మారకపోతే... పావు వంతు ఎడారే!

3 Jan, 2018 01:22 IST|Sakshi

భూమి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగితే చాలు... పావు వంతు నేల బతికేందుకు వీల్లేని రీతిలో ఎడారిగా మారిపోవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేనా. దీనివల్ల వ్యవసాయం దెబ్బతినడమే కాదు... జీవవైవిధ్యం అంతరించిపోయి, మరిన్ని కరువుకాటకాలు, కార్చిచ్చులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ విషయాలన్నీ గతంలో విన్నవే అయినప్పటికీ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇంకోసారి ఈ విపరిణామాలను ధ్రువీకరించింది కాబట్టి ప్రాధాన్యమేర్పడింది.

నేచర్‌ క్లయిమేట్‌ ఛేంజ్‌ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం... ప్రపంచ వాతావరణ భవిష్యత్తుకు సంబంధించి అందుబాటులో ఉన్న 27 కంప్యూటర్‌ నమూనాల విశ్లేషణ ద్వారా తుది అంచనాకు వచ్చారు. భూతాపోన్నతికి కారణమవుతున్న గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించకపోతే 2052 – 70 మధ్య కాలానికే సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే ఎక్కువవుతుందని వారు హెచ్చరించారు.

ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగం, దక్షిణాఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్య అమెరికా ప్రాంతాల్లో ఈ ఎడారీకరణ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దాదాపు 150 కోట్ల మంది ప్రభావితమవుతారని ఈ పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్త మనోజ్‌ జోషీ తెలిపారు. అయితే ప్యారిస్‌ ఒప్పందంలో నిర్ణయించిన మాదిరిగా సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయగలిగితే మాత్రం ఈ ప్రమాదాన్ని దాదాపుగా పరిహరించవచ్చునని వివరించారు.

మరిన్ని వార్తలు