Feroze Gandhi: ఫిరోజ్‌ గాంధీకి హిందూరీతిలో ఎందుకు అంత్యక్రియలు జరిగాయి?

10 Sep, 2023 08:36 IST|Sakshi

అది 1960, సెప్టెంబరు 7.. ఫిరోజ్ గాంధీ వారం రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నారు. ఆ నొప్పి ఇక భరించలేక తన స్నేహితుడైన డాక్టర్ హెచ్‌ఎస్ ఖోస్లాకు ఫోన్ చేశారు. తరువాత తానే కారు నడుపుతూ ఢిల్లీలోని వెల్లింగ్‌టన్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన భార్య ఇందిరా గాంధీ ఢిల్లీకి దాదాపు 3 వేల కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రంలో ఉన్నారు. ఈ వార్త తెలియగానే ఇందిర వెంటనే ఢిల్లీ బయలుదేరారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు.

48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు...
ఇందిరా గాంధీ ఆ రాత్రంతా ఫిరోజ్ పక్కనే కూర్చున్నారు. ఫిరోజ్‌ అపస్మారక స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ 8న ఉదయం కొద్దిసేపు స్పృహలోకి వచ్చారు. అయితే ఆయన తన 48వ పుట్టినరోజుకు 4 రోజుల ముందు కన్నుమూశారు. ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని వెల్లింగ్టన్ హాస్పిటల్ నుండి తీన్ మూర్తి భవన్‌కు తీసుకువచ్చారని బెర్టిల్ ఫాక్ తన పుస్తకం ‘ఫిరోజ్ – ది ఫర్గాటెన్ గాంధీ’లో రాశారు.

అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని... 
తీన్ మూర్తి భవన్‌కు చేరుకున్న ఇందిర.. ఫిరోజ్ గాంధీ భౌతికకాయానికి తానే స్నానం చేయించి, అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని, ఈ సమయంలో అక్కడ ఎవరూ ఉండకూడదని, అందరినీ గది నుండి బయటకు వెళ్లిపోవాలని కోరారు. తీన్ మూర్తి భవన్‌లోని కింది అంతస్తు నుంచి ఫర్నిచర్ తదితరాలన్నింటినీ తొలగించి, అక్కడ ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని తెల్లటి షీట్‌పై ఉంచి, అందరికీ చివరి చూపు కోసం ఉంచారు.

ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి...
బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం ఆ రోజుల్లో బ్రిటిష్ నటి, సినీ విమర్శకురాలు మేరీ సెటన్ జవహర్‌లాల్ నెహ్రూ ఇంటికి అతిథిగా వచ్చినప్పుడు తీన్ మూర్తి భవన్‌లో ఉండేవారు. జవహర్‌లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీతో కలిసి ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని ఉంచిన గదికి చేరుకున్నారని మేరీ రాశారు. ఆ సమయంలో నెహ్రూ ముఖం పూర్తిగా వాడిపోయింది. ఇందిరా గాంధీ కూడా లోలోపల తీవ్రంగా ఆవేదన చెందున్నారు. ఫిరోజ్ గాంధీ చివరి దర్శనానికి వచ్చిన జనాన్ని చూసి నెహ్రూ ‘ఫిరోజ్‌ని జనం ఇంతలా ఇష్టపడతారని నాకు తెలియదు’ అని అన్నారు.

మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు...
సెప్టెంబర్ 9 ఉదయం, ఫిరోజ్ గాంధీ భౌతికకాయం అంత్యక్రియల కోసం నిగంబోధ్ ఘాట్‌కు తరలించారు. ఫిరోజ్ గాంధీ తనకు మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు పార్సీ ఆచారాల ప్రకారం తన అంత్యక్రియలు చేయకూడదని తన స్నేహితులకు తెలిపారు. పార్సీ సమాజ ఆచారంలో మృత దేహాన్ని కాల్చడం లేదా పూడ్చివేయడం చేయరు. దీనికి బదులుగా మృతదేహాన్ని ‘టవర్ ఆఫ్ సైలెన్స్’లో ఉంచుతారు. ఇక్కడ డేగలు, కాకులు, జంతువులు ఆ మృతదేహాన్ని ఆహారంగా తీసుకుంటాయి. కాథరిన్ ఫ్రాంక్ తన పుస్తకం ‘ది లైఫ్ ఆఫ్ ఇందిరా గాంధీ’లో ఇలా రాశారు ‘ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు హిందూ ఆచారాల ప్రకారం జరిగినప్పటికీ, ఫిరోజ్ గాంధీ మృతదేహాన్ని దహనం చేసే ముందు కొన్ని పర్షియన్ ఆచారాలను ఇందిర పాటించారు. ‘అహనవేటి’ అధ్యాయం మొత్తం చదివారు. అనంతరం 18 ఏళ్ల రాజీవ్ గాంధీ తన తండ్రి అంత్యక్రియల చితికి నిప్పంటించారు.

చితాభస్మాన్ని మూడు భాగాలుగా..
ఫిరోజ్ గాంధీ కుటుంబం చాలా కాలం సూరత్‌లో ఉండేది. తర్వాత ఫిరోజ్ అలహాబాద్ వచ్చాడు. దహన సంస్కారాల అనంతరం అతని చితాభస్మాన్ని మూడు భాగాలుగా విభజించారు. పండిట్ నెహ్రూ సమక్షంలో అలహాబాద్ సంగమంలో ఒక భాగం నిమజ్జనం చేశారు. రెండవ భాగం అలహాబాద్‌లో, మూడవ భాగాన్ని సూరత్‌లోని ఫిరోజ్‌ పూర్వీకుల స్మశాన వాటికలో ఖననం చేశారు.
ఇది కూడా చదవండి: డిజిటల్‌ విలేజ్‌ ప్రాజెక్ట్‌ అంటే ఏమిటి? ఆన్‌లైన్‌ సేవలు ఎలా వృద్ధి చెందుతాయి?

మరిన్ని వార్తలు