స్మార్ట్‌ఫోన్లతో  బోలెడు చిక్కులు...

13 Dec, 2018 01:01 IST|Sakshi

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి నిజమేగానీ.. చిక్కులు కూడా అంతేస్థాయిలో ఉంటాయి అంటున్నారు కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇటీవల జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. మన స్మార్ట్‌ఫోన్లలో ప్రతి పది ఆప్‌లలో కనీసం ఏడు మన వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాయి. అంతేకాదు. మనం ఏ సమయంలో ఎక్కడున్నాం? ఏఏ అప్లికేషన్లు వాడాము? వంటి వివరాలను కూడా ఆప్‌లు గమనిస్తూ ఉంటాయని నారెసో వల్లీనా రోడ్రిగ్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. తాము పరిశీలించిన ఆప్‌లలో 15 శాతం వినియోగదారుడి వివరాలను ట్రాకింగ్‌ వెబ్‌సైట్లకు చేరవేసినట్లు తెలిసిందని చెప్పారు.

ఇలాంటి ట్రాకర్లు నాలుగింటిలో ఒకటి ప్రతి స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన అంకెతో గుర్తించేలా కూడా ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. ఈ చిక్కులకు స్మార్ట్‌ఫోన్‌ ఆప్‌లను ఆఫ్‌ చేయడం కూడా పరిష్కారం కాదని... ట్రాకింగ్‌ చేయవద్దన్న ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి రహస్యంగా పాస్‌వర్డ్‌లు సంగ్రహించడం మొదలుకుని ఎప్పటికప్పుడు మనమున్న లొకేషన్‌ వివరాలను ఇతరులకు తెలపడం చేస్తాయని ఇంకో శాస్త్రవేత్త గువెరా నౌబీర్‌ అంటున్నారు. ఫేస్‌బుక్‌లోని సమాచారాన్ని, స్మార్ట్‌ఫోన్‌ వినియోగం తీరుతెన్నులను కలగలిపి వినియోగదారుల ప్రొఫైల్‌లు సిద్ధం చేస్తున్నారని.. ఇలాంటి ప్రైవసీ ఉల్లంఘనలను అడ్డుకునేందుకు తగిన చట్టాలు కూడా లేవని వీరు వివరిస్తున్నారు.  

మరిన్ని వార్తలు