అట్టహాసం లేని అద్భుతపరిచర్య

20 May, 2018 01:38 IST|Sakshi

భయంకరమైన, దైవవ్యతిరేకమైన మన గతం ఒక గుదిబండలాగా మెడలో వేలాడుతూ ఉంటే జీవితంలో, పరిచర్యలో జయకరంగా ముందుకు సాగిపోవడం సాధ్యమేనా? లోకమైతే ఇది అసాధ్యమనే తేల్చేస్తుంది. కానీ దేవుడైతే నీ పాపగతాన్నంతా తుడిచివేయడమే కాదు, ఇంకెప్పుడూ జ్ఞాపకం చేసుకోనని కూడా వాగ్దానం చేశాడు (యెషయా 43:25). ఈ వాగ్దానం అపొస్తలుడైన పౌలుకు అర్థమైనంతగా మరెవరికీ అర్థం కాదేమో. యేసును, ఆయన ప్రేమను విపరీతంగా వ్యతిరేకించి, తూర్పారబట్టి, క్రైస్తవోద్యమాన్ని అడ్డుకోవడంలో అగ్రగణ్యుడిగా నిలబడిన భయంకరమైన గతం అతనిది.

కొన్నాళ్ళకు యేసుప్రభువు ప్రేమను రుచి చూసిన తర్వాత క్రైస్తవోద్యమాన్ని ప్రపంచమంతా విస్తరించడంలో కూడా పౌలు అగ్రగణ్యుడే అయ్యాడు. అతని గతం ప్రపంచానికంతా తెలిసిన బహిరంగ సత్యం. అందుకే అప్పుడప్పుడే అంకురిస్తున్న క్రైస్తవం పౌలును నమ్మలేదు, ఆయన్ని చర్చి లోనికి అంగీకరించలేదు. దమస్కు శివార్లలో పౌలుకు యేసు సాక్షాత్కారం జరిగిన తర్వాత, అతనికోసం ప్రార్థించి, క్రైస్తవంలో అతనికి ఆరంభ పాఠాలు చెప్పమని ప్రభువు ఆదేశిస్తే, దమస్కులోనే ఉన్న అననీయా అనే భక్తుడు ‘అమ్మో ప్రభువా, అతనా?’ అన్నాడు. పౌలు ఆ తర్వాత యెరూషలేముకు తిరిగొచ్చి అక్కడి చర్చిని, యేసుప్రభువు శిష్యుల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తే అతనికి భయపడి అంతా దూరంగా పారిపోయారు.

అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో పౌలుకు సహాయంగా నిలబడిన ఒకే ఒక వ్యక్తి బర్నబా!! బర్నబా కూడా కొద్ది కాలం క్రితమే యేసుప్రభువు ప్రేమ సామ్రాజ్యంలో పౌరుడుగా చేరిన కొత్త విశ్వాసి. కాని తన విశ్వాసంతో, సాక్ష్య జీవితంతో అప్పటికే విశ్వాసులందరి మధ్య తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. పౌలును నాటి క్రైస్తవమంతా వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో, బర్నబా ఒక్కడే అతన్ని, అతని దర్శనాన్ని అర్ధం చేసుకొని అతన్ని తోడుకొని వచ్చి యెరూషలేములో అందరికీ పరిచయం చేశాడు. అలా పరిచర్యలో పౌలు తొలి అడుగులు వేయడానికి బర్నబా అండగా నిలబడ్డాడు (అపో.కా.9:27).

పౌలు గతాన్ని బట్టి అంతా అతన్ని దూరంగా పెడితే, బర్నబా ఒక్కడే అతన్ని ఆత్మీయంగా హత్తుకొని అతనికి బాసటగా నిలబడ్డాడు. ఆ పాలుగారే ఆ తర్వాత మహా దైవజనుడయ్యాడు, కొత్త నిబంధన బైబిల్లో అత్యధిక భాగం ఆయనే రాశాడు, ప్రపంచమంతా క్రైస్తవం వేళ్ళూనడానికి అతనే ప్రధాన కారకుడయ్యాడు. కాని పౌలు చేసిన ఈ అద్భుతమైన పరిచర్య వెనుక కనిపించని ప్రోత్సాహహస్తం బర్నబాదే. అసలు పరిచర్యలో బర్నబా పద్ధతే వేరు.

ఎవరూ అడగకుండానే తన ఆస్తినంతా అమ్మి ఆ డబ్బునంతా తెచ్చి ఆదిమ చర్చిలో అతను అపొస్తలుల పాదాలవద్ద పెట్టాడు. చర్చి నాకేమి చేస్తుంది అని కాక చర్చికి నేనేమి చెయ్యగలను అని ఆలోచించే వారిలో ప్రథముడు బర్నబా. ఎవరూ చెప్పనవసరం లేకుండానే తన వంతు తాను చేయడంలో అతను దిట్ట. అలా ఎంతోమందికి ప్రోత్సాహకరంగా ఉన్నాడు గనుకనే అతనికి ‘ప్రోత్సాహపుత్రుడు’ అనే బిరుదునిచ్చింది ఆదిమచర్చి (అపో.కా.4:36). బర్నబా  కారణంగా ఎంతోమంది కొత్త విశ్వాసులు ఆనాటి  చర్చిల్లో చేరారు (11:24). ఆనాటి అపొస్తలులందరికీ అతను బాసటగా నిలబడ్డాడు. కాని అతనికి ప్రచార యావ లేదు, పొగడ్తల యావ అసలే లేదు.

తొలిరోజుల్లో క్రైస్తవం బలపడేందుకు తన ఆస్తిని, శక్తియుక్తులన్నింటినీ సర్వం ధారపోసిన అద్భుతమైన పరిచారకుడు, పౌలువంటి మహాసేవకునితోనే, చెయ్యిపట్టుకొని తొలి అడుగులు వేయించిన గొప్ప విశ్వాసి బర్నబా!! నిబద్ధత, నిస్వార్థత లేకున్నా అట్టహాసం, హడావుడి చెయ్యడం మాత్రమే తెలిసిన నేటి తరం టివి పరిచారకులు లక్షమంది కలిసి చెయ్యలేని పరిచర్యను, బర్నబా ఒక్కడే ఏ అట్టహాసం లేకుండా దేవునికి తలవంచి చేశాడు. అందుకే దేవుడిచ్చే నిత్యజీవకిరీటం  ఎప్పటికీ బర్నబా వంటి వారిదే!!

– రెవ.టి.ఎ.ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు