జాతికంతటికీ చాటేందుకే అవధాన రాజధానీ..

30 Oct, 2014 23:58 IST|Sakshi
జాతికంతటికీ చాటేందుకే అవధాన రాజధానీ..

తీయని గొంతుతో, అందమైన రాగాలాపనతో పద్యాలు పూరించడం ఆయన ప్రత్యేకత... అత్యంత పిన్న వయస్సులో అవధానం చేసిన ఆయనే ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ.
అవధానానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఈ పుంభావ సరస్వతి ప్రస్తుతం అవధాన రాజధానీ పేరుతో ఢిల్లీలో నవంబరు 2 నుంచి 9 దాకా  ఏకధాటిగా ఎనిమిది రోజులపాటు 500 మంది పండితులతో కూడుకున్న సహస్రావధానం చేస్తున్నారు...
 ఈ సందర్భంగా సాక్షితో ప్రత్యేకంగా సంభాషించారు...

 
మీ గురువులు ఎవరు?

ఎవరికైనా సరే తల్లిదండ్రులే ప్రథమ గురువులు. మా తల్లిదండ్రులు మాడుగుల నాగభూషణశర్మ, సుశీలమ్మ. నా చిన్నప్పుడే అంటే, నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికే నాన్నగారు నాకు అమరం, ఆంధ్రనామ సంగ్రహం చెప్పారు. అక్షరాభ్యాసం చేయించిన గురువులు శ్రీ నరసింహాచార్యులు.
     
అవధానాన్ని నిర్వచిస్తారా?


అవధానం అంటే ఏకాగ్రత. చిత్తైగ్య్రం అవధానం అని అలంకార సూత్రాలలో వామనుడు అన్నాడు. అవధానంలో ఏకాగ్రత, వ్యగ్రత ఏకకాలంలో కలిసే ధారణ ప్రక్రియ ఉంటుంది. వంద, వెయ్యి, రెండు వేలు... ఎన్నో అంశాలలో ఏకకాలంలో ఏకాగ్రత కలిగి ఉండటం అవధాన లక్షణం. ప్రారంభంలో అవధానం వేదాలలోనే ఉంది. అక్కడ నుంచి లౌకిక సాహిత్యంలోకి ప్రవేశించింది. ఇది మన తెలుగు భాషలో విస్తరించినంత గొప్పగా ఏ ఇతర భాషల్లోనూ ప్రసరించలేదు. మనల్ని చూసే కన్నడిగులు, తమిళులు ప్రారంభించారు. అయితే దాని స్వరూపం వేరు.
 
మీరు కొన్ని వందలరకాల అవధానాలు చేశారు కదా? వాటిలో మీకు బాగా నచ్చిన, మిమ్మల్ని నొప్పించిన అవధానం ఉందా?

ప్రతి అవధానమూ నచ్చితేనే చేస్తాం. ఇష్టపడి చేస్తాం. అందువల్ల నొప్పి అనేది ఉండదు. అయితే ఎలా పూరిస్తామా అనే సమస్యాత్మక సందర్భాలు తటస్థపడుతుంటాయి. అమ్మవారి కృప వల్ల అలా అనుకున్నప్పుడు అత్యంత అద్భుతమైన పద్యమే ఆవిష్కరింపబడుతుంది.
     
అటువంటి పద్యం కాని శ్లోకం కాని ఒకటి వివరిస్తారా...

1993 ప్రాంతంలో కాకినాడలో జరిగిన శతావధానంలో, మండపేట పోదాం వస్తావా చిలకా అని ఒక పద్యపాదం ఇచ్చి, ఆ పదాలను ఉపయోగిస్తూ సంస్కృతంలో శిఖరిణీ వృత్తంలో దేవదేవి, శ్రీచక్రధారిణి అయిన అమ్మవారిని వర్ణించమని శ్రీచెరువు సత్యనారాయణశాస్త్రి అనే మహాపండితుడు కోరారు. ఆయన స్వయంగా విద్వాంసుడు, అవధాని, వయ్యాకరణుడు. ఆయన ఇచ్చిన మండపేట పోదాం అన్న వాక్యంతో శిఖరిణీ వృత్తం రాదు. అలాంటప్పుడే అవధానికి ఒక్క క్షణంలో ఆలోచన స్ఫురించాలి. మొదటి పాదం చివరి భాగం, రెండవ భాగం యొక్క మొదటి భాగం కలిస్తే ఛందస్సు సరిపోతుంది.
 తపోదాంతే భక్తే కురుకురు దయాం
 తద్‌హృదయమం డపే ట త్వం
 నిత్యం భగవతి శివానంద లహరీ
 శివస్తానేవ త్వయి గత మహా శక్తి విభవః
 వయం కేవాస్తోతుం శుభంచి లకారార్ణ నిలయే॥
 ఓ భగవతీ, శివానందలహరీ! తపస్సు చేత ఇంద్రియ నిగ్రహ సంపన్నుడైన భక్తుని యందు దయను ప్రసరించు తల్లీ! అటువంటి భక్తుని హృదయమండపమునందు సంచరించు! ఎందుకు నిన్ను ప్రాధేయపడటం అంటే, లోకేశ్వరేశ్వరుడైన ఆ శివుని శక్తి, వైభవం నీయందే ఉన్నాయి. నిన్ను పొగడటానికి మేమెంతవారం తల్లీ! ల (అమ్మవారు) కార వర్ణమునందు కొలువున్నదానా... అని పూరించాను. పృచ్ఛకులు ఎంతో సంబరపడ్డారు.
 
అవధానంలో మీకు బాగా కష్టమైన అంశం ఏదని భావిస్తారు?

నేను ఇష్టంగా స్వీకరించి కూర్చున్నవాడిని, కనుక అంతా ఇష్టమే. ఎంత కష్టపెట్టాలని భావించి కష్టమైన సమస్యలు ఇస్తే, నాకు అంత ఇష్టం. అటువంటప్పుడే మంచి పద్యాలు వస్తాయి.
     
అన్నవరం సుప్రభాతం మీరు రాశారట కదా! దాని గురించి...

అన్నవరం దేవస్థానం వారు స్వయంగా నా చేత రాయించుకున్నారు. అన్ని సుప్రభాతాల్లా కాకుండా విలక్షణంగా ఉండాలన్నారు. అప్పుడు అక్కడ నెల రోజులు కూర్చుని రాశాను. అప్పుడు నాకు 27 సంవత్సరాలు. ఆ సుప్రభాతాన్ని శృంగేరి భారతీతీర్థ ఆమోదించారు. అయితే ఆయన ఆమోదానికి ముందు, ఈ సుప్రభాతాన్ని అంగీకరించడానికి విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, తంగిరాల బాలగంగాధరశాస్త్రి గార్లను నియమించా రు. ఒకరు వయ్యాకరణులు, ఒకరు సాంగత్రివేద అధ్యేత, తార్కికులు. విశేషమేమిటంటే వీరిద్దరూ కవిత్వమంటేనే విముఖులు!
     
అవధానాలలో ఎప్పుడైనా మీరు చదవని పుస్తకం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా ఎదుర్కొంటారు?


ఎవ్వరూ సర్వజ్ఞుడు కాదు. అది కేవలం భగవంతుడు మాత్రమే. ఇతరులకు కుదరదు. అయ్యో చదవలేదే అని మనసులో ఉంటుంది. అయితే అమ్మవారి దయతో అపఠితమపి పఠితమివ చదవనిది కూడా ఆ సమయంలో చదివినట్లు స్ఫురిస్తుంది.  

రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో చేయడానికి కారణం?

అవధానం ఆంధ్రులదే అయినా ఒక్కసారి అవధాన ప్రతిష్ఠ,  తేజస్సు జాతికంతటికీ తెలియాలి. శిఖరాయమానంగా ఢిల్లీలో జరుగుతోంది కాబట్టి అందరికీ తెలుస్తుంది. 2000లో ఢిల్లీలో జరిగిన మిలీనియం అవధానంలో 225 మంది పండితులు పాల్గొన్నారు. ఇప్పుడు 500 మంది పాల్గొంటున్నారు.
     
కొత్తగా వచ్చే అవధానులకు సూచనలు...

శ్రద్ధ చాలా అవసరం. మనసును, ఆత్మను అర్పణ చేసి, ‘ఇది నాకు రావాలి’ అనుకునేంత తపన ఉండాలి. అందుకోసం బాగా సాధనచేయాలి. ముఖ్యంగా పుష్టిగా చదవాలి. తుష్టిగా తన ముందు అవధానులను పరిశీలించాలి. అన్ని భారతీయ, అన్ని అభారతీయ భాషలను పరిశీలిస్తే... ఒక్క తెలుగుభాషలో మాత్రమే అవధానం ఉంది. నేత్రావధానం, ఘటికావధానం, పుష్పావధానం... ఇవన్నీ ఇందులో చిన్న చిన్న భేదాలు. సాహిత్యంలో అవధానమే సంపూర్ణమైన రూపం.

కొత్తగా జోడించిన అంశాలు...

స్వరపది... ఒక గాత్ర విద్వాంసుడు లేదా వాద్య నిపుణుడు, ఒక రాగాన్ని ఆలపించగానే, ఆ రాగాన్ని గుర్తించి, ఆ రాగంలోనే ఒక అర్థవంతమైన గీతాన్ని సృజిస్తారు.
 
నృత్యపది...
కథక్, మణిపురి, భరతనాట్యం లేదా కూచిపూడి వంటి నృత్యరీతులలో ఒక నృత్య కళాకారుడు లేదా నృత్యకళాకారిణి తన నృత్యాన్ని గీతరహితంగా చేస్తారు. రెండు నిమిషాల వ్యవధానంలో మళ్లీ ఆరంభిస్తారు. అవధాని, ఆ నృత్యరీతిని గుర్తించి, హావభావాలను బట్టి, ఆ నృత్యం ఏమిటో వివరిస్తూ, ఒక గీతం రచిస్తారు. ఆ కళాకారుడు/ కళాకారిణి శ్రుతి, లయ, రాగయుక్తమైన రీతిలో నృత్యాభినయాన్ని కొనసాగిస్తారు.
 
చిత్రపది... ఒక విఖ్యాత చిత్రకారుడు ఒక చిత్రాన్ని గీయటం ఆరంభిస్తారు. ఆ రేఖలను, గీతలను చూసిన అవధాని ఆ రేఖల క్రమాన్ని గమనిస్తూ ఆ రేఖల క్రమానుగతమైన పద్ధతిలో ఆ చిత్రాన్ని గురించిన ఒక గీతం గానం చేస్తారు.
 ఈ మూడు అవధాన క్రీడలు డా. మాడుగుల వినూత్న ఆవిష్కరణలు. అవధాన రాజధానీ కార్యక్రమంలో వీటిని కూడా మేళవించనున్నారు.
 
సంభాషణ: డా. పురాణపండ వైజయంతి
 

మరిన్ని వార్తలు