వద్దని గ్రూప్‌కి ఎక్కినందుకు పెద్దలకు కోపం వచ్చింది!

23 Jan, 2018 00:56 IST|Sakshi

కన్యత్వ పరీక్ష 

ఆచారాలు ఉండాల్సిందే. కానీ అవి ‘అత్యాచారాలు’ కాకూడదు! కొన్ని ఆచారాలైతే అసలే ఉండకూడదు. కానీ ఉన్నాయి. ఇంకా ఉంటూనే ఉన్నాయి. ‘ఇంకా’ అంటే.. మనం నాగరికులం, నవనాగరికులం అనుకుంటున్నాం కదా! మహారాష్ట్రలో ఏం జరిగిందో చూడండి. పుణెకి దగ్గరల్లోని పింప్రీ అనే ప్రాంతంలో కంజర్‌భట్‌ అనే కమ్యూనిటీ ఉంది. వాళ్లకో ఆచారం ఉంది. వధువు కన్యా? కాదా? అని తెలుసుకునే ఆచారం! అయితే పెళ్లికి ముందు తెలుసుకోరు. పెళ్లయ్యాక మొదటి రాత్రి తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? తెలుసుకుని ఏం చేస్తారు అనేది తర్వాత చూద్దాం.  ఇప్పుడైతే మొన్న ఆదివారం ఏం జరిగిందో చూద్దాం. కమ్యూనిటిలో ఒక అమ్మాయికి పెళ్లయింది. మిగిలిన తంతు ఇక ఆమె కన్యత్వ పరీక్ష. తొలిరాత్రికి ముందు రోజు కమ్యూనిటీలోని కుర్రాళ్లు ఈ దురాచారానికి వ్యతిరేకంగా ఒక వాట్సాప్‌ గ్రూపు ప్రారంభించారు. ‘స్టాప్‌ ది వి రిచువల్‌’ (కన్యత్వ దురాచారాన్ని ఆపండి) అని ఆ గ్రూపుకు పేరు పెట్టుకున్నారు. ఒకే విధంగా ఆలోచించే వాళ్లంతా ఆ గ్రూపులో చేరారు. కన్యత్వ పరీక్షకు వ్యతిరేకంగా మిగతావాళ్లకు చైతన్యం కలిగించడం మొదలుపెట్టారు. ఆ విషయం కమ్యూనిటీలోని పెద్దవాళ్లకు తెలిసింది. గ్రూపులోని ఒక్కో ఫోన్‌ నెంబర్నీ పట్టుకుని, ఒక్కొక్కర్నీ కొట్టిపడేశారు. ఒక గుంపుగా వచ్చి కొట్టారు. దాడి చేసినవాళ్లలో నలభై మందిపై ఎఫ్‌.ఐ.ఆర్‌. నమోదు అయింది. వాళ్లలో ఇద్దర్ని అరెస్ట్‌ చేశారు. మిగతావాళ్లు పింప్రీ వదిలి పారిపోయారు. పారిపోవలసింది కొట్టినవాళ్లు, కొట్టించుకున్నవాళ్లు కాదు. దురాచారం పారిపోవాలి. దాన్ని తరిమి తరిమి కొట్టాలి.

పింప్రీలోని కంజర్‌భట్‌ కమ్యూనిటీలో ఈ దురాచారం ఎంత ఘోరంగా ఉంటుందంటే.. ఫస్ట్‌నైట్‌ వధూవరులకు ఏర్పాటు చేసిన పట్టెమంచంపై తెల్లటి దుప్పటిని పరుస్తారు. తెల్లారగానే వచ్చి ఆ దుప్పటిని చూస్తారు. దానిపై మరకలు ఉన్నాయా.. అమ్మాయి కన్య అయినట్లు! లేవా.. ఆమె బతుకు బట్టబయలు అయినట్లు! అమ్మాయిని అబ్బాయి వదిలేస్తాడు! లేదా.. ఎవరితో కలిసి ఆమె ‘తప్పు చేసిందో’ అతని పేరు కనుక్కుని అతని చేత, ఆమె చేత ఫైన్‌ కట్టించి అప్పుడు అమ్మాయిని వరుడు దగ్గరికి కాపురానికి పంపిస్తారు పెద్దలు. సైన్స్‌ ఎంత డెవలప్‌ అయినా, కామన్‌సెన్స్‌ డెవలప్‌ కాకపోతే ఇలాంటి దురాచారాలే జీవితాలను శాసిస్తుంటాయి. అసలు స్త్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం ఉండడంలోనే మన ఆచారాల్లోని డొల్లతనమంతా ఉంది. ఆచారం అన్నది మానవ జీవితం మెరుగవ్వడానికి తోడ్పడాలి తప్ప, ఎవరి జీవితానికీ ప్రతిబంధకం కాకూడదు.      

మరిన్ని వార్తలు