చచ్చాక పొడవు పెరిగింది!

20 May, 2018 01:41 IST|Sakshi

ఓ సూఫీ జ్ఞాని నివాసముంటున్న ఓ ఊళ్ళో ఓ రైతు ఉన్నాడు. అతను తన ఇంటి పెరట్లో ఓ రెండు అడుగుల పామును కొట్టి చంపాడు. వెంటనే ఇంట్లోకి వచ్చి భార్య, బిడ్డలతో తాను మూడడుగుల పామును చంపానని చెప్పాడు. అతని భార్య వెంటనే పక్కింటావిడతో తన భర్త అయిదడుగుల పామును కొట్టి చంపాడని గొప్పగా చెప్పింది. కాస్సేపటికి ఆ పొరుగింటావిడ పక్క వీధిలో ఉన్న తన మిత్రురాలింటికి వెళ్ళి మా వీధిలో మా ఇంటి పక్కింట్లో ఒకతను పది అడుగుల పామును కొట్టి చంపాడని ఒకింత విచిత్రంగా చెప్పింది.
s
ఆ ఇంటావిడ ఈ మాటలు విని ఊరుకోకుండా ఆ రోజు రాత్రి పొరుగూరి నుంచి తన ఇంటికి వచ్చిన చుట్టంతో పక్క వీధిలో ఒకరు ముప్పై అడుగుల పొడవున్న పాముని కొట్టి చంపారని మరింత ఆశ్చర్యంగా చెప్పింది. ఇలా ఒక్కొక్కరి నోటా చనిపోయిన పాము పొడవు పెరుగుతున్న విషయం సూఫీ జ్ఞాని చెవుల దాకా వ్యాపించింది. సూఫీ జ్ఞాని రైతు కొడుకుని పిలిపించాడు. మీ నాన్న ముప్పయి అడుగుల పామును చంపాడటగా అని అడిగారు. ఆ కుర్రాడు జ్ఞాని వంక విచిత్రంగా చూసి చనిపోయిన పాము పొడవు పెరుగుతుందా అని అమాయకంగా అడిగాడు.

అతని మాటలు విన్న జ్ఞాని ఓ చిర్నవ్వు నవ్వారు. తండ్రి తాను పామును కొట్టి చంపానని చెప్పడంతోనే ఆ కుర్రాడు పెరట్లోకి వెళ్ళి చచ్చిన పామును చూశాడు. అది రెండడుగులకు మించి లేకపోవడాన్ని గ్రహించాడు. ఆ కుర్రాడిలా ప్రతి ఒక్కరూ నిజాన్ని అన్వేషిస్తే తప్పుడు ప్రచారానికి ఆరంభంలోనే అడ్డుకట్ట వేయొచ్చు కదా అని జ్ఞాని గ్రామప్రజలను ప్రశ్నించారు.
దాంతో ఊరి ప్రజలందరూ తల దించుకుని అవును కదా అనుకున్నారు.

– యామిజాల జగదీశ్‌

మరిన్ని వార్తలు