శాసించే దిశ‌గా..!

14 Oct, 2018 01:31 IST|Sakshi

భారీ ఆధిక్యంపై భారత్‌ దృష్టి

ప్రస్తుతం 308/4

పృథ్వీ షా మెరుపులు

నిలకడగా ఆడిన రహానే, రిషభ్‌

వెస్టిండీస్‌ 311 ఆలౌట్‌

ఉమేశ్‌కు 6 వికెట్లు  

ఆరంభంలోనే వికెట్లు తీయడం.. ఆ తర్వాత వేగంగా పరుగులు చేయడం...వెరసి వెస్టిండీస్‌తో రెండో టెస్టులో కూడా భారత్‌ శాసించే పరిస్థితిని సృష్టించుకుంది. క్రీజులో రహానే, రిషభ్‌ పంత్‌ నిలదొక్కుకొని సెంచరీల దిశగా సాగుతుండటం... వీరి తర్వాత వచ్చే జడేజా సహా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లో కూడా మరిన్ని పరుగులు జోడించే సత్తా ఉండటంతో భారత్‌కు భారీ ఆధిక్యం దక్కే సూచనలున్నాయి. మొత్తానికి మూడో రోజు ఆట అటు విండీస్‌కు, ఇటు భారత్‌కు కీలకం కానుంది.

సాక్షి, హైదరాబాద్‌  : వెస్టిండీస్‌ తొలిరోజు ఆకట్టుకుంది కానీ... రెండో రోజు తేలిగ్గానే ఆలౌటైంది. భారత్‌ రెండో సెషన్‌ మినహా రెండో రోజంతా శాసించింది. శనివారం ఉదయం ఉమేశ్‌ యాదవ్‌ మిగతా మూడు వికెట్లను పడేయడంతో వెస్టిండీస్‌ ఆట ముగిసింది. భారత్‌ ఆట పృథీ షా (53 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ‘షో’తో మొదలైంది. చివరకు రహానే నేర్పుతో నిలబడింది. రిషభ్‌ పంత్‌ అండతో అబేధ్యమైన భాగస్వామ్యం సాగింది. రెండో రోజు ఆట నిలిచే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. వెస్టిండీస్‌ స్కోరుకు కేవలం 3 పరుగుల దూరంలో ఉంది. రహానే (174 బంతుల్లో 75 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (120 బంతుల్లో 85 బ్యాటింగ్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు.   

మరో 16 పరుగులకే... 
ఓవర్‌నైట్‌ స్కోర్‌ 295/7తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన విండీస్‌ మిగిలిన 3 వికెట్లను  త్వరగానే కోల్పోయింది. జట్టు స్కోరు 300 దాటిన కాసేపటికే ఆలౌటైంది. 296 పరుగుల వద్ద బిషూ  (2) పెవిలియన్‌ చేరగా, శతక వేటలో నిలిచిన ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మన్‌ ఛేజ్‌ (176 బంతుల్లో 106; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఛేజ్, గాబ్రియెల్‌ (0) వరుస బంతుల్లో ఔట్‌ కావడంతో 101.4 ఓవర్లలో 311 పరుగుల వద్ద విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ మూడు వికెట్లను ఉమేశ్‌ యాదవే పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఉమేశ్‌ తన తొలి బంతికే వికెట్‌ తీస్తే ‘హ్యాట్రిక్‌’ అవుతుంది. అతను మొత్తం 6 వికెట్లు తీసుకోగా, కుల్దీప్‌కు 3 వికెట్లు దక్కాయి. ఉమేశ్‌ తన టెస్టు కెరీర్‌లో ఐదుకి మించి వికెట్లు పడగొట్టడం ఇది రెండోసారి.   స్పిన్నర్లు శాసించే భారత గడ్డపై 1999 తర్వాత 6 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా అతను నిలిచాడు.   

పృథ్వీ పటాస్‌... 
టీనేజ్‌ ఓపెనింగ్‌ సంచలనం పృథ్వీ షా తనను ఇప్పుడప్పుడే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌తో పోల్చొద్దన్నాడు. కెప్టెన్‌ కోహ్లినేమో అతన్ని అలా వదిలేయండని అన్నాడు. కానీ అతను మాత్రం విండీస్‌ బౌలర్లను వదల్లేదు. వీరేంద్రుడిలాగే చెలరేగాడు. స్ట్రోక్‌ ప్లేలో అతన్నే తలపించాడు. ఆడాల్సిన బంతిని ఆడేశాడు. ఆపాల్సిన బంతిని అద్భుత డిఫెన్స్‌తో అడ్డుకున్నాడు. ఉన్నంతసేపు బౌండరీలతో భారత స్కోరును పరుగు పెట్టించాడు. అతని జోరుతో  స్కోరు వన్డేలాగే 7.2 ఓవర్లలోనే 50 పరుగులకు చేరింది. రాహుల్‌ ఔటయ్యేసరికి జట్టు స్కోరు 61 పరుగులు కాగా... రాహుల్‌ చేసింది నాలుగే. దీంతో పృథ్వీ ‘షో’ ఎంత ధాటిగా సాగిందో ఈపాటికే అర్థమై ఉంటుంది. పృథ్వీకి చతేశ్వర్‌ పుజారా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పృథ్వీ 39 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌ సహాయంతో తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత భారత్‌ 80/1 స్కోరు వద్ద లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది. 

కలవరపెట్టిన సెషన్‌... 
ఉరిమే ఉత్సాహంతో మొదలైన తొలి సెషన్‌కు రెండో సెషన్‌లో బ్రేక్‌లు పడ్డాయి. జోరుమీదున్న పృథ్వీ షా, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా, కెప్టెన్‌ కోహ్లి (78 బంతుల్లో 45; 5 ఫోర్లు)ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట 98 పరుగుల వద్ద పృథ్వీ షోకు వారికెన్‌ తెరదించాడు. తర్వాత కోహ్లి క్రీజులోకి రాగా... 4 పరుగుల వ్యవధిలో పుజారా (10) వికెట్‌ను గాబ్రి యెల్‌ పడగొట్టాడు. ఈ దశలో రహనేతో కలిసి కోహ్లి నింపాదిగా ఆడాడు. ఇద్దరూ వికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చి జట్టు స్కోరును నడిపించారు. దీంతో భారత్‌ 37.5 ఓవర్లలో 150 పరుగులకు చేరింది. అనంతరం కాసేపటికే కోహ్లి వికెట్‌ను కోల్పోయింది. జట్టు స్కోరు 162 పరుగుల వద్ద హోల్డర్‌ బౌలింగ్‌లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూకు వెళ్లినా... కోహ్లికి నిష్క్రమణ తప్పలేదు. దీంతో 60 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సెషన్‌లో 31 ఓవర్లు ఆడిన భారత్‌ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 93 పరుగులు చేసింది. 

ఆదుకున్న రహానే, పంత్‌... 
గత సీజన్‌లో సొంతగడ్డపై తడబడిన రహానే... అసలైన సమయంలో తన సత్తా చాటాడు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌తో కలిసి జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ పరుగులు జోడించారు. 55వ ఓవర్లో జట్టు 200 పరుగులు చేసింది. సెషన్‌ సాగేకొద్దీ ఇద్దరి సమన్వయంతో జట్టు స్కోరు పెరుగుతుంటే... పర్యాటక బౌలర్లకేమో చిక్కిన పట్టు కాస్తా చేజారి నిరాశను పెంచింది. ఇద్దరు క్రీజులో పాతుకుపోవడంతో భారత్‌ స్కోరు కూడా సాఫీగా సాగిపోయింది. నిదానంగా ఆడిన రహానే 122 బంతుల్లో (4 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, అడపాదడపా బౌండరీలు బాదిన రిషభ్‌ పంత్‌ 67 బంతుల్లో (9 ఫోర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు అజేయంగా సాగడంతో జట్టు స్కోరు 77వ ఓవర్లో 300 పరుగులు దాటింది. వీళ్లిద్దరు కలిసి అబేధ్యమైన ఐదో వికెట్‌కు 146 పరుగులు జోడించారు. ఈ సెషన్‌లో 34 ఓవర్లు వేసిన వెస్టిండీస్‌ బౌలర్లు ఈ జోడీని విడగొట్టలేకపోయారు. కనీసం ఒక్క వికెట్‌నైనా చేజిక్కించుకోలేకపోయారు.

ఆ ‘షా’ట్లకు ఫిదా... 
ఆట మొదలైందో లేదో అప్పుడే వెస్టిండీస్‌ కథ ముగిసింది. చప్పట్లతో వెస్టిండీస్‌ చివరి బ్యాట్స్‌మెన్‌ను సాగనంపిన హైదరాబాదీలు... భారత్‌కు మెరుపు ఆరంభమిచ్చిన పృథ్వీ ‘షో’కు ఫిదా అయ్యారు. అతని స్ట్రోక్స్‌లో సెహ్వాగ్‌ను చూసుకున్నారో లేక అతను కొట్టిన సిక్సర్‌ సచిన్‌ను తలపించిందో తెలీదు కానీ... అతని ధాటైన ఇన్నింగ్స్‌ను కేరింతలతో ఆస్వాదించారు. అతను బాదిన బౌండరీలకు జేజేలు పలికారు. గాబ్రియెల్‌ తొలి ఓవర్లోనే ఆఫ్‌సైడ్‌లో కొట్టిన బౌండరీ, హోల్డర్‌ ఓవర్లో కనువిందైన కవర్‌ డ్రైవ్, స్క్వేర్‌లెగ్‌ బౌండరీ... వీటన్నింటి మించి వారికెన్‌ వేసిన 8వ ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ ఫోర్లు ఇలా అన్నీ హైలైట్‌గా నిలిచాయి. అతని నిష్క్రమణ కాస్త నిరాశ కలిగించినా... స్టేడియం లో కోహ్లి ఆగమనాన్ని ఘనంగా స్వాగతించారు. ఇక చివరి సెషన్‌లో  రహానే నిదానంగా ఆడుతున్నప్పటికీ... హైదరాబాదీల జోష్‌కు ఊతమిచ్చేలా రిషభ్‌ పంత్‌ ఫోర్లతో రెచ్చిపోయాడు. మొత్తానికి నగరవాసులు శనివారం క్రికెట్‌తో వీకెండ్‌ పండగ చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు