారా..

ఫ్రెండ్స్‌ ఎప్పుడూ ఉంటారు. ఫ్రెండ్స్‌ ఎప్పుడూ ఉండాలి. కాని ఇప్పుడు మాత్రం ఫ్రెండ్స్‌ దూరంగా ఉండాలి. ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేయడం, షేక్‌ హ్యాండ్స్‌ ఇవ్వడం, ఒకరి సిగరెట్లు మరొకరు పంచుకోవడం, ఒకరి బైక్‌ హ్యాండిల్‌ను మరొకరు పట్టుకోవడం ఇప్పుడు అవసరం లేదు. అందుకే వాళ్లను నేరుగా కలవడానికి తాత్కాలికంగా వీడ్కోలు చెప్పాలి.

‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా... అందరూ సుఖపడాలి నందనందానా’ అని రాబోయే మంచి కోసం ఎదురు చూడాలి.
ఇక పిల్లలు గడుగ్గాయిలు. వారు ఇంటి పట్టున ఉండమంటే వినరు. ఆడటానికి వెళతారు. పాడుకోవడానికి వెళతారు. గంతులు వేస్తారు. ఈ వేసవి కాలం వారికి ఆటవిడుపు. కాని ఇది మాయదారి కరోనా కాలం అయిపోయింది. అందుకే వారికి బుద్ధి చెప్పాలి. బాగు చెప్పాలి. నలుగురినీ కలవడం తప్పు అని చెప్పాలి.

విను నా మాట విన్నావంటే
జీవితమంతా పువ్వుల బాటా...
అని చెప్తే వారు వినకుండా పోరు.

అయితే ఇది సంఘం మొత్తం చైతన్యవంతం కావాల్సిన సమయం. అందరూ కలిసి ఆపత్కాలాన్ని దాటాల్సిన సమయం. వారికి పిలుపునివ్వాలి. ‘తెలుగు వీర లేవరా.. దీక్ష బూని సాగరా’ అని కరోనా వంటి విష క్రిమి వ్యాప్తి చెందకుండా ఎంతటి దీక్ష వహించాలో చెప్పాలి. ‘ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన కరోనావాడు’ అని గర్జించేలా చేయాలి. అలాగే ఇది మనందరికి కష్టకాలం. పరీక్షా కాలం. దానిని దాటాలంటే ఇప్పుడు గొప్ప క్రమశిక్షణ కావాలి. బాధ్యత ఉండాలి. దాంతోపాటు నిరాశలో కూరుకుపోకుండా ఆశ కూడా ఉండాలి. ఆ ఆశను నింపే పాట పాడుకుంటూ ఉండాలి.– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు