తగినంత వాడితే విటమిన్లతో లాభమే...

20 Oct, 2018 00:11 IST|Sakshi

జీవక్రియలు సక్రమంగా సాగేందుకు ఉపకరించే విటమిన్లు, ఖనిజాలను తగినంత మోతాదులో వాడితే వయసుతో పాటు వచ్చే ఆరోగ్య సమస్యలను వాయిదా వేయవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన ఆసుపత్రిలో పదేళ్లపాటు జరిపిన పరిశోధనల ఆధారంగా తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు బ్రూస్‌ ఏమ్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. మొత్తం 30 విటమిన్లతో పాటు ఇప్పటివరకూ విటమిన్లుగా గుర్తించని 11 ఇతర పదార్థాలను... దీర్ఘాయుష్షును అందించేవిగా గుర్తించాలని ఏమ్స్‌ అంటున్నారు.

విటమిన్లు, ఖనిజాలు మన శరీరంలో జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడే ఎంజైమ్‌లలో కీలకమైన భాగాలని, దురదృష్టవశాత్తూ చాలామందికి ఇవి తగుమోతాదులో అందడం లేదని చెప్పారు. చాలామంది కొద్దిపాటి విటమిన్‌ లోపాలను పట్టించుకోరని, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ఇది కూడా ప్రభావం చూపుతుందని వివరించారు. కణాల్లోని వందలాది ఎంజైమ్‌లకు ఈ విటమిన్లు, ఖనిజాలు అత్యవసరమన్న అంశాన్ని పోషకాహార నిపుణులు విస్మరించినందుకు ఫలితంగా శరీరం అందుబాటులో ఉన్నవాటిని రోజువారీ పనులకు ఉపయోగిస్తుందని, దీంతో డీఎన్‌ఏ మరమ్మతులకు, వయో సంబంధిత సమస్యల నివారణకు విటమిన్లు, ఖనిజాలు దొరక్కుండా పోతున్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు