ఆరోగ్యం.. ఆహ్లాదం..

16 Oct, 2018 06:11 IST|Sakshi
వెంకటేశ్వరరావు, రామతులసి దంపతులు

‘సాక్షి’లో వారం వారం ‘ఇంటిపంట’ల సాగుపై ప్రచురితమవుతున్న కథనాలతో స్ఫూర్తి పొందిన దంపతులు తమ ఇంటిపైన గత 4 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి దంపతులు గ్రామంలోని బీసీ కాలనీలోని తమ డాబాపై ఇంటి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డాబాపై సుమారు సెంటున్నర ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సెంటు మేరకు ఇంటి పంటల సాగుకు కేటాయించారు. శ్లాబుపైన మూడు వరుసలుగా ఎత్తు మడులు(గాడులు) నిర్మించారు.
వీటిలో తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పొదీనా విత్తనాలు చల్లారు. వంగ, బెండ, గోరుచిక్కుడు, టమోట మొక్కలు నాటారు. అక్కడక్కడా తొట్లను ఏర్పాటుచేసి బీర, కాకర, దోస, పొట్ల, సొర విత్తనాలు నాటారు. నాలుగు నెలల క్రితం నాటిన విత్తనాలు ప్రస్తుతం  కాపు నిస్తున్నాయి.  
– ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు

రోజుకు గంట చాలు
సాక్షిలో కథనాలు చదివిన తర్వాత మా డాబాపైనా ఖాళీ స్థలం ఉంది కదా మనమూ పండించుకుందాం అన్న ఆలోచన వచ్చింది. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నాం. మేం తినటమే కాకుండా ఇరుగు, పొరుగు వారు, బంధువులు, స్నేహితులకు కూడా కూరగాయలు ఇస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక అర్థగంట మొక్కలతో గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బడలిక, ఒత్తిడి పోతుంది.
– రామతులసి, వెంకటేశ్వరరావు (93934 36555) దంపతులు

మరిన్ని వార్తలు