అమ్మానాన్నలను ఆదరిస్తే అల్లాను ఆరాధించినట్లే!

14 Oct, 2018 01:29 IST|Sakshi

అల్లాహ్‌ తరువాత మానవులకు అత్యంత ఆదరణీయులు, గౌరవనీయులు తల్లిదండ్రులే. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, సేవాభావం లేని మానవజన్మ నిరర్ధకం అంటున్నది ఖురాన్‌. కాని దురదృష్టవశాత్తు ఈనాడు తల్లిదండ్రుల్ని సంతానం పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచు వినబడుతున్నాయి. అంతేకాదు, సంతానం తమను చూడడం లేదని తల్లిదండ్రులు న్యాయస్థానాల మెట్లెక్కుతున్న దృష్టాంతాలను కూడా చూడవలసిన పరిస్థితులు దాపురించాయి. ఒక ఐఏఎస్‌ అధికారి తన తల్లిని గుర్తుతెలియని అనాథ అని చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించినట్లు ఒక ఆశ్రమ నిర్వాహకుడు ఇటీవల జరిగిన ఒక టీవీ చర్చలో వెల్లడించారు.

తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడేవారి బాగోగులు చూసుకుంటూ, వారికి సేవలు చేసి వారి ప్రేమను పొందాలి. వారి జీవితకాలంలో ఆప్యాయంగా ప్రేమగా చూసుకోకుండా తదనంతరం ఎన్ని చేసినా వ్యర్థమే. తల్లిదండ్రుల్ని పట్టించుకోని వారిని సమాజమూ ఆదరించదు, దైవమూ మెచ్చుకోడు. పైగా అలాంటి వారిని దైవం శిక్షిస్తాడు. ఇహలోకంలోనూ పరాభవం పాలు చేస్తాడు, పరలోకంలోనూ నరక శిక్షకు గురిచేస్తాడు. అందుకే మమతలమూర్తి ముహమ్మద్‌ స.సల్లం ‘తల్లిపాదాల చెంత స్వర్గమున్నదని, తండ్రి స్వర్గానికి సింహద్వారమని, వారిసేవ చేసి వారి ప్రేమను, ఆశీర్వాదాలనుపొంది, వారిని ప్రసన్నం చేసుకోకపోతే స్వర్గప్రవేశం అసాధ్యమని’ ఉపదేశించారు.

కాబట్టి బాల్యంలో వారు మనల్ని ఎంత ప్రేమతో, కరుణతో, వాత్సల్యంతో పెంచి పోషించారో, వారి వృద్ధాప్యంలో మనం వారికి అంతకంటే ఎక్కువ ప్రేమానురాగాలతో సేవలు చేయాలి. పసితనంలో వారు ఒక్క క్షణం నిర్లక్ష్యం చేసి ఉంటే, పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. కనుక వారి బాగోగుల్ని, వారి ఆరోగ్యాన్ని, వారి మానసిక స్థితిగతుల్ని పట్టించుకోవాలి. వారిని ఎప్పుడూ ఆనందంగా ఉంచడానికి ప్రయత్నించాలి. వారు నొచ్చుకునే విధంగా, వారి మనసుకు కష్టం కలిగే విధంగా ప్రవర్తించకూడదు.  కసురుకోకూడదు. ఇంటిదగ్గర ఉన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరడం అజ్ఞానం, అవివేకమే తప్ప మరేమీ కాదు. అల్లాహ్‌ మనందరికీ తల్లిదండ్రుల సేవ చేసి, వారి ఆశీర్వాదాలు పొంది తన కృపకు పాత్రులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.

– ఎండీ. ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు