పచ్చడి పచ్చడే!

27 Jul, 2016 00:12 IST|Sakshi
పచ్చడి పచ్చడే!

తిండి  గోల

 
విస్తట్లో పప్పు, కూర, ధప్పళం, గారెలు, బూరెలు, లడ్లు, అరిసెలు, వడియాలు, అప్పడాలు, ఊరగాయలు, పులిహోర, పాయసాలు... ఇలా ఎన్ని ఉన్నా, పచ్చడి ఇంకా పడలేదే అని ఎదురు చూసేవారెవరయినా ఉన్నారా అంటే అది తెలుగువారే! పచ్చళ్ల కోసం ఇంతగా నాలుక పీక్కుంటారు కాబట్టే గోంగూరకు శాకంబరీ మాత అని పేరు పెట్టుకుని మురిసిపోయారు మన తెలుగువాళ్లు. ఇప్పుడంటే మిక్సీలొచ్చి పని సులువు చేశాయిగానీ, అవి రాక మునుపు నానా తంటాలూ పడేవాళ్లు లేడీసు. ఊర్బిండి అంటే మినప లేదా పెసరపప్పును నానబెట్టి రుబ్బిన పచ్చడో, ఊర్పచ్చడి అంటే ఏ కందిపచ్చడో, శనగపచ్చడో, బజ్జీపచ్చడి అంటే దోసకాయనో, వంకాయనో నిప్పులమీద కాల్చి, నూరి తాలింపు పెట్టిన పచ్చడో, తొక్కు అంటే గోంగూర లేదా చింతకాయను రోట్లో నూరిన పచ్చడో లేనిదే ముద్ద దిగేది కాదు.


పచ్చడి మెతుకులంటే పేదవారి కూడు అనేది దురభిప్రాయం మాత్రమే.. అప్పుడూ ఇప్పుడూ కూడా! ఎందుకంటే ఇప్పుడు మిర్చి రేటు ఘాటు భరించడమే కష్టం. దొండ, బెండ, బీర, దోస... వాడ్చి, అందులో ఇంత చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు పడేసి, కచ్చాపచ్చాగా నూరి, ఇష్టం ఉంటే ఇంగువ, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్టు పడేసి, తిరగమోత పెట్టేస్తే ఘుమ ఘుమలాడే రోటిపచ్చడి రెడీ! ఏమీ లేదంటారా, నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కాస్తంత ఉప్పు, చింతపండు కలిపి నూరి, ఓపికుంటే తిరగమోత పెట్టుకోవడం లేదంటే అట్లాగే తినేసినా సరే. ఒకప్పుడు మిరపకాయలకు బదులు మిరియాలపొడి, చింతపండుకు బదులు నిమ్మరసం, ఉప్పు స్థానంలో సైంధవ లవణం వేసి, ఆరోగ్యంగా తినేవారు. ఇప్పుడు కూడా పచ్చడి మీద జిహ్వచాపల్యం చంపుకోలేని వారు ఇలా కూడా ఓసారి ట్రై చేసి చూస్తే సరి!

 

మరిన్ని వార్తలు