సమాధిపై న్యాయం మొలిచింది

10 Aug, 2018 00:04 IST|Sakshi

2005లో కుమారుడి మరణం కారణంగా పద్మావతమ్మ కళ్లలో పెల్లుబికిన నీరు.. 2018 జూలైలో కుండపోత వర్షంతో ముగిసింది.  సమాధిపై పూచిన పువ్వు ఈ అమ్మ. చీర మీద నేసిన పువ్వు ఆ కొడుకు.చెరగని జ్ఞాపకానికి పూదండ.. ఈ కథనం.కన్నీటితో బాధను కడిగేయడం కాదు..ఆ కన్నీరే దుఃఖజ్వాలకు ఆజ్యం  కావాలన్నది నీతి. అవును.న్యాయం సమాధి కాకూడదు.  సమాధి పైన కూడా న్యాయం మొలవాలి.

ఓనం పండగ. అమ్మకు చీర కొని తెచ్చేందుకు వెళ్లిన కొడుకు ఎంతకూ రాలేదు. తల్లి తల్లడిల్లింది. రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. కొడుకు ఏమయ్యాడోనన్న ఆందోళన ఓ పక్కన తొలుస్తోంది. గుండె దిటవు చేసుకుని ఉద్యోగానికి వెళ్లింది. స్కూల్‌లో పని. కొద్ది సేపటికి ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. ‘‘ఆసుపత్రిలో ఒక శవం ఉంది, అది మీ వాళ్లదేనేమో వచ్చి చూసుకోండి’’ అని చెప్పాడు. తల్లి గుండె గుభేలుమంది. అది తన కొడుకుది  కాకూడదని వేయి దేవుళ్లకు మొక్కుకుంది. ఆస్పత్రికి వెళ్లింది. ఆమె మొక్కులనూ, మొరలనూ భగవంతుడు ఆలకించలేదు. ఆ శవం ఆమె కొడుకుదే!

పదమూడేళ్ల పోరాటం
గుండెలవిసేలా రోదించింది తల్లి. ఆ వచ్చిన వ్యక్తి వచ్చి ఆమె కొడుకు  మరణానికి కారణాలు చెప్పాడు. అప్పుడే నిర్ణయించుకుందామె దోషులకు శిక్ష పడేవరకూ విశ్రమించకూడదని. అప్పటికి ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇప్పుడు 67. ఈ 13 ఏళ్ల  వ్యవధిలో తన కుమారుడి మృతికి కారకులైన వారిని ఉరి కంబం ఎక్కించేలా తీర్పు వచ్చేవరకూ ఆ తల్లి విశ్రమించలేదు. ఓ పక్క వయసు కరిగిపోతోంది. నిస్సత్తువ ఆవహిస్తోంది. సాక్షులు ఎదురుతిరుగుతున్నారు. పోలీసులే ఆమెను చంపడానికి మూడుసార్లు ప్రయత్నించారు. బెదిరించారు. కోర్టు మెట్లపైనే ఆమెను కొట్టారు. నడిచి వెళుతుండగా మూడుసార్లు కార్లతో ఢీకొట్టి   చంపబోయారు. అయినా వెరవలేదు. అనన్య సామాన్యమైన ఆమె పోరాటఫలితం ఊరికే పోలేదు. కుమారుడి మృతికి కారకులైన ఇద్దరు పోలీసులకు ఉరి శిక్ష, మరో ముగ్గురికి జైలు శిక్ష పడింది. ఆమె పేరు పద్మావతమ్మ. కేరళలోని తిరువనంతపురం ఆమె స్వస్థలం. ఒక్కగానొక్క కొడుకు ఉదయ్‌కుమార్‌ పనికి రాని వస్తువుల అమ్మకాలూ, కొనుగోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. 

అది 2005 సంవత్సరం
ఓనం పండక్కి యజమాని ఇచ్చిన బోనస్‌ డబ్బులు తీసుకుని అమ్మకు చీర, తనకు కొత్త బట్టలు తెచ్చుకునేందుకు బయటికి వెళ్లాడు ఉదయ్‌కుమార్‌. యజమాని ఇచ్చిన 4020 రూపాయల పండగ బోనస్‌ తీసుకుని జేబులో పెట్టుకుని బయలుదేరాడు. అదే రోజున కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పట్టణమంతా హడావిడిగా ఉంది. ఆ సంబరాలు సద్దుమణిగాక, బట్టలు కొని ఇంటికి వెళదామని రోడ్డుపై నిలబడి చూస్తున్నాడు ఉదయ్‌కుమార్‌. ఈలోగా అతడి పక్కన ఓ అపరిచిత యువకుడు వచ్చి నిలబడ్డాడు. ఆ యువకుడికి చోరీలు చేసిన చరిత్ర ఉంది. అతడిని గమనించిన పోలీసులు అతడితో పాటు పక్కనే ఉన్న ఉదయకుమార్‌ను కూడా పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఏదో చోరీకి సంబంధించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఉదయ్‌ కుమార్‌ జేబులో ఉన్న డబ్బును గమనించారు. అది తన యజమాని ఇచ్చిందని ఎంత చెప్పినా వినకుండా, డబ్బు తీసుకున్నారు. స్టేషను నుంచి వెళ్లి పొమ్మన్నారు. తల్లికి బట్టలు కొనకుండా ఆ డబ్బును వదిలి వెళ్లడానికి ఉదయ్‌కుమార్‌కు మనస్కరించలేదు. తన డబ్బు తనకిమ్మని పట్టుబట్టాడు. 

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు!
డబ్బు కోసం ఎవరైనా వస్తే సరైన ఆధారాలు తెలుసుకుని ఇవ్వాలనే ఉద్దేశం పోలీసులది. సాధారణంగా ఆ పోలీస్‌ స్టేషన్‌కి ఇలాంటి కేసులే వస్తుంటాయి. అయితే ఉదయ్‌కుమార్‌ మంకుపట్టుతో పోలీసుల కర్కశ ప్రవృత్తి బయటపడింది. అతడిని తీవ్రంగా కొట్టారు. బ్రిటిషు కాలంనాటి హింసాత్మక పద్ధతులను అతనిపై ప్రయోగించారు. బల్లపై బోర్లా పడుకోబెట్టి, కాళ్లు చేతులు చెరో వైపు లాగి కట్టారు. ఒక కానిస్టేబుల్‌ అతడిపై ఎక్కి కూర్చున్నాడు. కాళ్ల మీద పెద్ద ఇనుపరాడ్లను ఆపకుండా దొర్లించారు. ఈ చర్యతో అతడి కాళ్లు విరిగిపోయాయి.  ‘దాహం దాహం’ అని మంచినీటి కోసం అర్థిస్తే, ఖాళీ సీసా ఇచ్చి, వికృతానందం పొందారు. రాత్రంతా కొడుతూనే ఉన్నారు. ఫలితంగా ఉదయ్‌కుమార్‌ ప్రాణాలు ఆ కటకటాల వెనుక గాలిలో కలిసిపోయాయి. అప్పుడు మొదలైంది పద్మావతమ్మ న్యాయ పోరాటం. ఆమెకు ఆమె బంధువు మోహనన్, సీపీఐ నాయకుడు పి.కె.రాజు, ముస్లిం అడ్వొకేట్‌ సిరాజ్‌ ఆ తల్లికి అండగా నిలిచారు. దురదృష్టమేమిటంటే, పద్మావతమ్మకు అన్నివిధాల సహకరిస్తున్న రాజును కూడా పోలీసులు విడిచిపెట్టలేదు. రాజకీయ ర్యాలీలు, ఇతర ఆందోళనల సమయాలలో రాజును లక్ష్యంగా చేసుకుని చితకబాదారు. సివిల్‌ డ్రెస్‌లో వచ్చి మరీ అతనిని కొట్టేవారు. 

ఊహించని మలుపు
పద్మావతమ్మ చేస్తున్న న్యాయపోరాటం 2007 లో చిత్రమైన మలుపు తీసుకుంది. ఆ మలుపే కేసుకు కీలకం అయింది. ఆమె విజయానికి బాటలు పరిచింది. పత్రికలలో ఆమె రాసిన లేఖలు ఒక ముస్లిం మత ప్రబోధకుడి కుమారుడైన సిరాజ్‌ కరోలీ దృష్టిని ఆకర్షించాయి. సిరాజ్‌ కేరళ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. ఈ కేసును సీబీఐతో విచారింపచేయాలని 2007 సెప్టెంబరులో అతడు కోర్టులో పిటిషన్‌ వేశాడు. సాధారణంగా కేసు విచారణ దశలో ఉండగా, ఏ కేసు పైనా ఏ కోర్టయినా అసాధారణ నిర్ణయాలు తీసుకోదు. అయితే 2002 లో బెస్ట్‌ బేకరీ కేసుకి సంబంధించిన సాక్షులను ప్రాసిక్యూషన్‌ తమ వైపుకి తిప్పుకున్న సందర్భాన్ని ఈ పిటిషన్‌లో సిరాజ్‌ ఉదహరించారు. ఆ కేసు రిఫరెన్స్‌ ఆధారంగా కోర్టు కేసును íసీబీఐకి అప్పగించింది. 

తల్లి తెచ్చుకున్న తీర్పిది!
పద్మావతమ్మ నుంచి సిరాజ్‌ ఎటువంటి ఫీజూ ఆశించలేదు. కాని ఆమె తాను కూడబెట్టుకున్న మూడు వేల రూపాయలను అతడికి ఇచ్చింది. సిరాజ్‌ రెండు వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. కుమారుడి మరణం కారణంగా పద్మావతమ్మ కళ్లలో పెల్లుబికిన నీరు, 2018 జూలైలో కుండపోత వర్షంతో ముగిసింది. ఒక అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. జితా కుమార్, పోలీసు ఆఫీసరు ఎస్‌. వి. శ్రీకుమార్‌లకు సీబీఐ కోర్టు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మరో ముగ్గురికి జైలు శిక్షపడింది. ఈ కేసులో మొత్తం 34 మందిని సాక్షులుగా చేర్చగా, 33 మందిని ప్రాసిక్యూషన్‌ తన వైపుకి తిప్పుకుంది. ఆమె వైపు నిలబడిన ఆ ఒక్క మహిళ కావడం. ఆమె  టైపిస్టుగా పనిచేస్తోంది. అమ్మ మనసు తెలుసుకుని, పద్మావతమ్మకు కడ దాకా అండగా నిలబడింది. 

తీరిన కొడుకు రుణం
న్యాయ పోరాటంలో గెలిచిన పద్మావతమ్మ ఇప్పుడు మనశ్శాంతిగా కొత్త జీవితాన్ని గడుపుతోంది. పక్కింట్లో ఉంటున్న ఒక పిల్లవాడు ఆమెకు చేరువయ్యాడు. ‘నన్ను అమ్మా అని పిలుస్తాడు’ అంటూ చెమర్చిన కళ్లతో చెబుతారు పద్మావతమ్మ. 

మెడకు చుట్టుకున్న పాపం
ఉదయ్‌కుమార్‌ని కొట్టి చంపినవారు బాగానే ఉన్నారు. కాని అలా అతడిని కొట్టడానికి కారణమైన ఇద్దరు పోలీసు ఆఫీసర్లకు ఉరి శిక్షపడింది. వారి కుటుంబాలు ఇప్పుడు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇళ్లు అమ్ముకున్నారు. తమ వారిని రక్షించుకోవడానికి ఒక పెద్ద లాయర్‌ని పెట్టుకుని ఈ డబ్బు ఖర్చు చేశారు. అద్దె ఇంట్లోకి మారవలసి వచ్చింది. ఓ పోలీసు అధికారి భార్య కుటుంబాన్ని పోషించుకోవడం కోసం టైలరింగ్‌ పని చేస్తోంది.
– రోహిణి
 

మరిన్ని వార్తలు