మనిషి దేవుని చేతిపని...

29 Apr, 2018 00:53 IST|Sakshi

ప్రశ్నించడం సైన్స్‌కు పునాది, ప్రశ్నించకుండా విశ్వసించడం మత విశ్వాసానికి పునాది. దేవుడు కంటికి ఎందుకు కనపడడంటూ సైన్స్‌ మతాన్ని. మిలియన్ల ఏళ్ళ క్రితమా, అదెలా? అని మతం సైన్స్‌ను వేళాకోళం చేయవచ్చు. ఏది ఏమైనా కొన్ని కాదనలేని సత్యాలున్నాయి. దేవుడు మనిషిని సృష్టించాడని, అదికూడా తన రూపంలోనే సృష్టించాడని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దాదాపు 44 మంది భక్తాగ్రేసరులు ఒకే విశ్వాస సూత్రం అంతర్లీనమైన మూలాంశంగా వివిధ కాలాల్లో రాసినట్టుగా బైబిల్‌ చెబుతోంది.

ఈ రెండు వచనాల్లో దేవుడు మనల్ని సృష్టించాడని 3 సార్లు, దేవుడు తన రూపంలోసృష్టించాడని 4 సార్లు పేర్కొన్నారు. ఇక్కడ విషయమేమిటంటే మనిషి దేవుని చేతి పని, విశేషమేమిటంటే మనిషిది దైవ స్వరూపం. అవధుల్లేని సృజనాత్మకత, అనంతమైన ప్రేమకలిగిన దేవుని సంకల్పానుసారం మనిషి సృష్టించబడ్డాడన్న సత్యం, సృష్టిలో మనిషి అపురూపత్వాన్ని, విలక్షణత్వాన్ని చాటుతుంది. మనిషి దేవుని సృష్టి అని నమ్మడమంటే, అంతిమంగా దేవుని విశ్వసించడమే.

దేవుడే నన్ను సృష్టించాడని నమ్మిన మరుక్షణం నుండి మనిషి జీవితం సమూలంగా పరివర్తన చెందుతుంది. ఆ వెంటనే ప్రతి చర్చి కూడా మార్పు చెందుతుంది. దేవుడు మనిషిని తన స్వరూపంలో సృష్టించాడంటే తన కుమారుడు లేదా కుమార్తెగా సృష్టించాడని అర్థం. అంటే మనిషి దేవుని స్వరూపధారి. అంతే కాదు, మనిషి దేవుని లాగే హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. ఆ ఆలోచనాపటిమే, ఈనాడు ప్రపంచంలో అత్యద్భుతమైన అంశాలన్నింటినీ కనుగొని అతడు ఆవిష్కరించడానికి కారణమయింది. ప్రాచీనకాలంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు తమ ప్రజలకు చక్రవర్తులెవరో తెలియడం కోసం తన రాజ్యం నిండా తమ మూర్తులను ప్రతిష్టించేవారు.

దేవుని సువిశాల సామ్రాజ్యమైన ఈ విశ్వంలో ఆయన తన స్వరూపమున్న మూర్తులుగా మానవాళిని నిర్మించాడు. మనం విశ్వానికి దేవుని రాయబారులం. ఆ విశ్వాన్ని సృష్టించి పాలించే దేవుడున్నాడని చాటే ఆయన సామంత రాజులం మనం. దేవుని పక్షంగా ఈ లోకాన్ని, సర్వ సృష్టినీ పాలించే పాలకులం కూడా. ఇదీ మన విలువ, స్థాయి, దేవుడు మనకిచ్చిన అపురూపమైన ఆధిక్యత, గుర్తింపు మనకు. ఆయన మనిషిని తనతో సహవసించడానికి సృష్టించాడు. అందుకే దేవుని కనుగొనేదాకా మనిషిలో ఒకలాంటి అసంతృప్త భావన ఉంటుంది. దేవుని కనుగొని ఆయనతో  సహవసించడమే అతని జీవితానికి సంపూర్ణత్వాన్నిస్తుంది.

దేవుడు తన స్వరూపంలో సృష్టించిన కారణంగానే విశ్వంలో మనిషికి అంతటి విలువ, గౌరవమర్యాదలున్నాయి. అందుకే ఎన్నో కాంతి సంవత్సరాల వేగంలో ప్రయాణించి గ్రహాలన్నింటినీ పరిశోధించినా, గాలించినా మనిషి లాంటి అద్భుతమైన సృష్టి విశ్వమంతటిలో మరెక్కడా కనిపించదు.  ఆయన స్వరూపధారులమన్న గ్రహింపుతోనే మన విశిష్ట వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. దేవుని స్వరూపాన్ని ధరించుకోవడంలో కొన్ని బాధ్యతలు కూడా మనవయ్యాయి. సాటి మనిషిని గౌరవించి, ప్రేమించి విశ్వానికి అతన్ని కూడా  సాటిహక్కుదారును చేసే ప్రేమపూర్వక బాధ్యతను దేవుడిచ్చాడు మనకు.

దేవుని స్వరూపంతో పాటు, దేవుని సృజనాత్మకత, శక్తి, ప్రేమకూడా మనలో నిక్షిప్తమైంది. అసలైన ఈ మానవ వైశిష్ట్యాన్ని ఆది మానవుడు దేవుని పై చేసిన తిరుగుబాటు చెరిపివేసింది. కాని తన అద్వితీయకుమారుడైన యేసులో మళ్ళీ అదంతా మానవాళికి ఇయ్యబడింది. యేసు జీవితం, స్వరూపం,ç Ü్వభావం, ప్రేమా, కరుణ, క్షమ  అంతా మానవత్వంలో అమరిన, ఇమిడిన దైవత్వమే!  అందుకే విశ్వాసులు ఆ క్రీస్తు సారూప్యతలోకి మారడమే జీవన సాఫల్యమని అపొస్తలుడైన పౌలు అన్నాడు (రోమా 8:29).

– రెవ.డా.టి.ఏ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు