మహిళా రైతుల కుటుంబాలను ఆదుకోరా?

16 Oct, 2018 06:03 IST|Sakshi
మాడ సాగరిక, గొంగళ్ళ విజయ, పాకాల మల్లవ్వ

ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. మాడ సాగరిక, పాకాల మల్లవ్వ, కొరకండ్ల లక్ష్మి, గొంగళ్ల విజయ, రేగుల ఊర్మిళ.. ఈ మహిళలందరూ వ్యవసాయాన్ని ముందుండి నడిపిస్తూ అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మహిళా రైతుల్లో కొందరు మాత్రమే. మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం గత రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో ఉంది (ఎన్‌.సి.ఆర్‌.బి. గణాంకాలు). 2015లో తెలంగాణలో 153 మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన పాకాల మల్లవ్వ చేయి మంచిదని తోటి రైతుల నమ్మకం. ఆమె చేతితో తమ పొలాల్లో విత్తనాలు వేయించుకునేవారు. కానీ, కౌలు రైతు అయిన మల్లవ్వ వరుసగా నాలుగేళ్లు నష్టాలపాలై 2015 డిసెంబర్‌ 12న ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన మాడ సాగరిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు పత్రికల్లో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో చర్చనీయాంశమైంది. అయినా ఈ కుటుంబాలకు ఇప్పటి వరకూ ఎక్స్‌గ్రేషియా అందలేదు. మహిళా రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఇకనైనా ఆర్థికంగా ఆదుకోవాలి.
– బి. కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక

మరిన్ని వార్తలు